మామిడి పండ్లు తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

by Javid Pasha |

సహజంగా పండిన మామిడి అక్కడక్కడా పచ్చటి మచ్చలతో, అసమానంగా పసుపు రంగులో ఉంటుంది. కృత్రిమంగా పండినవి మొత్తం ఒకే రంగులో బ్రైట్ ఎల్లో లేదా ఆరెంజ్ రంగులో, కొంచెం మెరుస్తూ ఉంటాయి.

మామిడి పండ్లు తింటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
X

దిశ, ఫీచర్స్: వేసవిలో మాత్రమే లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. రుచి, పోషకాలు మెండుగా ఉండే ఈ పండును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ ఈ సీజన్‌లో మార్కెట్లో లభించే అన్ని మామిడి పండ్లు సహజంగా పండినవి కావని, కృత్రిమంగా మాగించినవి ఎక్కువగా ఉంటున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. లాభాల కోసం కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ (కార్బైడ్) వంటి నిషేధించబడిన రసాయనాలతో పండ్లను త్వరగా మాగించే పద్ధతిని అవలంభిస్తున్నారు.

భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) కాల్షియం కార్బైడ్‌ను ఫ్రూట్ రైపెనింగ్‌కు పూర్తిగా నిషేధించింది. ఎందుకంటే ఇది ఆసిటైలీన్ గ్యాస్‌ను విడుదల చేసి పండ్లను కృత్రిమంగా పండిస్తుంది. దీనివల్ల తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ మరియు దీర్ఘకాలికంగా నరాల బలహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు.

కల్తీ పండ్లను ఎలా గుర్తించాలి?

*బకెట్ నీటి చిట్కా (Water Test): ఒక బకెట్‌లో కొన్ని నీళ్లు తీసుకోండి. అందులో మామిడి పండును వేయండి. అది నీటిలో మునిగితే గనుక సహజంగా పండినట్లు లెక్క. నీటిలో తేలితే కెమికల్స్ మిక్స్ చేయడం ద్వారా పండిందని అర్థం చేసుకోవచ్చు.

*రంగు (Color): సహజంగా పండిన మామిడి అక్కడక్కడా పచ్చటి మచ్చలతో, అసమానంగా పసుపు రంగులో ఉంటుంది. కృత్రిమంగా పండినవి మొత్తం ఒకే రంగులో (Uniform) బ్రైట్ ఎల్లో లేదా ఆరెంజ్ రంగులో, కొంచెం మెరుస్తూ ఉంటాయి.

*నల్లటి, తెల్లటి మచ్చలు: సహజంగా పండిన పండ్లపై అక్కడక్కడా బ్రౌన్ లేదా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. కానీ కెమికల్స్ ద్వారా పండినవి అయితే అందుకు భిన్నంగా తెల్లటి పౌడర్ మచ్చలు లేదా కెమికల్ మరకలు కనిపిస్తాయి.

*వాసన (Aroma): సహజ పండ్లకు తీపి, ఘుమఘుమలాడే మామిడి వాసన బాగా వస్తుంది. కృత్రిమ పండ్లకు అసలు వాసన ఉండదు లేదా ఒక రకమైన ఘాటైన రసాయన వాసన వస్తుంది.

*స్పర్శ & ఆకృతి (Texture): కెమికల్ పండ్లు బయట నుంచి నొక్కితే మెత్తగా ఉండి, లోపల మాత్రం గట్టిగా (కచ్చగా) ఉంటాయి. అలాగే ఇవి కొన్న రెండు మూడు రోజులకే త్వరగా కుళ్ళిపోతాయి.

*కట్ చేసి చూడటం: లోపలి గుజ్జు, పై తొక్క వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. సహజంగా పండింది అయితే పసుపు లేదా కాషాయ రంగులో గుజ్జు పాడవకుండా సమానంగా కనిపిస్తుంది.

*బరువు (Weight): రసాయనాలతో పండించిన పండ్లలో రసం సరిగ్గా ఊరదు. కాబట్టి అవి చూడటానికి పెద్దవిగా కనిపించినా, చేతితో పట్టుకుంటే బరువు తక్కువగా (లైట్ వెయిట్‌గా) అనిపిస్తాయి.

ఇలా చేయండి

*ఉప్పు లేదా బేకింగ్ సోడా నీరు: మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను నేరుగా తినకూడదు. ఒక లీటరు నీటిలో కొద్దిగా ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి, అందులో పండ్లను కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. దీనివల్ల పై తొక్కపై ఉండే కెమికల్స్ చాలా వరకు తొలగిపోతాయి.

*తొక్కను పూర్తిగా తొలగించడం: మార్కెట్లో కొన్న మామిడి పండును తినేటప్పుడు తొక్కను పంటితో కొరకకూడదు. తొక్కను పూర్తిగా చెక్కేసి (Peel చేసి), లోపలి గుజ్జును మాత్రమే ముక్కలుగా కోసుకుని తినడం సురక్షితం.

*నమ్మకమైన విక్రేతలు: వీలైనంత వరకు నమ్మకమైన విక్రేతలు, స్థానిక రైతులు, లేదా ఆర్గానిక్ లేబుల్ ఉన్న పండ్లను ఎంచుకోవడం బెటర్.

Next Story