ఫాదర్స్ డే అయిపోయి ఐదు రోజులవుతోంది కదా.? అప్పుడే మరచిపోయారా.?

by Daayi Srishailam |

నాన్న ఒక సూపర్ హీరో, త్యాగమే తప్ప తన స్వార్థం తెలియన వ్యక్తి నాన్న.

ఫాదర్స్ డే అయిపోయి ఐదు రోజులవుతోంది కదా.? అప్పుడే మరచిపోయారా.?
X

"ఫాదర్స్ డే" సంబరాలు గ్రాండ్‌గా చేసుకున్నాం.

వాట్సప్ స్టేటస్‌లో మంచి మంచి సందేశాలు పెట్టాం.

ఫేస్‌బుక్‌లో నాన్న గురించి గొప్పగా రాశాం.

నాన్న పేరుమీద ఒక కేక్ కట్ చేసుకున్నాం.

ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకున్నాం.

ఐపోయిందా ఇగ.?

ఓస్.. నాన్నంటే జస్ట్ ఒక్కరోజు మెమొరీయేనా.?

ఒక్కరోజు విషెస్ చెప్పి మర్చిపోవడమేనా ఫాదర్స్ డే ఉద్దేశం.?

అంతే బ్రో..

నాన్నంటే ఇప్పుడు తెలియదు.. తర్వాత తెలుస్తది.

- దిశ, ఫీచర్స్

కష్టాన్ని కళ్ల కింద దాచిపెట్టి.. సంతోషాన్ని చేతినిండా పంచిపెట్టే విధాత నాన్న. తన కోసం ఏదీ దాచుకోనివాడు.. త్యాగాలకు ప్రతిరూపం నాన్న. ఆయన మనసు అర్థంకాని అంతరిక్షం. హృదయం తేల్చుకోలేని పాతాళం.

నాన్నెప్పటికీ అర్థంకాడు

ఒకరంటారు.. "నాన్నా మీకు తెలుసా.? అమ్మ నాపై గర్జిస్తే.. మీరు నా కోటగోడ. అప్పుడప్పుడు దొరికే చిన్ని ఏకాంతంలో ప్రపంచమంతా మన ఊసుల్లోనే. మీరు నేస్తమై మెలిగారు. నడకతో పాటు నడత నేర్పించారు. నా ప్రతీ సందర్భంలోనూ వెన్నంటే ఉండి.. అండగా నిలిచి నేనున్నాననే భరోసా ఇచ్చారు" అనీ. ఇంకొకరంటారు "అంతా మీరే చేశారు నాన్నా.. అంతా మీరు చేశారు. నేను ఏ షర్ట్ వేసుకోవాలో.. ఏం తినాలో.. ఎక్కడికెళ్లాలో అంతా మీరే చెప్తారు. ఇంకా నేనెందుకు నాన్నా అంతా మీరే చేస్తే" అనీ. "మా నాన్న మాకంటూ ఏదీ మిగల్చలేదు. ఉన్నదంతా సంతార్పణం చేసి.. అప్పులు, కన్నీళ్లు మాత్రం మిగిల్చిపోయాడు" అని కొందరి అభిప్రాయం. ఔను నిజమే.. నాన్న బయటకు అలాగే కనిపిస్తాడు. కాఠిన్యం చూపినా.. తిట్టినా.. కొట్టినా.. మెచ్చుకున్నా.. కోట్ల రూపాయల ఆస్తులు మిగిల్చినా.. నాన్న మనకెప్పటికీ అర్థం కాడు.

