లగ్జరీ నివాసాలపైనే కొనుగోలు దారుల ఆసక్తి.. ధరలు మాత్రం పైపైకి..!

by Javid Pasha |   (  Updated:2025-06-14 12:19:32  IST  )

లగ్జరీ నివాసాలపైనే కొనుగోలు దారుల ఆసక్తి.. ధరలు మాత్రం పైపైకి..!

లగ్జరీ నివాసాలపైనే కొనుగోలు దారుల ఆసక్తి.. ధరలు మాత్రం పైపైకి..!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నివాసితుల అభిరుచులు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు 60 గజాల స్థలం, 600 చదరపు అడుగుల ఫ్లాటు ఉన్నా సరే సరిపెట్టుకునేవారు. అక్కడి నుంచి క్రమంగా 100 గజాల స్థలం, 900 చదరపు అడుగుల ఫ్లాటు వరకు ఆసక్తి చూపిన రోజులు వచ్చాయి. గతేడాది వరకు తక్కువలో తక్కువగా 1200 చదరపు అడుగులు వరకు ఉన్నఫ్లాట్లను కొనుగోలు చేశారు. కానీ ఈ ఏడాదిలో 1200 చదరపు అడుగుల ఫ్లాట్ల కోనుగోలుపై పూర్తిగా అనాసక్తి చూపిస్తున్నారని ఓ బిల్డర్ వివరించారు. 1500 చదరపు అడుగుల పైబడిన ఫ్లాట్లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. గతంలో నిర్మించిన అపార్ట్​మెంట్లో కూడా త్రిబుల్​ బెడ్​ రూం ఫ్లాట్లకు మాత్రమే వేగంగా బుకింగ్​ చేసుకున్నారని తెలిపారు.

రూ. కోటి నుంచి కోటిన్నర..

రాష్ట్రంలో విలాసవంతమైన నివాసాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోని ప్రధానమైన నగరాల్లో భారీ స్థాయి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు సాగుతున్నాయి. హైదరాబాద్​, బెంగళూర్​ వంటి నగరాల్లో ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం 4వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇంత కంటే అత్యధికంగా విస్తీర్ణంలో కడుతున్న ప్రాజెక్టులు నగరంలోని నార్సింగి​, మణికొండ, బండ్లగూడ జాగీర్​ మున్సిపాలిటీల్లో పెద్ద పెద్ద బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో అత్యధిక విలువైన ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.3000 చదరపు అడుగుల విస్తీర్ణం కన్నా ఎక్కువ ఉన్న ఆ ఫ్లాటు విలువ సుమారుగా రూ.16కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువలో తక్కువగా రూ.5 కోట్లు విలువ ఉన్నట్టు సమాచారం. బెంగళూరు​లో రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్లు విలువతో 4000 చదరపు అడుగుల విస్తీర్ణం ఫ్లాట్లు వస్తాయని బిల్డర్లు చెబుతున్నారు. వీటిని వ్యాపార, రాజకీయవేత్తలు, వైద్యులు, కంపెనీల సీఈవోలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీరి స్ధాయిలో కాకపోయినా ఉన్నంతలో విశాలంగా ఉండాలని ఇతర కొనుగోలుదారులు భావిస్తున్నారు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంపైన ఉన్న ఇళ్లను కొనుగోలు చేయాలంటే కోటి రూపాయాలు వరకు కావాల్సిందేనని మార్కెట్లోని ధరలు చెబుతున్నాయి. శివారు ధరలే ఇలా ఉంటే గేటెడ్​ కమ్యూనిటీల్లో రూ.కోటీన్నర వరకు కావాల్సిందేనని బిల్డర్లు చెబుతున్నారు.

ధరలు పైపైకి.. ​

హైదరాబాద్​తో పాటు నగర శివారులో ఫ్లాటు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి చదరపు అడుగు సగటు ధర రూ. 5 వేల నుంచి రూ. 13 వేల వరకు బిల్డర్లు విక్రయిస్తున్నారు. హైదరాబాద్​, మేడ్చల్​, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో చదరపు అడుగు సగటు ధర 9 శాతం పెరిగిందని నైట్​ ఫ్రాంక్​ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రతి ఏడాది ధరలు పెరుగుతూనే ఉన్నా.. వినియోగదారులు మాత్రం అధిక విస్తీర్ణంపైనే ఆసక్తి చూపిస్తున్నారు.

Next Story