- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yoga Day 2025 : ఆరోగ్య యోగా.. ఆనంద యోగా.. ఆసనాలే కానీ బోలెడు ప్రయోజనాలు !
Yoga Day 2025 : ఆరోగ్య యోగా.. ఆనంద యోగా.. ఆసనాలే కానీ బోలెడు ప్రయోజనాలు !

దిశ,ఫీచర్స్ : యోగా ఒక వ్యాయామం మాత్రమే కాదు, బోలెడు మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే సాధనమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల ఒత్తిడి, ఆందోళలు కూడా దూరం అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. పక్షవాతం, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకోవడంలో యోగా ఒక అద్భుతమైన సాధనం. అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి కూడా ప్రతీ ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2014లో నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘‘Yoga for One Earth, One Health’’ అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే యోగాసనాలవల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.
* తాడాసనం (Tadasana - Mountain Pose): ఈ ఆసనం వేయడానికి ముందుగా పాదాలను ఒకదానికొకటి తాకితస్తూ నిల్చోవాలి. మోకాళ్ల నుంచి ఉదర భాగం వరకూ అన్ని కండరాలను స్టిఫ్‌గా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకిలేపి జోడించాలి. తర్వాత నెమ్మదిగా మడమలు పైకి లేపి వేళ్లపైన కదలకుండా నిలబడాలి. ఇలా 10 నుంచి 12 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ పురాతన యోగాసనం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా ఉంటాయి. దీనిని పురాతన యోగా గ్రంథాలలో ప్రాథమిక ఆసనంగా పేర్కొన్నారు.
* భుజంగాసనం (Bhujangasana - Cobra Pose) : పొట్టను కిందకు ఆనించి పడుకోవాలి. ఈ సందర్భంలో చేతులను భుజాల కిందకు వచ్చేట్టు చూసుకోవాలి. ఈ భంగిమలో ఉండి పూర్తిగా శ్వాస తీసుకొని బిగబట్టి తలను పైకి ఎత్తాలి. భుజాలు, చేతులు పైకి ఎత్తాలి. నాభి భాగం మాత్రం కింద ఉండాలి. ఈ భుజంగాసనం వల్ల హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. మెడ, వీపు దృఢంగా, బలంగా మారుతాయి. కీళ్ల బలం పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. శరీరంలో శక్తి పునరుద్ధరించబడుతుంది.
* ధనురాసనం (Dhanurasana) : శరీరాన్ని విల్లు ఆకారంలో వంచడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిని ‘విల్లు భంగిమ (Bow Pose) అని కూడా అంటారు. ఈ ఆసనంలో బోర్లా పడుకుని చేతులతో చీలమండలను పట్టుకుని, ఛాతీ, కాళ్ల భాగాన్ని పైకి లేపాలి. దీనివల్ల వెన్నెముక బలపడుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. రక్త ప్రవాహం మెరుగు పడుతుంది.
* పద్మాసనం (Padmasana - Lotus Pose): రెండు రేకులు కలిగిన పద్మాన్ని పోలి ఉండటంవల్ల దీనికా పేరు వచ్చింది. తెలంగాణ భాషలో చెప్పాలంటే సక్లం ముక్లం వేసి కూర్చోవడం లాంటిదే. అయితే ఇది ధ్యానాని(meditation)కి అనుకూలమైన ఆసనం. శరీర సమతుల్యతను కలిగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఒత్తిడిని, నిద్రలేమిని దూరం చేస్తుంది. తరచుగా వేయడంవల్ల మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. భారతీయ యోగ సంప్రదాయంలో ఇది ఆధ్యాత్మికతో ఎక్కువగా ముడిపడి ఉంటుంది.
* శవాసనం (Shavasana - Corpse Pose) : యోగాలో ఇది కూడా ఒక ముఖ్యమైన ఆసనం. ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండే భంగిమ కావడంవల్ల ఆ పేరు వచ్చింది. దీనిని ‘శాంతి ఆసనం’ ‘అమృతాసనం’ అని కూడా పిలుస్తారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గిపోయి ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. సాధారణంగా యోగా సెషన్ ముగింపులో ఈ ఆసనాన్ని పాటిస్తుంటారు. అయితే రోజులో ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవడానికి కూడా శవాసనం వేయవచ్చు. నాడీ వ్యవస్థను శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఇవే కాకుండా వజ్రాసనం, వృక్షాసనం, సమకోణాసనం ఇలా అనేక రకాల యోగాసనాలు ఉన్నాయి.