రోల్ మోడల్ నాన్న

అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న. అమ్మ వెలిగే దీపమైతే దాన్ని వెలిగించే వత్తి నాన్న. సింపుల్‌గా చెప్పాలంటే.. తండ్రి త్యాగాల గుర్తు. అమ్మ ప్రేమ కంటి ముందుంటే.. నాన్న ప్రేమ గుండెల్లో ఉంటుంది. నాన్న ఏది చేసినా కుటుంబం కోసం.. పిల్లల బాగు కోసం చేస్తాడు. నాన్న పిల్లలకు రోల్ మోడల్. పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే దాక అన్నీ తానై పిల్లలకోసం చేస్తాడు. నాన్నకు "నా" అనే భావన అస్సలుండదు. ఆయన ఏది చేసినా "మా కోసం" అనుకునే చేస్తాడు. బాధ్యతలు.. భరోసా విషయంలో నాన్నకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఉండరు. వెనకటి రోజుల్లో నాన్ననొక దైవంతో సమానంగా భావించేవాళ్లు. కానీ నేటితరం పిల్లలు ప్రయోజకులైన తర్వాత ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. కానీ.. వాళ్లు కూడా ఓ బిడ్డకు తండ్రే అనే విషయం మరచిపోతున్నారు.

నాణానికి రెండోవైపు నాన్న

మనం చదువుకుంటాం.. ప్రయోజకులైతాం.. విదేశాల్లో సెటిలై పిల్లా పాపలతో అక్కడే ఉంటాం. ఇవాళ అలా ఉంటున్నామంటే మన నాన్న ఎంత శ్రమకోర్చి మనల్ని ఆ స్థాయికి తీసుకొచ్చారో మాత్రం మరిచిపోతాం. టీనేజ్ వయసులో తన బిడ్డ ఎక్కడ దారితప్పుతాడో అని మాత్రమే మనపై బయటకు కాస్త కటువుగా కనిపిస్తాడు. కానీ నాన్న మనసు ఎప్పటికీ వెన్ననే. చక్కని భవిష్యత్ కోసం చెడుదారులు పట్టకుండా పిల్లల్ని పర్యవేక్షిస్తుంటే.. ఆ పిల్లలకు నాన్న విలన్‌‌లా కనిపిస్తున్నాడు. అందుకే నేటితరం పిల్లలు నాణానికి రెండోవైపు నాన్నని అర్థం చేసుకోలేకపోతున్నారు. పిల్లలు యంగేజ్‌కి వచ్చేసరికి తండ్రికి బాధ్యతలు పదింతలు పెరుగుతాయి. కొడుకును చదివించాలి.. కూతుర్ని ఓ మంచి అల్లుడి చేతిలో పెట్టాలనే తాపత్రయం.. బాధ్యత ఉంటాయి. వాటిని అర్థం చేసుకుంటేనే నాన్న అర్థమవుతాడు.

విశ్వమంతా శోధించాలి

మంచి చెప్పే క్రమంలో ఏ నాన్నయినా వారిస్తాడు. మాటను లెక్క చేయకున్నా బిడ్డ దారి తప్పుతుండేమో అనీ గాడిలో పెట్టడానికి పరితపిస్తుంటాడు. కానీ పెద్దయ్యాక పిల్లలకు నాన్న భారమవుతున్నాడెందుకో.? నాన్నది అండపిండ బ్రహ్మాండాలు దాటిపోయే విశ్వరూపం. ఆయన కష్టాల్ని కళ్లకింద దాచిపెట్టి సంతోషాల్ని మనకు పంచుతాడు. నాన్నచేసే పనిని.. ఆప్యాయతల్ని.. అనురాగాల్ని కొనలేనిదని పిల్లలు గ్రహించిన్నాడే నాన్న మనసు అర్థమవుతుంది. అమ్మ వర్తమానాన్ని చూస్తే.. నాన్న భవిష్యత్తును చూస్తాడు. మన లక్ష్యాలను మనకంటే ముందుగా చూపిస్తాడు. టెక్నాలజీ విస్తరించి నాన్న బోర్ కొట్టేశాడు నేటితరం పిల్లలకు. ఆయన మనకన్నీ చేసేస్తుంటే చాదస్తంలా కనిపిస్తున్నాడు. కానీ.. మనమూ తండ్రులమైతే తెలుస్తుంది నాన్నకు.. పిల్లలకు మధ్యనున్న కమ్యునికేషన్.. రిలేషన్ ఎలాంటిదో. అప్పుడు నాన్నకు నిర్వచనం వెతకాలంటే విశ్వం మొత్తం శోధించాలి.

Next Story