Brain health : డైలీ ఇలా చేస్తే చాలు.. మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది!

by Javid Pasha |

Brain health : డైలీ ఇలా చేస్తే చాలు.. మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది!

Brain health : డైలీ ఇలా చేస్తే చాలు.. మీ మెదడు పాదరసంలా పనిచేస్తుంది!
X

దిశ, ఫీచర్స్ : మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. మనం ఏ పనిచేయాలన్నా ఇదే కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బాడీకి అందే ఆక్సిజన్‌లో, ఎనర్జీలో దాదాపు 20 శాతం మన బ్రెయినే ఉపయోగించుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అలా జరిగినప్పుడే మనం యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతాం. అయితే కొన్నిసార్లు సరైన ఆహారం తినకపోవడంవల్లో, అధిక పని ఒత్తిడివల్లో, వయస్సు రీత్యా సంభవించే శారీరక మార్పులవల్లో మెదడు పనితీరులో తాత్కాలిక మార్పులు సంభవిస్తుంటాయి. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత వంటివి తగ్గుతుంటాయి. అలాంటి పరిస్థితి రాకూడదంటే, మెదడు ఎల్లప్పుడూ పాదరసంలా (ఉత్సాహంగా) పనిచేయాలంటే పాటించదగిన కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.

*కొత్తగా నేర్చుకోవడం : మెదడు కంప్యూటర్‌లా పనిచేయాలంటే.. నిరంతరం ఏదో ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగనీ అధిక ఒత్తిడి సందర్భాల్లోనూ అలా చేయకూడదు. మీరు ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ముఖ్యమైన విషయాలను నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి. కొత్త పుస్తకం చదవడం, కొత్త భాష నేర్చుకోవడం, సమస్యలకు పరిష్కారాలను ఆలోచించడం ఇలా ఏదో ఒకటి నేర్చుకోవడంవల్ల బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుందని, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అట్లనే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి.

* క్వాలిటీ స్లీప్ : రోజూ సరిపడా నిద్ర కూడా మెదడు పనితీరుకు చాలా ముఖ్యం. నిజానికి క్వాలిటీ స్లీప్ మన బ్రెయిన్‌ ఎనర్జీని రీచార్జ్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు కంటినిండా నిద్రపోయినప్పుడే మెదడు పాదరసం కంటే వేగంగా, చురుగ్గా పనిచేస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలు యాక్టివ్‌గా పనిచేయడం ప్రారంభిస్తాయి.

*ఆహారం : మీరు తీసుకునే ఆహారం కూడా మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అధిక కొవ్వులు కలిగినవి, నూనెలో అధికంగా వేయించినవి, బేకరీల్లో నిల్వ ఉంచినవి ఇలా జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తింటూ పోషకాలు కలిగిన ఆహారాలకు ఎక్కువకాలంపాటు దూరంగా ఉంటే మెదుడు పనితీరు మొద్దు బారుతుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం కూడా బ్రెయిన్ చురుకుదనాన్ని అడ్డుకుని పనితీరు మందగించేలా చేస్తాయి. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. తృణ ధాన్యాలు, చేపలు, ఓట్స్, బాదం, వాల్ నట్స్, అవిసెగింజలు, గుమ్మడి గింజలు, తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే మెదడుకు మేలు జరుగుతుంది.

* వ్యాయామాలు : శారీరక శ్రమ తగ్గితే కూడా మెదడు పనితీరు మందగిస్తుంది. అందుకే బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలంటే.. రోజూ వ్యాయామాలు లేదా మీరు తీసుకునే ఆహారాన్ని బర్న్ చేయగలిగిన శారీరక శ్రమ అవసరం అంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే మెదడులో సెరటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. బ్రెయిన్ పాదరసంలా షార్ప్‌గా పనిచేసేందుకు దోహదపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story