Raja Beta Syndrome : కన్న కొడుకులను ఆ విధంగా పాడుచేస్తున్నది తల్లులే..! ఆ తప్పులను సమర్థిస్తూ..

by Javid Pasha |   (  Updated:2025-08-16 09:00:18  IST  )

కొడుకు ఏ అమ్మాయినైనా వేధించాడా? తప్పు ఆ అమ్మాయిదే అనుకుంటారు. ఇక కొడుకు తన భార్యను కొట్టినా ఆమె తప్పుగా ప్రవర్తించి ఉంటుందని అంటారు. కానీ కొడుకును మాత్రం మందలించరు.

Raja Beta Syndrome : కన్న కొడుకులను ఆ విధంగా పాడుచేస్తున్నది తల్లులే..! ఆ తప్పులను సమర్థిస్తూ..
X

దిశ, ఫీచర్స్ : కూతురు లేదా కోడలు చిన్న పొరపాటు చేసినా తప్పు పడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. ముఖ్యంగా ఇందులో తల్లిపాత్రే అధికంగా ఉంటుంది. అదే తప్పును కొడుకు చేస్తే మాత్రం సమర్థిస్తారు. అవసరమైతే ‘డోంట్ వర్రీ బెటా మై హూన్ నా..’ అని వెనుకేసుకొస్తుంటారు. కొడుకు ఎవరినైనా కొట్టాడా? ఆ తప్పు ఎదుటివాళ్లదే అంటుంటారు. కొడుకు ఏ అమ్మాయినైనా వేధించాడా? తప్పు ఆ అమ్మాయిదే అనుకుంటారు. ఇక కొడుకు తన భార్యను కొట్టినా ఆమె తప్పుగా ప్రవర్తించి ఉంటుందని అంటారు. కానీ కొడుకును మాత్రం మందలించరు. ఈ విధంగా కొడుకు చేసే పొరపాట్లను, తప్పులను ఎప్పుడూ సమర్థించే ధోరణినే ‘రాజా బెటా సిండ్రోమ్’ అని పిలుస్తున్నారు మానసిక నిపుణులు. ఇలా చాలా వరకు కన్న కొడుకులను పాడు చేస్తున్నది తల్లులే అంటున్నారు నిపుణులు.

నిజానికి తమ కుమారుడిలో పురుషాధిక్య భావజాలాన్ని, అది కూడా తల్లులే సమర్థించడం ‘రాజా బెటా సిండ్రోమ్’ ధోరణిలో ప్రధానంగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది చాలా తక్కువగా ఉంది. కానీ, భారతీయ కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని మానసిక నిపుణులు, ఫెమినిస్టులు చెబుతున్నారు. తమ కొడుకులను బాధ్యతల నుంచి దూరంగా ఉంచి, వారి తప్పిదాలను క్షమించి, వాటిని కప్పి‌పుచ్చి, వారిని లోపం లేని యువరాజులుగా పెంచే సంప్రదాయమే మగపిల్లల్లో ఈ విధమైన పురుషాధిక్య భావజాలానికి, పురుషహంకార ధోరణికి, లింగ వివిక్షతకు, వ్యక్తిత్వ లోపానికి దారితీస్తున్నదని కూడా అంటున్నారు. ఇది కేవలం చిన్న చిన్న విషయాల్లోనే కాదు. ఇంటి పనులు చేయడం మొదలు కొని, పని ప్రదేశాల్లో, సంబంధాల్లోనూ కొనసాగుతున్నదని చెబుతున్నారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి అతిగారాబం, వెనుకేసుకు రావడంవల్ల మగ పిల్లలు తరచూ అతిగా ఆధారపడే, బాధ్యతారహితమైన వ్యక్తులుగా (Man-child) పెరుగుతారు. ఇది వారి వ్యక్తిగత జీవితంలోనూ, సమాజంలోనూ సమస్యలను సృష్టిస్తుంది. Link

Next Story