లైఫ్ క్వాలిటీని తగ్గిస్తున్న స్వీయ తప్పిదాలు..! ఎలా ప్రభావం చూపుతాయంటే..

by Javid Pasha |

లైఫ్ క్వాలిటీని తగ్గిస్తున్న స్వీయ తప్పిదాలు..! ఎలా ప్రభావం చూపుతాయంటే..
X

దిశ, ఫీచర్స్ : ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. అయితే అందుకోసం చేసే ప్రయత్నాల్లో భాగంగానే తెలిసో, తెలియకో, అవగాహన లేకో మనం కొన్నిపొరపాట్లు కూడా చేస్తుంటాం. అప్పుడప్పుడైతే పర్లేదు. కానీ అవి రోజువారీ అలవాట్లుగా మారినప్పుడు మన లైఫ్ క్వాలిటీని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనం చేసే పని ఏదైనా సింపుల్‌, ఈజీగా అయిపోవాలని ఆలోచిస్తుంటాం. కానీ అన్ని సందర్భాల్లోనూ అలాగే అనుకుంటే.. అదే మెథడ్‌ను అనుసరిస్తే మాత్రం నష్టపోయే అవకాశం లేకపోలేదు. కామన్‌గా జరిగే అలాంటి స్వీయ తప్పిదాలేవో, నిత్య జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడినీటి‌తో స్నానం చేయడం

అసలే చలికాలం. చాలామందికి గోరు వెచ్చటితో స్నానం చేయడం హాయిగా అనిపిస్తుంది. అయితే ఎక్కువ సేపు హాట్ వాటర్ షవర్ కింద ఉంటే మాత్రం రిస్క్‌లో పడ్డట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరం ఎక్కువసేపు వేడి నీటికి గురికావడంవల్ల చర్మ సమస్యలు తలెత్త వచ్చు. అలాగే నేచురల్ ప్రొటెక్టివ్‌గా ఉండే ఆయిలీ స్కిన్ లేయర్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అధిక హాట్‌వాటర్ ఎక్స్‌పోజర్ కారణంగా చర్మం పొడిబారుతుంది. స్కిన్ అలెర్జీలు రావచ్చు. కాబట్టి గంటల కొద్ది వేడినీటితో స్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఆహారాన్ని వేడిచేసి తినడం

వంట చేయడానికి ఓపిక లేకనో, రాత్రింబవళ్లు వండటం దేనికనో కొందరు కొందరు డే, నైట్ కోసమంటూ ఒకేసారి వండేసి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే తిన్నప్పుడల్లా దానిని వేడి చేసి తింటుంటారు. ఇలా చేయడం ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంది. ఎందుకంటే.. ఒకటికి రెండుసార్లు వేడిచేయడంవల్ల ఆహారంలోని సంతృప్త కొవ్వులు, అధిక సోడియం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒకసారి వండిన తర్వాత మళ్లీ తినేటప్పుడు వేడిచేకుండా తినడమే బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు.

సింథటిక్ సువాసనలు

వాష్ రూమ్, బాత్ రూమ్, బెడ్ రూమ్ ఇలా ఏదో ఒకటి కాదు, ఇల్లు మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరూ భావిస్తుంటారు. అందుకోసం సువాసనలు వెదజల్లే సింథటిక్ లిక్విడ్స్‌‌ను స్ర్పే చేస్తుంటారు. కానీ ఇలా చేయడం డేంజర్ అంటున్నారు నిపుణులు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ ప్రకారం కూడా సింథటిక్ సువాసనలు ఆస్తమా, శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వాటిని వాడే ముందు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.

గిన్నెలను సింక్‌లో నానబెట్టడం

చాలా మంది రాత్రిపూట భోజనం తర్వాత తిన్న ఖాళీ ప్లేట్లను, గిన్నెలను, వివిధ వంట పాత్రలను సింక్ బేసిన్‌లో నానబెడుతుంటారు. దీనివల్ల మరుసటి ఉదయం వాష్ చేయడం ఈజీ అవుతుందని భావిస్తారు. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే అందులో మిగిలిపోయిన పదార్థాలు ఎక్కుసేపు నానడంవల్ల అందులో బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పుట్టుకొస్తాయి. తర్వాత వాటిని వాష్ చేసేవారిలో అలర్జీలకు కారణం అవుతాయి.

