- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైగ్రేన్ ఎటాక్..! ఎందుకు వస్తుంది? నివారణ ఎలా?
ఒక వైపు తలనొప్పి, వికారం, వాంతులు, వెలుతురు/శబ్దం/వాసనలకు సహనం లేకపోవడం వంటివి మైగ్రేన్ లక్షణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు 35 ఏళ్లు దాటిన వారిలోనే మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇటీవల యుక్త వయసు నుంచి వృద్ధుల వరకు అందరినీ వేధిస్తోంది. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, అధిక పని ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి వంటివి ఇందుకు కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒకవైపు మాత్రమే తీవ్రమైన తలనొప్పి రావడాన్ని మైగ్రేన్‌గా పిలుస్తారు. కొన్నిసార్లు రెండువైపులా కూడా వస్తుంది. అయితే మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, మెదడు సంబంధిత నాడీ వ్యవస్థ రుగ్మత(Brain-related nervous system disorder) వల్ల వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దాని లక్షణాలు ఏమిటి? నివారణ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంత సేపు ఉంటుంది?
తలలో ఒకవైపు తీవ్రంగా కొట్టుకునేలా (Pulsing or throbbing) నొప్పి వస్తున్నదంటే అదే మైగ్రేన్. ఇది సుమారు 4 గంటల నుంచి 72 గంటల వరకు ఉండవచ్చు. వికారం, వాంతులు, వెలుతురు/శబ్దం/వాసనలకు సహనం లేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొందరికి కళ్ల ముందు మెరుపులు, జిగ్‌జాగ్ లైన్లు, తిమ్మిరి వంటివి కనిపించే లక్షణాలు ముందుగా వచ్చి తర్వాత నొప్పి మొదలవుతుంది. ఇది జీవిత నాణ్యతను బాగా తగ్గిస్తుంది.
ఎందుకు వస్తుంది?
మైగ్రేన్‌కు కచ్చితమైన కారణం ఇంకా పూర్తిగా తెలియదు. ప్రస్తుతానికి ఉన్న ఆధారాలనుబట్టి అధిక ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అలసట, నిద్రలేమి, అతినిద్ర వంటివి ఇందుకు దారితీస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జన్యుపరమైన (genetic) కారణాలు ప్రభావితం చేస్తుంటాయని కూడా చెబుతారు. అంటే.. కుటుంబంలో ఎవరైనా మైగ్రేన్ కలిగి ఉంటే వారి సంతానం లేదా వారసత్వం కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఎక్కువ. మెదడులోని నాడీ సంకేతాలు, రసాయనాలు (సెరటోనిన్ వంటివి), రక్తనాళాల్లో అసాధారణ మార్పుల వల్ల ఇది వస్తుంది.
ఎవరికి ఎక్కువ?
*సాధారణంగా మైగ్రేన్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హార్మోన్లలో మార్పులు, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో హెచ్చు తగ్గులు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే మానసిక ఒత్తిళు, ఆందోళనలవల్ల ఇటీవల పురుషుల్లోనూ ఇది పెరుగుతోంది.
*సాధారణంగా 35-45 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువగా మొదలవుతుంది.
*పిల్లలు, యువకులకు కూడా వచ్చే అవకాశం ఉంది.
*కుటుంబ చరిత్ర ఉన్నవారు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు దీనిబారిన పడుతుంటారు.
*ఇక మైగ్రేన్ ప్రేరేపిత కారణాల విషయానికి వస్తే.. ఒత్తిడి, నిద్రలేమి, అతినిద్ర, భోజనాలు స్కిప్ చేయడం, కాఫీ/చాక్లెట్/రెడ్ వైన్/ఏజ్డ్ చీజ్ వంటి ఆహారాలు అధికంగా తీసుకోవడం, వాతావరణ మార్పులు, అధిక కాంతిని వెదజల్లే లైట్లు, బలమైన వాసనలు, హార్మోన్ మార్పులు మైగ్రేన్‌ను మరింత ఎక్కువ చేస్తాయి.
ఏం చేయాలి?
*జీవనశైలిలో సానుకూల మార్పులు అవసరం. రోజూ 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వంటివి మైగ్రేన్‌ను నివారిస్తాయి.
*సకాలంలో భోజనం చేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం. మైగ్రేన్ ప్రేరేపిత ఆహారాలకు, పరిస్థితులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
*వారానికి 3-5 రోజులు యోగా, వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం మైగ్రేన్ నివారణకు సహాయపడుతుంది. *మానసిక ప్రశాంతతను చేకూర్చే పనులు, డీప్ బ్రీతింగ్ వంటివి ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
*మైగ్రేన్ ఎటాక్ రోజులో లేదా వారంలో ఎక్కువసార్లు వస్తుంటే.. సమస్య తీవ్రంగా అనిపిస్తే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






