జస్ట్ వన్ క్లిక్ చాలు.. జీవితాలనే మార్చేస్తున్న ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’!

by Javid Pasha |

ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌లో పరిశుభ్రత, నాణ్యత పాటించకుంటే, ఫొటో తీసి ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

జస్ట్ వన్ క్లిక్ చాలు.. జీవితాలనే మార్చేస్తున్న ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత అనేక విధాలుగా ఉపయోపగడుతోంది. రోజు రోజుకూ విస్తరిస్తూ మానవ జీవితాలను సౌకర్యవంతంగా మారుస్తోంది. ముఖ్యంగా కొత్త కొత్త యాపులు అభివృద్ధి చెందుతూ మెరుగైన జీవితాలకు సహాయపడుతున్నాయి. అలాంటి వాటిలో ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ ఏడాదిలో ప్రారంభించిన ‘ఫుడ్ సేఫ్టీ కనెక్ట్’ అనే మొబైల్ యాప్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఎంతోమంది ప్రజల ఎన్నో జీవితాలను ఆరోగ్యవంతంగా మార్చడంలో ఇది హెల్ప్ అవుతోందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఒక్క యాప్‌ చాలు..

మనలో చాలామందికి ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడో, ధాబాలు లేదా స్ట్రీట్ ఫుడ్‌స్టాల్స్‌లో ఆహారం తింటున్నప్పుడో కొన్నిసార్లు పరిశుభ్రంగా లేదని, నాణ్యత పాటించడం లేదని అనిపిస్తుంది. అక్కడి పరిస్థితి చూడగానే కోపం వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలని అనిపిస్తుంది. కానీ అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉండి పోతుంటారు. కానీ.. ఇలా ఉండాల్సిన అవసరం లేదంటోంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. సాంకేతికతను వినియోగించుకోవాలని సూచిస్తోంది. అంటే ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనే యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చునని చెబుతోంది. కానీ ఇప్పటికీ చాలామంది దీనిని వినియోగించుకోవడం లేదని నిపుణులు అంటున్నారు.

ఏమేమి చేయవచ్చు?

ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ అనే యాప్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌లో అక్కడి పరిస్థితులు, శుభ్రతా పద్ధతులు నచ్చకపోతే వాటిని ఫొటో తీసి అప్‌లోడ్ చేయవచ్చు. అడల్టరేటెడ్ లేదా కలుషితమైన ఆహారం, చీమలు, ఈగలు, కాక్రోచెస్ వంటి వాటితో అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు వంటివి గమనిస్తే ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇలా ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్‌లలో, హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రైమరీ హైజీన్ లేకుండా ఆహారం తయారు చేయడం వంటి సమస్యలను గమనించిన వెంటనే ఫోటోలు, లొకేషన్‌తో సహా యాప్‌లో అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయాలి. దీంతో ఈ ఫిర్యాదు నేరుగా స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారికి చేరి, వెంటనే చర్యలు తీసుకోబడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎలా ఉపయోగించాలి?

ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ఫోన్‌లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక వినియోగించి ఫిర్యాదు చేసేటప్పుడు స్పష్టమైన ఫోటోలు, ఖచ్చితమైన చిరునామా లేదా లొకేషన్ జోడించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల FSSAI ఈ యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, సంబంధిత సంస్థలపై జరిమానాలు వేయడం, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఆహార భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రజల సహకారాన్ని పెంపొందించే అద్భుతమైన సాంకేతికతగా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతీ పౌరుడు తన హక్కును వినియోగించి, అశుభ్రమైన ఆహార విక్రయాన్ని నిరోధించడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సాంకేతికతలు కూడా సమాజంలో పెద్ద మార్పును తీసుకురాగలవని అంటున్నారు. సో.. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీ ఒక్కరరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా తమను, తమ కుటుంబాలను, మొత్తం సమాజ ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.

Next Story