Health : అసిడిటీకి కుడి.. గుండెకు ఎడమ.. నిద్రలో దాగున్న ఆరోగ్య రహస్యం!

by Javid Pasha |

Health : అసిడిటీకి కుడి.. గుండెకు ఎడమ.. నిద్రలో దాగున్న ఆరోగ్య రహస్యం!
X

దిశ, ఫీచర్స్ : జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? యాసిడ్ రిఫ్లక్స్(Acid reflux)తో ఛాతీలో మంట ఇబ్బంది పెడుతోందా? అయితే పైసా ఖర్చులేని ఒక చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. ఏంటంటే.. మీరు నిద్రపోయేటప్పుడు కుడివైపు తిరిగి పడుకుంటే చాలు. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదు. మీ అసిడిటీ(Acid) సమస్యను పరిష్కరించుకునే చక్కటి సొల్యూషన్ అని 2022లో జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో పబ్లిషైన క్లినికల్ రివ్యూ పేర్కొన్నది. కుడివైపు తిరిగి పడుకోవడంవల్ల అసిడిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఇలా పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం గొంతువైపు రాకుండా, దిగువ భాగంలో ఉండిపోతుంది. దీనివల్ల గుండెల్లో మంట, ఆమ్లం పైకి రావడం, నిద్ర మధ్యలో మేలుకొని ఇబ్బంది పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.

మరోవైపు ‘అమెరికన్ హార్ట్ జర్నల్’లో పబ్లిషైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎడమ వైపు తిరిగి పడుకోవడం గుండెకు ఎక్కువ మేలు చేస్తుంది. ఇలా పడుకున్నప్పుడు శరీరంలోని ప్రధాన రక్తనాళాల మీద ఒత్తిడి తగ్గుతుంది. గుండె చుట్టూ రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెజర్ సమస్య ఉన్నవారికి రాత్రిపూట శరీరం ఈజీగా రికవర్ అవుతుంది. గర్భిణులు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని, శిశువుకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందేలా చేస్తుందని గైనకాలజిస్టులు సిఫార్సు చేస్తుంటారు. అంటే సమస్యను బట్టి నిద్రలో కుడి లేదా ఎడమవైపు తిరిగి పడుకోవడం అనే ఈ చిన్న మార్పు పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story