రాత్రిళ్లు తలస్నానం

కొందరికి రాత్రిపూట పడుకునేకంటే ముందు స్నానం చేసే అలవాటు ఉంటుంది. పొద్దంతా ఎక్కువసేపు పనిచేయడం, అలసటకు గురికావడం వల్ల, ఇలా చేస్తే రిలాక్స్ అవుతామని, నిద్ర బాగా పడుతుందని భావిస్తారు. అయితే అందరికీ ఇది పడకపోవచ్చు. పడుకోవడానికి ముందు తలస్నానం చేయడం కొంతమందిలో జలుబు, గొంతు నొప్పి వంటి అనారోగ్యాలకు కారణం అవుతుంది. స్నానం తర్వాత తలను సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల ఇలా జరగొచ్చు. అలాగే రోజూ రాత్రిపూట తల స్నానం చేయడం, తడి సరిగ్గా ఆరకముందే పడుకోవడం వంటివి చుండ్రు, జుట్టు రాలే సమస్యలకు కూడా దారితీస్తాయి.

మేకప్‌‌తో నిద్రపోవడం

కొందరు సాయంకాలం ఫంక్షన్లకో, పార్టీలకో, పెళ్లిళ్లకో వెళ్లే క్రమంలో మేకప్ చేసుకుంటారు. తిరిగి వచ్చాక రిమూవ్ చేస్తే పర్లేదు. కానీ ఓపిక లేదనో, నిద్ర ముంచుకొస్తన్నదనో అలాగే పడుకుంటారు. ఇది డేంజర్ అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎందుకంటే మేకప్‌లో ఉండే హానికారక రసాయనాలు స్కిన్ ఇన్ ఫెక్షన్లకు, వృద్ధాప్య ఛాయలకు కారణం అవుతాయి. ఈ అలవాటును వెంటనే మార్చుకోకపోతే వివిధ అనారోగ్యాలు దాడిచేస్తాయి.

కూల్ డ్రింక్‌లు, సోడాలు, ఆల్కహాల్

కొందరికి భోజనం తర్వాత సోడా లేదా కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే గ్యాస్ ప్రాబ్లం పోతుందని భావిస్తుంటారు. మరి కొందరు రాత్రిపూట భోజనానికి ముందు గానీ, భోజనం చేస్తూ గానీ ఆల్కహాల్ సేవిస్తుంటారు. అయితే డైలీ ఇలా చేస్తే మాత్రం మీ ఆయుష్షు తగ్గతుంది జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సోడాలు, కూల్ డ్రింక్‌లు, ఆల్కహాల్ వంటివి వాస్తవానికి అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని అవయవాలను బలహీన పరుస్తాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా వచ్చేందుకు దారితీస్తాయి.

నోస్ హెయిర్ కట్ చేయడం

పురుషులు షేవింగ్ చేస్తున్నప్పుడు ముక్కులో ఉన్న చిన్న చిన్న వెంట్రుకలను కూడా కట్ చేస్తుంటారు. కానీ వాస్తవానికి అవి ఉంటే మంచిదే అంటున్నారు నిపుణులు. ముక్కులోకి దుమ్ము, ధూళి వంటివి నేరుగా పోకుండా రక్షణగా నిలుస్తాయి. కాబట్టి కట్ చేయకపోయినా ఏమీ కాదు. ముక్కు లోపలి భాగాన్ని దాటి పెరిగితే మాత్రమే ఎక్స్‌ట్రా హెయిర్‌ను కట్ చేసుకోవడం బెటర్.

లంచ్ తర్వాత నిద్ర పోవడం

మధ్యాహ్న భోజనం తర్వాత చాలామందికి నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. దీంతో ఓ కునుకు తీస్తే పోలా అనుకొని నిద్రలోకి జారుకుంటారు. అప్పుడప్పుడంటే పర్లేదు. కానీ అది అలవాటుగా మారితే, రోజూ అదే కంటిన్యూ అయితే మాత్రం అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. మెటబాలిక్ సైకిల్ దెబ్బతింటుంది. నిద్రలేమి, రిఫ్లెక్స్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి మీ లైఫ్ క్వాలిటీని తగ్గిస్తాయి. అలాగే ఉదయం టిఫిన్ చేయకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

సరిపడా నీళ్లు తాగకపోవడం

కామన్‌గా రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతుంటారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పుడు 10 నుంచి 14 గ్లాసుల వరకు కూడా తాగవచ్చు. అయితే చాలా మంది తమ బిజీ షెడ్యూల్ కారణంగా దీనిని మర్చిపోతుంటారు. ఫలితంగా ఆరోగ్యం రిస్కులో పడుతుంది. లైఫ్ క్వాలిటీ తగ్గుతుంది. అలాగే శరీరానికి తగినంత నీరు అందకపోడంవల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమై, సంతోషకరమైన జీవితానికి నీరు తాగడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

Next Story