బాబోయ్ పిల్లలు.. కోప్పడకండి.. ఇలా చేయండి !

by Javid Pasha |

పిల్లలను ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చడం, నలుగురిలో చులకన చేసి మాట్లాడటం, తిట్టడం వంటివి పేరెంట్స్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

బాబోయ్ పిల్లలు.. కోప్పడకండి.. ఇలా చేయండి !
X

దిశ, ఫీచర్స్: పిల్లలన్నాక ఆటా పాటా, సరదా సంతోషం మాత్రమే కాదండోయ్.. పేరెంట్స్‌కు చికాకు తెప్పించేలా కూడా ప్రవర్తిస్తుంటారు చాలాసార్లు. తరచుగా మారాం చేయడం, అల్లరి చేయడం సహజమే. అలాగే కొన్నిసార్లు ఎంతో తెలివిగా, క్రమశిక్షణంగా ఉంటారు. మరికొన్నిసార్లు కోపం తెప్పించేలా కూడా బిహేవ్ చేస్తుంటారు. ఈ సందర్భంలోనే కొందరు పేరెంట్స్ పిల్లల్ని క్రమ శిక్షణ పేరుతో ఎక్కువగా తిట్టడమో, ఇతరులతో పోల్చుతూ హెచ్చరించడమో చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదంటున్నారు నిపుణులు. అది పిల్లల సహజమైన ప్రవర్తనగా గుర్తించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలపై తల్లుల ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మహిళలు మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నైపుణ్యాలు గుర్తించండి

పిల్లలను ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చడం, నలుగురిలో చులకన చేసి మాట్లాడటం, తిట్టడం వంటివి పేరెంట్స్ చేయకూడదు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చదువు కాస్త వెనుకబడితేనో, ముఖ్యంగా పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చినప్పుడో, ఫయిల్ అయినప్పుడో కూడా పేరెంట్స్ పిల్లలను అర్థం చేసుకోవాలి. పిల్లల నైపుణ్యాలను గుర్తించి వాటి ఆధారంగా వారి లక్ష్యాలను నిర్దేశించాలి. వారి భావోద్వేగాలకు మద్దతుగా నిలుస్తూ ప్రమాదకరమైన వాటిని నియంత్రించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. అలాగే ఓటమిని కూడా సానుకూలంగా విశ్లేషించి, గెలవడం ఎలాగో వారికి నేర్పించాలి. బయటి వ్యక్తులైనా, బంధువులైనా, కుటుంబ సభ్యులైనా పిల్లలను తరచుగా తిట్టడం, ఇతరులతో పోల్చడం, హెచ్చరించడం చేస్తుంటే వారు క్రమశిక్షణ లేనివారిగా తయారయ్యే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పైగా ఇలా చేయడం వల్ల వారిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. దీని కారణంగా పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు, పేరెంట్స్‌తో సంబంధాలు క్షీణించే అవకాశం ఉంటుంది.

మనస్తత్వం.. సున్నితత్వం

పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, వారి మనస్తత్వం, సున్నితత్వం తెలిసి మసలు కోవాలంటున్నారు నిపుణులు. హెచ్చరిక ధోరణి ఎల్లప్పుడూ పనికి రాదని చెబుతున్నారు. వారిని సరిదిద్దడానికి ప్రేమగా, దగ్గరికి తీసుకొని తప్పొప్పుల గురించి తెలియజేయాలి. ఎలా మసలుకోవాలో వివరించాలి. అలాగే నలుగురిలో పిల్లలను మెచ్చుకోవడం, వారి గురించి ప్రశంసించడం కూడా చేస్తూ ఉంటే వారి మానసిక స్థితి మెరుగు పడుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పిల్లలు తరచుగా మొండికేయడం, వినకపోవడం, చదువులో మరీ వెనుకబడటం, ప్రవర్తన మార్చుకోకపోవడం వంటివి చేస్తుంటే ఏవైనా బలమైన కారణాలు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మానసిక నిపుణులను, వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా పరిష్కారం లభిస్తుంది.

Next Story