- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలలో దెయ్యాలు తరుముతున్నాయా? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!
గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడులో సంభవించే పరిణామాలు అంటే.. రాపిడ్ ఐ మూవ్‌మెంట్ అనే పరిస్థితి కారణంగా నిద్రలో ఉన్నప్పటికీ మెలకువగా ఉన్నట్లే మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అనుభవాల ప్రాసెసింగ్ ఏకీకరణకు దారితీస్తాయి. ఈ పరిస్థితే పీడకలలు రూపంలో వ్యక్తం అవుతుంది.

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ మనకు కలలు రావడం సహజం. చాలా వరకు ఇవి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు వస్తుంటాయి. కొన్నిసార్లు భయంకరమైన కలలు వస్తే, మరికొన్నిసార్లు మనసుకు హాయినిచ్చే కలలు వస్తుంటాయి. కాగ కొందరు ఆందోళనకరమైన కలలను అపశకునంగా భావిస్తుంటారు. మరికొందరు తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని నమ్ముతుంటారు. అయితే ఇవి కేవలం అపోహ లేదా మూఢనమ్మకంగా నిపుణులు పేర్కొంటున్నారు. కలలు నిజమవుతాయని నిరూపించగలిగే సైంటిఫిక్ ఆధారాలైతే ఇప్పటి వరకు లేవని చెబుతున్నారు.
ఎందుకు వస్తాయి?
మనం ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో మెదడులోని రైట్ ఫ్రంటల్ లోబ్‌లో అనుభవాలు, జ్ఞాపకాల తాలూకు న్యూరో డీజనరేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ పరిస్థితివల్ల మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన లేదా భావోద్వేగానికి గురిచేసిన సంఘటనలు, సమస్యలు, జ్ఞాపకాలు వంటివి రీ ప్రాసెస్ పొందుతుంటాయని, దీంతో అవి మెదడు భాగాన్ని ప్రేరేపిస్తూ కలల రూపంలో వ్యక్తం అవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పీడకలలు లేదా భయానకమైన కలలు రావడానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు. అయితే వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఏదైనా మానసిక సమస్య ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్క్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్.
బాబోయ్.. దెయ్యాలు!
మానసిక ఒత్తిడి, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లేదా బైపోలార్ డిజార్డర్ వంటి రుగ్మతల బారిన పడినప్పుడు భయానక లేదా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరో వెంటాడుతున్నట్లు, సూసైడ్ చేసుకున్నట్లు, దెయ్యాలు తరుముతున్నట్లు, ఆత్మీయులు చనిపోయినట్లు కూడా కలలు వస్తుంటాయి. ఇలాంటి భయానక లేదా బాధను కలిగించే వాటినే ప్రజలు పీడకలలుగా పేర్కొంటారు. ఇవి సాధారణంగా రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM), అంటే నిద్ర దశలోనే సంభవిస్తాయి.
మెదడు కార్యకలాపాలే కారణం
గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడులో సంభవించే పరిణామాలు అంటే.. రాపిడ్ ఐ మూవ్‌మెంట్ అనే పరిస్థితి కారణంగా నిద్రలో ఉన్నప్పటికీ మెలకువగా ఉన్నట్లే మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అనుభవాల ప్రాసెసింగ్ ఏకీకరణకు దారితీస్తాయి. ఈ పరిస్థితే పీడకలలు రూపంలో వ్యక్తం అవుతుంది. అలాగే అధికస్థాయి ఒత్తిడి, ఆందోళనలు కూడా పీడకలలు రావడానికి కారణం అవుతాయి. ఎందుకంటే మెదడు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ నిద్రలో భావోద్వేగాలను ప్రాసెస్ చేసి విడుదల చేస్తుంది. అలాగే మెమరీ కన్సాలిడేషన్ ప్రాసెస్ కూడా బాధాకరమైన అనుభవాలను, భావోద్వేగాలను ప్లే చేయడానికి దారితీస్తుంది. ఇవన్నీ కలల రూపంలో వ్యక్తం అవుతాయి. సెరోటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ (norepinephrine) అండ్ ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కూడా ఈ కెమికల్స్ మానసిక స్థితి, భావోద్వేగాలు, నిద్రను నియంత్రిస్తాయి. కాబట్టి పీడకలలు వస్తాయి.
స్లీప్ డిజార్డర్స్
స్లీప్ అప్నియా, ఇన్‌సోమ్నియా(insomnia), రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి రుగ్మతలు పీడకలల ఫ్రీక్వెన్సీని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు వాడటం పీడకలలను ప్రేరేపిస్తాయి. గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమం లేదా రుతువిరతి సందర్భాలు కూడా మహిళల్లో పీడకలలకు కారణం అవుతాయి. నిద్రలేమి, నిరాశ, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులు, కెఫిన్, నికోటిన్, టొబాకో వంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం, అధిక మద్యపానం వంటివి కూడా పీడకలల ఫ్రీక్వెన్సీని పెంచే అవకాశం ఎక్కువ.
పరిష్కారం ఏమిటి?
పీడకలలు తరచుగా వస్తుంటే కొందరు మరింత ఆందోళనకు, భయానికి గురవుతుంటారు.ఈ పరిస్థితిని నివారించాలంటే ముందు కలలు నిజం అవుతాయనే అపోహలను, అపశకునం అనే మూఢ నమ్మకాలను తొలగించుకోవాలి. కలల వల్ల ఎలాంటి లాభం గానీ, నష్టం గానీ, ప్రమాదం గానీ ఉండదు. ఇది తెలుసుకుంటే పీడకలలు హానిచేస్తాయనే భయం నుంచి బయపటడతారు. అలాగే స్థిరమైన క్వాలిటీ స్లీప్ షెడ్యూల్స్ పాటించడం, నిద్రకు ముందు స్క్రీన్లకు దూరంగా ఉండటం, వ్యాయామాలు, యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయడం వంటివి కూడా తరచుగా ఒత్తిడికి గురయ్యే వారిలో ప్రశాంతతను ప్రేరేపించడం ద్వారా పీడకలలను నివారిస్తాయి. ఇవి కాకుండా మీరు ప్రత్యేకించి అంతర్లీన సమస్యలు ఏమైనా ఎదుర్కొంటుంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు శాస్త్రవేత్తలు.






