Health tips : అధిక అలసటతో అవస్థలా.. కీరదోస తినండి!

by Javid Pasha |   (  Updated:2026-04-11 14:02:59  IST  )

కీరదోసలో నీటిశాతం అధికంగా ఉంటుంది. ఇది డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగేలా దోహద పడుతుంది.

Health tips : అధిక అలసటతో అవస్థలా.. కీరదోస తినండి!
X

దిశ, ఫీచర్స్ : ఎండాకాలంలో చాలామంది ఎదుర్కొనే ఇబ్బందుల్లో అధిక అలసట ఒకటి. ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఉక్కబోతలు పెరగడం ఇందుకు కారణం. దీంతోపాటు డీహైడ్రేషన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే సమ్మర్‌లో వీటి నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో కీరదోస అద్భుతంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

డీహైడ్రేషన్‌కు చెక్

కీరదోసే కదా అనుకోకండి. సమ్మర్‌లో తినడంవల్ల ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని పచ్చిగానూ తినొచ్చు లేదా భోజన సమయంలో సలాడ్ రూపంలోనూ తీసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఔషధ గుణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతన్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. కీరదోస ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఏది ఏమైనా కీరదోసలో నీటిశాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహద పడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది!

కీరదోస రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అధిక అలసటను, అనారోగ్యాలను దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. పొటాషియం, మెగ్నీషియం కలిగి ఉండటంవల్ల గుండెజబ్బులను సైతం నివారిస్తుంది. సమ్మర్‌లో కీరదోసతోపాటు కొంచెం పుదీనా వేసి జ్యూస్ చేసుకుని తాగితే సన్‌స్ర్టోక్, డీ హైడ్రేషన్ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. కీరదోసలోని పోషకాలు కంటి ఆరరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ సహాయపడతాయి. అంటున్నారు నిపుణులు.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

మైగ్రేన్ ఎటాక్..! ఎందుకు వస్తుంది? నివారణ ఎలా?

Next Story