వరుసగా 4 రోజులు ఈ ఫుడ్స్ తింటే.. మీ మెదడులో జరిగే మార్పులివే..!

by Javid Pasha |   (  Updated:2026-02-02 07:52:25  IST  )

ఇతర ఆహారాలకంటే జంక్ ఫుడ్స్‌నే ఎక్కువగా తిన్నప్పుడు వాటిలోని అధిక కొవ్వు, అధిక చక్కెరలు బ్రెయిన్ హిప్పో‌కాంపస్‌లో ప్రతికూల మార్పులను ప్రేరేపిస్తాయి.

వరుసగా 4 రోజులు ఈ ఫుడ్స్ తింటే.. మీ మెదడులో జరిగే మార్పులివే..!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో సమతుల్య పోషకాలు కలిగిన ఆహారం తింటూ ఉండాలి. ముఖ్యంగా అందులో ఫైబర్ చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి లోపిస్తే శారీరక ఆరోగ్యమే కాదు, మెదడు ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ప్రధానంగా చీజ్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, చిప్స్, చాక్లెట్లు, క్యాండీలు వంటి అధిక కొవ్వు, అధిక చక్కెరలు, అధిక సోడియం కలిగిన జంక్స్ ఫుడ్స్ తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంటుందని చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం పదండి!

పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, క్యాండీలు వంటి జంక్ ఫుడ్స్‌‌లో ఫైబర్ చాలా తక్కువ. కాబట్టి సమతుల పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకుండా వీటిని వరుసగా 4 రోజుల పాటు తింటే గనుక మీ మెదడు ఆరోగ్యంపై, పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం కూడా.. వీటిలోని అధిక కొవ్వు, అధిక చక్కెర వంటివి జ్ఞాపకశక్తి, అలాగే మెదడులోని రివార్డ్ సిస్టమ్‌కు సంబంధించిన భాగాన్ని ప్రభావితం చేస్తాయని తేలింది. అధ్యయనంలో భాగంగా అధిక శాచురేటెడ్ ఫ్యాట్ డైట్‌ను నాలుగు రోజులు ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి మెదడులో జ్ఞాపక శక్తికి కారణమయ్యే హిప్పోక్యాంపస్‌లో గ్లూకోజ్ వినియోగం దెబ్బతిని, నిర్దిష్ట న్యూరాన్లు అతిగా యాక్టివేట్ అయి జ్ఞాపకశక్తి ప్రాసెసింగ్‌ను దెబ్బతీసినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మానవుల్లోనూ ఫైబర్లు, విటమిన్లు, ప్రొటీన్లు లేకపోవడం వల్ల, కొవ్వు అధికంగా ఉండటంవల్ల జంక్ ఫుడ్స్ కూడా ఈ విధమైన ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర ఆహారాలకంటే జంక్ ఫుడ్స్‌నే ఎక్కువగా తిన్నప్పుడు వాటిలోని అధిక కొవ్వు, అధిక చక్కెరలు బ్రెయిన్ హిప్పో‌కాంపస్‌లో ప్రతికూల మార్పులను ప్రేరేపిస్తాయి. న్యూరాన్లు అతిగా యాక్టివేట్ అయి బలహీన పడతాయి. దీంతో మెదడు మొద్దు బారుతుంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. దీంతోపాటు జంక్ ఫుడ్‌లో రుచికోసం కొవ్వు, చక్కెర, ఉప్పు అధిక మోతాదులో ‘బ్లిస్ పాయింట్’ సృష్టిస్తారు. కాబట్టి ఇవి మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే కోరికను కలిగిస్తాయి. దీంతో జంక్‌ఫుడ్స్‌కు అడిక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడూ జంక్ ఫుడ్స్ తింటే పర్లేదు కానీ, రోజూ తింటే మాత్రం మెదడు పనితీరు మందగిస్తుంది. అందుకే వాటికి ఎంతదూరం ఉంటే అంతమంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story