వామ్మో మూడు పదుల వయసు..! యువతలో పెరిగిపోతున్న టెన్షన్స్

by Javid Pasha |

ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వృత్తిపరమైన ఒత్తిళ్లు వంటివి టీనేజ్ నుంచే ఈతరం యువతను వెంటాడుతున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

వామ్మో మూడు పదుల వయసు..! యువతలో పెరిగిపోతున్న టెన్షన్స్
X

దిశ, ఫీచర్స్ : మీకేం ఫికర్.. ఉత్సాహం ఉరకలెత్తే వయసు అంటుంటారు చాలా మంది యువతను ఉద్దేశించి. కానీ ఇదంతా ఒప్పడు నిజమే కావచ్చు. కానీ ఇప్పుడంతా తలకిందులవుతోంది. మూడు పదుల వయసు దాటక ముందే రకరకాల ఒత్తిడి, ఆందోళన, టెన్షన్స్ యువతను చుట్టు ముడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చదువు, కెరీర్, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, కుటుంబ సమస్యలు, బాధ్యతలు వంటి ఆలోచనలు ప్రతికూల ప్రభావం చూపినప్పుడు ఒక విధమైన మానసిక క్షోభకు దారితీస్తున్నాయని అంటున్నారు.

అసలు కారణం ఇదే..!

ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వృత్తిపరమైన ఒత్తిళ్లు వంటివి టీనేజ్ నుంచే ఈతరం యువతను వెంటాడుతున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇండియాతోపాటు అనేక దేశాల్లో ఈ సమస్య ఉందని కూడా నిపుణులు అంటున్నారు. 30 ఏండ్ల వయసులో ఆందోళనకు మరో కారణం కూడా ఉంది. ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల్లోని ఉద్యోగాల్లో 20 నుంచి 25 ఏళ్లలోపు వారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక 30 ఏండ్లు పైబడిన వారిని ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఇటీవల చాలా కంపెనీలు ఇష్టపడటం లేదు. పైగా అప్పటికే పొందిన ఉద్యోగం కూడా 30 ఏండ్లు దాటాక కోల్పోయే పరిస్థితులు ఐటీ సెక్టార్ సహా పలు ఇతర సంస్థల్లో నెలకొంటోంది. దీనివల్ల యువత ఆర్థిక పరమైన కష్టాల్లోకి, తద్వారా మానసిక సంక్షోభంలోకి నెట్టబడుతోందని, ఇది ఒత్తిడి, ఆందోళన టెన్షన్ వంటి సమస్యలకు దారితీస్తోందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

నెరవేరని కలలు..

జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన అందరిలో ఉంటుంది. కానీ ఆ కల నెరవేరే అవకాశం కనిపించకపోవడం కూడా 30 ఏండ్లు, ఆ పైబడిన వారిలో టెన్షన్స్ పెరిగిపోవడం, ఆ తర్వాత ఆందోళన, నిరాశ వంటి సమస్యలకు దారితీస్తోంది. 50 ఏళ్లు వచ్చే నాటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని, జీవితంలో సెటిల్ కావాలని, కారు కొనుక్కోవాలని కలలుగన్న వారు తమ 35 ఏండ్ల జీవిత ప్రయాణం తర్వాత కూడా అవి నెరవేరే మార్గం కనిపించనప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు.

Next Story