చలికాలం కదా అని వాటర్ తక్కువగా తాగుతున్నారా..? ఈ రిస్క్ తప్పదు!

by Javid Pasha |

వింటర్‌లో నీళ్లు తక్కువగా తాగితే ఆ ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలం కదా అని వాటర్ తక్కువగా తాగుతున్నారా..? ఈ రిస్క్ తప్పదు!
X

దిశ, ఫీచర్స్ : చలి కాలం కదా అని నీరు తక్కువగా తాగుతున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి చాలా మంది మిగతా సీజన్లతో పోలిస్తే వింటర్‌లో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. చల్లటి వాతావరణమే ఇందుకు కారణం. అలాగనీ శరీరానికి సరిపడా నీరు తాగకపోయినా హెల్త్ పరంగా నష్టపోతారు. కాబట్టి సీజన్లతో సంబంధం లేకుండా రోజులో 2 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగితేనే మనం ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అంతకంటే మరీ ఎక్కువ తాగినా, మరీ తక్కువ తాగినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ నీరు తాగడంవల్ల తలెత్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త సరఫరాలో ఆటంకాలు

వింటర్‌లో నీళ్లు తక్కువగా తాగితే ఆ ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. అవయవాలకు రక్త సరఫరాలో తేడాలు వస్తాయి. దీంతోపాటు తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా క్రానిక్ ఫెటీగ్‌కు దారితీయవచ్చు. అంటే ప్రతి రోజూ తీవ్రమైన అలసట లేదా తలనొప్పి వంటివి అనుభవించే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. కాబట్టి దాహం వేయకపోయినా శరీరానికి సరిపడా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడి, ఇతర అనారోగ్యాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది.

గుండెపై ప్రభావం

తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. హార్ట్ రేట్‌లో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. అంతేకాకుండా నీరు తక్కువగా తాగడంవల్ల బాడీలో బ్లడ్ సర్య్యులేషన్ సక్రమంగా జరగదు. దీంతో అవయవాల పనితీరు మందగిస్తుంది. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

కిడ్నీలు, జీర్ణ వ్యవస్థపై ప్రభావం

వింటర్‌లో తక్కువ నీరు తాగడం మెటబాలిజంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో కడుపులో ఉబ్బరం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ట్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది. మరో విషయం ఏంటంటే.. సరిపడా నీళ్లు తాగితేనే కిడ్నీలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. అవి రక్తం నుంచి వ్యర్థాలను వడబోసి యూరిన్ రూపంలో బయటకు పంపడానికి నీరు చాలా ముఖ్యం. ఎలక్ట్రోలైట్స్ తగ్గడం కారణంగా కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి రోజూ కనీసం 2 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story