రోజుకు ఒక గ్లాస్ ఆ రసంతో.. ధమనుల్లో అడ్డంకులకు చెక్ !

by Javid Pasha |

దానిమ్మ రసం తాగడం వల్ల ధమనులలో అడ్డంకులను 0-30% వరకు తగ్గించినట్లు పరిశోధకులు గుర్తించారు.

రోజుకు ఒక గ్లాస్ ఆ రసంతో.. ధమనుల్లో అడ్డంకులకు చెక్ !
X

దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పుల వలనో, సీజనల్ ఎఫెక్ట్ కారణంగానో అనారోగ్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే సాధారణ అలర్జీలు, అనారోగ్యాలకు సైతం కొందరు హాస్పిటళ్ల చుట్టూ తిరుగు‌తుంటారు. దీనివల్ల ఖర్చులు తడిసి మోపెడవుతుంటాయి. కాగా ఇంటిలోనే పాటించదగ్గ చిన్న చిన్న చిట్కాలతో, రోజువారీ ఆహారాలతో ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉన్నా కొందరు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటప్పుడు చిన్న సమస్యలే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఆర్టరీ బ్లాకేజ్(Artery blockage) కూడా ఒకటి. అయితే రోజుకు ఒక దానిమ్మ రసం తాగడం వల్ల ఆర్టరీ బ్లాకేజ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందని, గుండె ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం!

క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్‌లో పబ్లిషైన గత అధ్యయనాల ప్రకారం.. దానిమ్మ రసం తాగడం వల్ల ధమనులలో అడ్డంకుల సూచిక (Carotid Intima-Media Thickness)ని ఒక సంవత్సరంలో గరిష్టంగా 0-30% వరకు తగ్గించినట్లు పరిశోధకులు గుర్తించారు. దానిమ్మ జ్యూస్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అంతేకాకుండా దానిమ్మ రసం శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్, యాంథోసయానిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు బాడీలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, గుండె జబ్బులకు కారణం అయ్యే ఆక్సీకరణ ఒత్తిడి(Oxidative stress)ని కూడా తగ్గిస్తాయి. తరచుగా దానిమ్మ రసం తాగేవారిలో కరోటిడ్ ధమనుల(Carotid arteries)లో రక్త ప్రసరణకు అడ్డంగా పేరుకుపోయే ఫలకాల(Plaques)ను అది తగ్గిస్తుందని నిపుణులు గుర్తించారు. హైబీపీ ఉన్నవారిలో కూడా దానిమ్మ రసం సిస్టోలిక్ రక్తపోటును 12% వరకు తగ్గించగలదని పేర్కొన్నారు. కాబట్టి దానిమ్మను తినడం లేదా జ్యూస్ రూపంలో తాగడం వల్ల పరోక్షంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story