- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందం కోసం అక్రిలిక్ నెయిల్స్ ధరిస్తున్నారా? క్యాన్సర్ రిస్క్ పొంచి ఉన్నట్టే!
అక్రిలిక్ లేదా జెల్ నెయిల్స్ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదు. కానీ వీటిని డ్రై చేయడానికి ఉపయోగించే యూవీ ల్యాంపులు యూవీఏ(UVA) కిరణాలను విడుదల చేస్తాయి. దీంతో ఈ టెంపరరీ గోర్లు ఫిల్ చేసుకోవడం లేదా ధరించడం కారణంగా యూవీఏ కిరణాలు డీఎన్ఏకు హాని కలిగించి, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : అందంగా కనబడాలని ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు! అయితే ఇందుకోసం చేసే ప్రయత్నాలు సరిగ్గా లేకపోతే సమస్యలు ఎదురు కావచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో ‘అక్రిలిక్ నెయిల్స్’ ధరించడం కూడా ఒకటి. ఇటీవల ఓ 35 ఏండ్ల మహిళ తాను ధరించిన ఆర్టిఫిషియల్ గోర్లకింద ఏదో విచిత్రమైన గీతలాంటి మచ్చను గమనించింది. సాధారణమే కదా అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్ల తర్వాత అది పెరిగి ఇబ్బందిగా మారడంతో వైద్య నిపుణులను సంప్రదించగా మెడికల్ టెస్టుల్లో అది సబ్ యూంగల్ మెలనోమా(subungual melanoma) అని తేలింది. ఇది గోరుకింద ఏర్పడే అరుదైన సమస్యే కానీ, చాలా ప్రమాదకరమైన చర్మక్యాన్సర్ రకం అని కూడా పేర్కొన్న వైద్య నిపుణులు కృత్రిమ గోర్లు ధరించడం అంతమంచిది కాదని సూచిస్తున్నారు.
అక్రిలిక్ నెయిల్స్ అంటే?
అక్రిలిక్ నెయిల్స్(Acrylic Nails) అంటే సహజ గోర్లమీద లేదా ప్లాస్టిక్ ఫేక్ గోర్లమీద ఒక రకమైన లిక్విడ్ + పౌడర్ మిశ్రమాన్ని వేసి, గాలిలోనే ఆరబెట్టి లేదా యూవీ ల్యాంప్‌లో క్యూర్ చేసి, గట్టిగా చేసి, అందమైన గోర్ల రూపాన్ని ఇచ్చి, వాటికి పాలిష్ వేసి చేసే కృత్రిమ గోర్లు. ఇవి అమ్మాయిలు లేదా ఆర్టిస్టులు వివిధ ఫంక్షన్లు, ఫెస్టివల్స్ సందర్భాల్లో ముస్తాబులో భాగంగా ధరిస్తుంటారు. తాత్కాలిక గోర్లే అయినప్పటికీ ఒకసారి ధరించాక కొన్నాళ్లు అలాగే ఉంచుతారు. సాధారణంగా 2 నుంచి 3 వారాలకు ఒకసారి ఫిల్-ఇన్ (నింపడం) చేయించుకోవాలి. అయితే వీటిని ఎప్పుడైనా తీసేయవచ్చు. సలూన్‌లో అసిటోన్‌తో లేదా స్పెషల్ టూల్స్‌తో తీస్తారు.
ఎందుకు డేంజర్ ?
నిజానికి అక్రిలిక్ లేదా జెల్ నెయిల్స్ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదు. కానీ వీటిని డ్రై చేయడానికి ఉపయోగించే యూవీ ల్యాంపులు యూవీఏ(UVA) కిరణాలను విడుదల చేస్తాయి. దీంతో ఈ టెంపరరీ గోర్లు ఫిల్ చేసుకోవడం లేదా ధరించడం కారణంగా యూవీఏ కిరణాలు డీఎన్ఏకు హాని కలిగించి, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలం యూవీ ల్యాంపులు వాడకం కూడా చేతులపై చర్మం దెబ్బతినడం, కొన్ని అరుదైన సందర్భాల్లో స్క్వామస్ సెల్ కార్సినోమా (squamous cell carcinoma) వంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే నెయిల్ సలూన్‌కి వెళ్తున్నప్పుడు సన్‌స్క్రీన్ లేదా యూవీ-ప్రొటెక్టెడ్ గ్లౌజెస్ వాడటం, లేదా LED ల్యాంపులు (UV కాకుండా) ఉపయోగించే సలూన్‌లను ఎంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link






