డైట్.. వ్యాయామం చేయకపోతేనే కాదు.. నిద్రలేకపోయినా లావెక్కుతారు!

by Javid Pasha |   (  Updated:2025-12-11 07:59:35  IST  )

అధిక బరువు తగ్గడానికి, ఊబకాయం పోవడానికి కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. క్యాలరీలు తగ్గించి డైట్‌లో ఉన్నప్పుడు తగినంత నిద్ర పోతేనే శరీరం ఎక్కువ కొవ్వును కరిగిస్తుంది.

డైట్.. వ్యాయామం చేయకపోతేనే కాదు.. నిద్రలేకపోయినా లావెక్కుతారు!
X

దిశ, ఫీచర్స్ : కొందరు అధిక బరువు తగ్గాలని రోజూ వ్యాయామం చేస్తుంటారు. లావు తగ్గాలని డైట్ పాటిస్తుంటారు. కానీ ఏమాత్రం ఫలితం ఉండదు. అందుకు కారణం సరైన నిద్రలేకపోవడం కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే క్యాలరీలు(Calories) తగ్గించి, డైట్‌లో ఉన్నప్పటికీ, డైలీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నప్పటికీ క్వాలిటీ స్లీప్ లేకపోతే మాత్రం శరీరం అదనపు కొవ్వును కరిగించడంలో విఫలం చెందుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

అధిక బరువు తగ్గడానికి, ఊబకాయం పోవడానికి కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. క్యాలరీలు తగ్గించి డైట్‌లో ఉన్నప్పుడు తగినంత నిద్ర పోతేనే శరీరం ఎక్కువ కొవ్వును కరిగిస్తుంది. అధ్యయనాల ప్రకారం.. ఒకే డైట్‌ను అనుసరించిన వ్యక్తుల్లో తక్కువ నిద్ర పోయినవారు, ఎక్కువ నిద్రపోయినవారికంటే 55% తక్కువ కొవ్వును మాత్రమే కోల్పోయారు, అదే సమయంలో ఎక్కువ నిద్ర పోయినవారు, చాలా ఎక్కువ కొవ్వును బర్న్ చేశారు. అంటే డైట్ ఒక్కటే కాదు, నిద్ర కూడా కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నిద్ర తక్కువైన పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ఎందుకు లావెక్కుతారు లేదా బరువు పెరుగుతారు అంటే.. ఈ పరిస్థితి సిర్కాడియం రిథమ్‌కు ఆటంకం కలిగిస్తుంది. దీంతో శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ కూడా అధికమై కొవ్వును బాడీలోనో స్టోర్ చేయాలనే సంకేతాలను మెదడు ద్వారా శరీరానికి పంపుతుంది. అంతేకాకుండా సరైన నిద్రలేకపోవడంవల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి, కొవ్వు సరిగ్గా జీర్ణం కాకుండా పోతుంది. ఫలితంగా ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఇది అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది. అందుకే 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్రపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరింబచడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story