- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతి పరిశుభ్రతే అసలు శత్రువు!! ఏ విధంగానో తెలుసా?
బాల్యంలో గానీ, పెద్దయ్యాక గానీ మట్టిని తాకితో రోగాలొస్తాయనో, వర్షంలో తడిస్తేనో, చల్లగాలికి తిరిగితేనో జలుబు చేస్తుందనో మరీ ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం, ప్రతీ సందర్భంలో సబ్బులు, శానిటైజర్లు వంటివి వాడటం వంటి అతి పరిశుభ్రతా చర్యల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థకు(Immune system) సరైన సూక్ష్మజీవులతో పరిచయం కాకుండా పోతుంది.

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక పరిశుభ్రత ముఖ్యమే. కానీ అతి పరిశుభ్రత(Extreme Hygiene) కూడా అంత ఆరోగ్యదాయకం కాదని మీకు తెలుసా? అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. సాధారణ పరిశుభ్రత వల్ల రోగకారక క్రిమలు లేదా సూక్ష్మ జీవులు మనల్ని దరిచేరకుండా ఉంటాయి. దీంతో పలు రకాల రోగాలు రాకుండా ఉంటాయి. అయితే మన శరీరం బలమైన రోగ నిరోధక వ్యవస్థను ఏర్పర్చుకోవాలంటే.. అప్పుడప్పుడూ కొన్ని రకాల రోగ కారక సూక్ష్మ జీవులకు గురికావడం కూడా అవసరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ పరిస్థితివల్ల శరీరం అలర్ట్ అవుతుంది. రోగ కారకాలతో పోరాడేందుకు తనకు తాను రోగ నిరోధక శక్తిని కూడట్టుకుంటుంది. ముఖ్యంగా అలర్జీలు, ఆస్తమా, ఆటో ఇమ్యూన్ వంటి వ్యాధులు దాడిచేసినప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే.. శరీరంలో సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తి ఉండాలి. వీటికి సంబంధించిన రోగకారకాలకు అప్పుడప్పుడు గురై ఉంటేనే అది పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. కానీ అతి పరిశుభ్రత ఈ విధమైన పరిస్థితిని దెబ్బతీస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం
బాల్యంలో గానీ, పెద్దయ్యాక గానీ మట్టిని తాకితో రోగాలొస్తాయనో, వర్షంలో తడిస్తేనో, చల్లగాలికి తిరిగితేనో జలుబు చేస్తుందనో మరీ ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం, ప్రతీ సందర్భంలో సబ్బులు, శానిటైజర్లు వంటివి వాడటం వంటి అతి పరిశుభ్రతా చర్యల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థకు(Immune system) సరైన సూక్ష్మజీవులతో పరిచయం కాకుండా పోతుంది. అంటే దీనివల్ల అతిగా స్పందించే (over-reactive) స్వభావం పెరిగిపోతుంది. దీన్నే ‘హైజీన్ హైపాథసిస్’’ అంటారు. అంటే అతి పరిశుభ్రత మన శరీరాన్ని సహజమైన సూక్ష్మజీవుల నుండి దూరంగా ఉంచి, రోగనిరోధక శిక్షణను దెబ్బతీస్తుంది. ఫలితంగా కొన్నిసార్లు శరీరం చిన్నపాటి రోగకారకాలకే అతిగా స్పందించడం, అనారోగ్యానికి గురికావడం వంటివి అలవాటు చేసుకుంటుంది. పొగమంచు, ధూళి, వివిధ వాసనలు, పుప్పొడి, ఆహారం లేదా సొంత కణాలను కూడా శత్రువులుగా (Harmless materials)భావించి ఆరోగ్యంపై దాడి చేస్తుంది. అందుకే స్వచ్ఛత, శుభ్రత మంచిదే కానీ అతి స్వచ్ఛతే అసలు సమస్య అంటున్నారు నిపుణులు.
శుభ్రత అవసరమే కానీ..
శుభ్రత కూడా చాలా ముఖ్యం. టాయిలెట్ వాడిన తర్వాత, పచ్చి ఆహారాన్ని తాకిన తర్వాత, అనారోగ్యంతో ఉన్నవాళ్ల చుట్టూ ఉన్న తర్వాత చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వచ్ఛత అవసరమే. ఇది అనారోగ్యాలను నిజంగా నిరోధిస్తుంది. కానీ ఎప్పుడూ యాంటీ బ్యాక్టీరియల్ సోప్‌లు ఉపయోగించడం, సాధారణ సోప్‌లను, షాంపూలను అతిగా వాడటం, తరచుగా శానిటైజర్లు వాడటం, మట్టిని అస్సలు తాకకుండా ఉండటం, పిల్లల్ని పూర్తిగా బయటి వాతారణానికి గురికాకుండా, ఆడుకోనివ్వకుండా పెంచడం, పెంచడం వంటివన్నీ సహజమైన మైక్రోబయల్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. అందుకే పిల్లలు పెద్దయ్యాగ దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వారికి అన్ని వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా పెంచాలంటున్నారు నిపుణులు. దీనిని బట్టి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఆరోగ్యమంటే కేవలం పరిశుభ్రంగా ఉండటం కాదు, అనుకూలత (adaptability) పెంచుకోవడం. సహజంగా మట్టిలో ఆడుకోవడం, మన చుట్టూ ఉండే పెంపుడు జంతువులతో సమయం గడపడం, తాజా పండ్లు కడిగి తినకపోవడం లాంటివి చిన్నప్పటి నుండి రోగనిరోధక వ్యవస్థకు ‘సరైన శిక్షణ’ ఇస్తాయి. తద్వారా పెద్దయ్యాక అలర్జీలు, ఆస్తమా, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు తగ్గే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు. అందకే పరిశుభ్రత అవసరం. కానీ అతి పరిశుభ్రత మాత్రం అనారోగ్యకరం అని గుర్తుంచుకోండి!
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






