బాబోయ్.. చీమలు చంపేస్తాయ్..! మైర్మెకో ఫోబియా మర్మమిదే..!!

by Javid Pasha |

బాబోయ్.. చీమలు చంపేస్తాయ్..! మైర్మెకో ఫోబియా మర్మమిదే..!!
X

దిశ, ఫీచర్స్ : ‘ఈ చీమలు నన్ను బతకనివ్వవు.. నేను వెళ్లిపోతున్నా.. పాపను బాగా చూసుకోండి’ అంటూ భర్తను ఉద్దేశించి సూసైడ్ లెటర్ రాసి మనీషా అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవంబర్ 6న సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఇది విన్న ప్రతి ఒక్కరికీ ఓ సందేహం వెంటాడుతోంది. ఏంటంటే.. అసలు చీమలకు భయపడి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా?.. యెస్.. వినడానికి వింతగానే అనిపించినా అలాంటి అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇదొక రకమైన ఫోబియా.. దానినే మైర్మెకో ఫోబియా(Myrmecophobia) అంటారు.

ఏమిటీ భయం?

మైర్మెకోఫోబియా (Myrmecophobia) అనేది చీమల పట్ల వ్యక్తి కలిగి ఉండే తీవ్రమైన ప్రతికూల భావననగా, అసహ్యకరమైన భయంగా చెప్పవచ్చు. అంటే ఇదొక రకమైన స్పెసిఫిక్ ఫోబియా (specific phobia). గ్రీక్ పదాలైన ‘మైర్మెక్స్(చీమ)’ అండ్ ‘ఫోబోస్ (భయం)’ నుంచి ఈ పేరు వచ్చింది. ఈ ఫోబియా వల్ల చీమలు ఆహారాన్ని తింటూ మనల్ని నష్టపరుస్తాయని, లేదా ఇంట్లో చీమలు ప్రవేశించి ప్రమాదం కలిగిస్తాయనే ఆందోళన బాధితుల్లో కనిపిస్తుంది. ఒక విధంగా ఇది కీటకాలపట్ల ఉండే ఇంటోమోఫోబియా (Fear of insects) లేదా అరాక్నోఫోబియా (Fear of plagues)తో ముడిపడి ఉంటుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు

*చీమలంటేనే అసహ్యం, భయం, ఆందోళన వంటివి కలుగుతుంటాయి. చీమలు తమకు హాని చేస్తాయని, ఆహారాన్ని తింటాయని, ఇంట్లో చీమలు ఎక్కువైతే ఇంటికి నష్టం జరుగుతుందని మైర్మెకోఫోబియా బాధితులు భయపడుతుంటారు.

*మనసులో ఊహించుకొని ఆందోళన చెందుతుంటారు. అనుచిత ఆలోచనలు (Intrusive Thoughts), స్ట్రెస్, యాంగ్జైటీ వేధిస్తాయి. దీంతో నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు.

*చీమలపట్ల ఉన్న భయం వల్ల మైర్మెకోఫోబియా బాధితులు పార్క్, కిచెన్ వంటి ఏరియాలకు, పొలాల వద్దకు వెళ్లకపోవడం వంటివి చేస్తారు. ఈ ఫోబియా తీవ్రమైతే కొన్నిసార్లు చీమలను చూడగానే పానిక్ అటాక్‌కు దారితీయవచ్చు.

ఎందుకు ఏర్పడుతుంది?

మైర్మెకోఫోబియాకు చిన్నప్పుడు ఎదుర్కొన్న భయంకరమైన లేదా విషాదకరమైన అనుభవాలు కారణం కావచ్చు. ముఖ్యంగా చిన్నప్పుడు చీమకాటు వల్ల తీవ్రమైన నొప్పిని అనుభవించినప్పుడు చీమలు దాడి చేసినట్టు అతిగా ఊహించుకొని భయపడటం మనసులో నాటుకుపోయి బలహీనతగా మారుతుంది. దీంతోపాటు యాంగ్జైటీ డిజార్డర్స్ లేదా ఫోబియాలు కలిగిన కుటుంబ చరిత్ర(Genetic/Family History) కూడా కారణం కావచ్చు. బాల్యంలో లెర్న్‌డ్ బిహేవియర్ (పెద్దలు లేదా సమాజం చీమలను ‘అరాచకం’గా చూపిస్తే) లేదా కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్సెస్ (కొన్ని సంస్కృతుల్లో చీమలు ‘అశుభం’గా భావిస్తారు) కూడా మైర్మెకోఫోబియా డెవలప్ కావడానికి దారితీస్తుంది. అయితే ప్రతీ ఒక్కరికీ ఒకే విధమైన కారణాలు ఉండకపోవచ్చు. అసలు విషయం మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే నిర్ధారిస్తారు.

పరిష్కారం ఏమిటి?

*ఎక్స్‌పోజర్ థెరపీ: చీమలంటేనే భయపడే వారిని మానసిక వైద్య నిపుణులు ఆ పరిస్థితి నుంచి బయటపడే చికిత్సలు అందిస్తారు. అలాంటిదే ఎక్స్‌పోజర్ థెరపీ. క్రమంగా చీమల చిత్రాలు, వీడియోలు చూడటం నుంచి మొదలుపెట్టి, నిజమైన చీమల సమీపంలో ఉంటూ కూడా భయం లేకుండా ఉండటం నేర్చుకునేలా చేస్తారు. తీవ్రతను బట్టి చికిత్స పద్ధతులు మారవచ్చు. వర్చువల్ రియాలిటీ లేదా ఇమాజినేషన్ ఎక్సర్‌సైజ్‌లు కూడా ఉంటాయి.

* కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): భయాకి కారణమయ్యే ఆలోచనలను పూర్తిగా మార్చడం దీని ప్రధాన ఉద్దేశం. రెస్పాన్స్ ప్రివెన్షన్ (ERP) ఉపయోగించి ఇలా చేస్తారు.

*హిప్నోథెరపీ: 6-10 సెషన్లలో పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లు, కోర్ బిలీఫ్‌లను అర్థం చేసుకోవడం ద్వారా ఈ థెరపీ చీమల భయం నుంచి బయటపడేలా చేస్తుంది. దీంతోపాటు డీప్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్‌నెస్, పాజిటివ్ విజువలైజేషన్. చీమలంటే భయంకరమైనవి కావని, హాని చేయవని ఊహించుకుంటూ ప్రాక్టీస్ చేయడం వంటివి మైర్మెకోఫోబియాను పోగొట్టే పరిష్కార మార్గాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story