Jealousy : సంబంధాలను దెబ్బతీస్తున్న జెలసీ.. ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్ !

by Javid Pasha |   (  Updated:2025-06-05 13:47:27  IST  )

Jealousy : సంబంధాలను దెబ్బతీస్తున్న జెలసీ.. ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్ !

Jealousy : సంబంధాలను దెబ్బతీస్తున్న జెలసీ.. ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్ !
X

దిశ, ఫీచర్స : జెలసీ.. మనుషుల్లో కనిపించే సహజమైన భావోద్వేగాల్లో ఇది కూడా ఒకటి. కొన్ని అరుదైన సందర్భాల్లో అది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఉదాహరణకు ఒక మంచి విషయంలో ఇతరుల పట్ల అసూయగా ఫీలై.. వారికి మించిన ప్రయత్నం చేయడం ద్వారా అది మీ స్వీయ ఎదుగుదలకు దోహదపడవచ్చు. కానీ అలా కాకుండా ఇతరులను చూసి ఈర్ష్య చెందడమే పనిగా పెట్టుకుంటే మాత్రం జీవితంలో నష్టపోతారు. రిలేషన్‌షిప్‌లోనూ ఇది వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భావోద్వేగాల నియంత్రణ

భావోద్వేగాలు అవసరమే కానీ.. సంబంధాల్లో అవి కూడా జెలసీ(Jealousy)గా మారుతుంటాయి అప్పుడప్పుడు. ఈ సంకేతాలను గుర్తించి జాగ్రత్త పడకపోతే చివరికి మీ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా అవతలి వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేసే టాక్సిక్ ఫోర్స్‌గా మారవచ్చు. కాబట్టి ఆ పరిస్థితి రాకముందు నివారించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

ఓవర్ కంట్రోలింగ్ బిహేవియర్

అప్పుడప్పుడు పలు విషయాల్లో మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రేమతో కూడినది కావచ్చు. కానీ ప్రతీ విషయంలో అదే చేస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది అసూయ లేదా ఈర్ష్యా భావానికి సంకేతంగా నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేయడం, భాగస్వామి సోషల్ మీడియాను తరచుగా చెక్ చేయడం వంటివి ఇందులో భాగంగా ఉండొచ్చు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. సంబంధంలో అపనమ్మకాన్ని సృష్టిస్తుంది. జెలసీ కారణంగా ఈ విధమైన ఓవర్ కంట్రోలింగ్ బిహేవియర్ పుట్టుకొస్తుంది.

తరచూ ఆరోపణలు

మోసం చేస్తున్నారని, అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి ఆధారం లేకుండానే ఆరోపించడం విషపూరితమైన ఈర్ష్యలో భాగం కావచ్చు. ఇది తరచుగా గొడవవలకు, ఇద్దరి మధ్య దూరానికి దారితీస్తుంది. వాస్తవాల ఆధారంగా ఆరోపణ చేయడం వేరు, పనిగట్టుకొని నిందలు వేస్తూ అనవసర ఆరోపణలు చేయడం వేరు. అనవసర ఆరోపణలు తరచుగా చేస్తున్నారంటే అక్కడ జెలసీ సంబంధాన్ని దెబ్బతీసే స్థాయికి చేరినట్లు లెక్క. కాబట్టి మొదట్లోనే గుర్తించి జాగ్రత్త పడాలి. భాగస్వాములిద్దరూ కూర్చొని చర్చించుకోవడం ద్వారా పరిష్కారం లభిస్తుంది.

భావోద్వేగ హాని

భావోద్వేగం మంచి విషయంలో అయితే మంచిదే. కానీ జెలసీ ఎక్కువైనప్పుడు ఇది కూడా హానికరంగా మారుతుంది. లేదా భావోద్వేగాలను ఉపయోగించుకొని ఇతరులను అణిచివేసే ప్రయత్నం కూడా అవతలి వ్యక్తి చేస్తారు. సంబంధాల్లో ఈర్ష్య కారణంగా ఒకరినొకరు అవమానించడం, తీవ్రస్థాయిలో విమర్శించడం లేదా బాధపెట్టే మాటలు మాట్లాడటం సంబంధంలో గౌరవాన్ని నాశనం చేస్తుంది. ఉదాహరణకు ‘నీకు నాకంటే వేరేవాళ్లంటేనే ఇష్టం’ అనో, ‘నువ్వెప్పుడూ ఇతరులతో ఫ్లర్ట్ (flirt) చేస్తావు’ అనో సూటిపోటి మాటలతో బాధపెట్టడం కూడా జెలసీలో భాగమే.

సోషల్ ఐసోలేషన్

ఈర్ష్యతో భాగస్వామిని తన స్నేహితులు లేదా కుటుంబం నుండి వేరుచేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన సామాజిక జీవనాన్ని పరిమితం చేస్తుంది. క్రమంగా తీవ్రస్థాయి మానసిక రుగ్మతకు దారితీయవచ్చు. సామాజిక ఒంటరితనం(Social isolation) వల్ల ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు. కాబట్టి మీ పార్ట్‌నర్‌ తరచుగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులతో కూడా కలువనీయకుండా ప్రవర్తిస్తుంటే అది జెలసీ బిహేవియర్‌గా గుర్తించాలి.

అభద్రతా భావం

నిరంతర ఈర్ష్య అనేది రిలేషన్‌షిప్‌లో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్(Insecure feelings)కి దారితీస్తుంది. ఇది క్రమంగా పరస్పర నమ్మకాన్ని, గౌరవాన్ని పోగొడుతుంది. సంబంధంలో ఒత్తిడిని, అభద్రతను పెంచుతుంది. ఇది తరచూ గొడవలకు, పరిస్థితి చేయిదాటితే విడాకులకు దారితీస్తుంది. అందుకే జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు.

పరిష్కారం ఏమిటి?

సంబంధంలో అంటే భాగస్వాముల మధ్య ఎవరిలో జెలసీ పెరిగిపోయినా, ఇద్దరిలో పెరిగినా నష్టమే. కాబట్టి ఈ సంకేతాలను ముందుగానే గుర్తించినట్లయితే ఓపెన్ కమ్యూనికేషన్ (Open communication) ద్వారా వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే భావోద్వేగాలను వ్యక్తపరచడం, అవసరమైతే నిపుణుల వద్ద కపుల్స్ థెరపీ(couples therapy) సహాయం తీసుకోవడం చేయాలి. జెలసీని నివారించడం, మేనేజ్ చేయడం ద్వారా సంబంధంలో నమ్మకం, విశ్వాసం, పరస్పర గౌరవం ఏర్పడతాయి. సంతోషానికి కారణం అవుతాయి.

Next Story