- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Be careful : జర భద్రం.. ఈ చిన్న పొరపాట్లే సగం రోగాలకు కారణం!
Be careful : జర భద్రం.. ఈ చిన్న పొరపాట్లే సగం రోగాలకు కారణం!

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. అయినా కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆనందం ఆవిరైపోతుంది. ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకలా? అంటే.. రోజువారి జీవితంలో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఒక సర్వే ప్రకారం 70 శాతం మంది తమ దైనందిన జీవితంలో అనారోగ్యకరమైన అలవాట్లనే అనుసరిస్తున్నారట. అవేమిటో గుర్తించి జాగ్రత్త పడితే.. నిండు నూరేళ్లు ఆనందంగా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
కోపమే అసలు శత్రువు
సమాజంలో లేదా నిత్య జీవితంలో అన్నీ మనకు అనుకూలంగానే జరగవు. మనకు నచ్చింది ఇతరులకు నచ్చాలని లేదు. ఇతరులు కూడా మనకు నచ్చినట్లు ఉండాలని లేదు. కానీ చాలా మంది ఇది గ్రహించడంలో పొరపాటు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. తమకు సంబంధం లేని అవతలి వ్యక్తులు కూడా తమకు నచ్చని డ్రెస్ వేసుకున్నా, నచ్చినట్లు ప్రవర్తించకపోయినా, నచ్చని ఫుడ్ తిన్నా కొందరు కోపం తెచ్చుకుంటూ ఉంటారు. దానిని బయటకు ప్రదర్శించకపోయినా లోలోపల కోపంతో రగిలిపోతుంటారు. దీనివల్ల నష్టం ఎవరికి? అలాగే కుటుంబాల్లోనూ ప్రతీ విషయంలో అవతలి వ్యక్తి తమకు నచ్చినట్లు ఉండాలనుకునే వారు చాలామందే ఉంటారు. సాధారణ విషయాలనే సీరియస్‌గా తీసుకుంటారు. బయటకు వెళ్లొద్దంటే వెళ్లి నందుకో, ఫలనా వస్తువు అక్కడ కాకుండా, మరొకచోట పెట్టారనే కారణంతోనో ఇలా చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. పైగా ఇలాంటి విషయాలు జరిగిన మరుక్షణంలో మరిచిపోతే సమస్యే ఉండదు. కానీ కొందరు తమ మాట ఎవరూ పట్టించుకోవడం లేదన్న ప్రస్టేషన్‌లో పదే పదే ఆలోచిస్తారు. దీంతో కోపం మరింత పెరిగి ఆందోళన, ఒత్తిడి, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవేం పెద్ద సమస్యలా అనుకుంటాం.. కానీ ప్రతీ వ్యక్తి అనుభవంలో చోటు చేసుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే అలవాటు పరోక్షంగా వారి ఆయువు క్షీణతకు దారితీస్తుందట. బీ కేర్ ఫుల్.
శారీరక శ్రమ లేకపోవడం
మీరు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఎన్ని హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా శారీరక శ్రమలేకపోతే నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మానవ శరీరం నిశ్చల జీవన శైలికి అనుగుణంగా మాత్రమే రూపొందించబడలేదు. తిన్న ఆహారం జీర్ణమై, శక్తిని ఇవ్వాలంటే.. దానిని బర్న్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీస్ అవసరం. కొందరు వ్యాయామాలు చేయడానికి సమయం లేదని చెబుతుంటారు. ఇదే పొరపాటు.. ఎందుకంటే వ్యాయామం అంటే కేవలం గ్రౌండ్‌కు వెళ్లి పరుగెత్తడమో, జిమ్ సెంటర్లలో పరికరాలతో కుస్తీ పట్టడమో మాత్రమే కాదు. మీ శారీరక కదలికలు తగినంత ఉండే ఏ పని చేసినా అది వ్యాయామం కిందికి వస్తుంది. ఇంట్లో బట్టలు ఉతికినా, బరువులు మోసినా వ్యాయామం అవుతుంది. రోజూ ఉదయం లేచి 20 నిమిషాలు రోడ్డు మీద వాకింగ్ చేసినా వ్యాయామం అవుతుంది. ఇలా ఏదో ఒక శారీరక శ్రమ మాత్రం తప్పక ఉండాల్సిందే. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇలా కాకుండా నిశ్చల జీవనశైలికే పరిమితమైపోతే.. కొంత కాలానికి డయాబెటిస్, అధిక రక్తపోటు, ఆ తర్వాత గుండె జబ్బులు మీకు మీరే కొనితెచ్చుకున్న వారవుతారు జాగ్రత్త.
ఒంటరి తనం
ఒంటరి తనమంటే.. ఒంటరిగా జీవించడం కాదు. ఇది మానసిక పరిస్థితికి సంబంధించిన విషయం. అందరూ ఉన్నా ఎవరూ లేరన్న అనుభూతికి లోను కావడం. కొందరు నలుగురిలో ఉన్నా తమలో తామే ఏవోవో ఊహించుకొని బాధ పడుతుంటారు. ఎవరితోనూ చెప్పుకోకుండా అవస్థలు పడుతంటారు. ప్రతీ చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తుంటారు. అనుకున్నది జరగకపోయినా, అనుకోకుండా పొరపాటు చేసినా.. నాకే ఎందుకిలా జరుగుతుందని ఫీలవుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతీ విషయంలో నెగెటివ్ కోణాలను వెతికి మరీ తమకు ఆపాదించుకుంటూ బాధపడతారు. ఏ వ్యక్తి కూడా వీటిని కావాలని చేసే అవకాశం కూడా చాలా వరకు ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో తమకు తెలియకుండానే ఒంటరి భావాలతో పోరాడుతుంటారు. అందుకే వాటిని మొదట్లోనే గుర్తించాలి. ఏదైనా విషయం మిమ్మల్ని కలవర పెడుతుంటే.. చిన్నదే కదా అని వదిలేస్తే.. అది మీలో ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది. క్రమంగా స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటివి పెరిగిపోవడానికి దారితీస్తుంది. అందుకే జర జాగ్రత్త. ఇలాంటి పొరపాట్లకు ఎప్పుడైతే అవకాశం ఇవ్వకుండా ఉంటారో, అప్పుడు సమయానికి తినడం, శారీరక శ్రమలో పాల్గొనడం, కంటి నిండా నిద్రపోవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వంటివి సహజంగానే పాటిస్తారు. ఇవి మీలో విజ్ఞతను, విజ్ఞాన్ని పెంచుతాయని, మానసిక వికాసానికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.






