జీవితకాలాన్ని పెంచే రహస్యం.. సోషల్ బాడింగ్‌తో స్లో ఏజింగ్!

by Javid Pasha |

సామాజిక సంబంధాలవల్ల కలిగే ఆనందం, భావోద్వేగ మద్దతు, స్ట్రెస్ రిలీఫ్ మానవ బయాలాజికల్ ఏజింగ్ వేగాన్ని నెమ్మదింపజేస్తాయి.

జీవితకాలాన్ని పెంచే రహస్యం.. సోషల్ బాడింగ్‌తో స్లో ఏజింగ్!
X

దిశ, ఫీచర్స్ : ఎక్కువ రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే.. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయమాలు చేయడం మాత్రమే కాదండోయ్..! జీవితకాలంలో స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్/ బాండింగ్ కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. మిడ్ లైఫ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ స్టడీ డేటా ఆధారంగా జరిగిన అధ్యయనాలు సైతం ఇదే పేర్కొంటున్నాయి. నిరంతర సామాజిక సంబంధాలు సెల్యులార్ స్థాయిలో మానవ ఆయుష్షును పెంచడంలో సహాయపడతాయని పేర్కొన్నాయి.

జీవగడియారంపై ప్రభావం

కుటుంబ సభ్యులు, సహచరులు, పరిచయస్తులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు.. ఎలా ఎవరైనా కానివ్వండి. ఏ కల్మషమూ లేని స్వచ్ఛమైన సామాజిక సంబంధాలు మానవుల్లో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయని, జీవగడియారాన్ని ప్రభావితం చేయడం ద్వారా కణాల జీవితకాలం పెరగడంలో సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు. ఇందులో భాగంగా 2,000 కంటే ఎక్కువ మంది అడల్ట్స్‌ను పరిశీలించిన రీసెర్చర్స్ సోషల్ కనెక్షన్ వారి దీర్ఘాయుష్షును ఎలా పెంచిందో గుర్తించగలిగారు. సామాజిక సంబంధాలవల్ల పెరిగిన ఆనందం, సపోర్టివ్ రిలేషన్స్, భావోద్వేగ మద్దతు, ఒత్తిడి తగ్గడంతో సహా అనేక విషయాలపట్ల అవగాహన, పరస్పర నమ్మకాలు వంటివి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆరోగ్యానికి, ఆయుష్షు పెరగడానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా బయాలాజికల్ ఏజింగ్ వేగాన్ని అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు ఎపిజెనెటిక్ క్లాక్స్ అనే మాలిక్యులర్ మార్కర్లతో కొలవడం ద్వారా నిర్ధారణకు వచ్చారు.

కారణాలివే..

పరిశోధకుల ప్రకారం.. ప్రేమ, లౌక్యంతో కూడిన సామాజిక సంబంధాలు శరీరంలో జరిగే మార్పులను ప్రభావితం చేయగలరు. ముఖ్యంగా డీప్, లైఫ్‌లాంగ్ సోషల్ బాండ్స్ ఉన్నవారిలో ప్రో-ఇన్‌ఫ్లమేటరీ మాలిక్యూల్ అయిన ఇంటర్‌ల్యూకిన్-6 (IL-6) స్థాయిలు తక్కువగా ఉంటాయి. నిజానికి ఈ దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ అనేది ఏజ్ రిలేటెడ్ వ్యాధులకు ముఖ్య కారణం కాబట్టి, దాన్ని నియంత్రించడంలో, సెల్స్‌ను రక్షించడంలో ‘ఎపిజెనెటిక్ క్లాక్’ సహాయపడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది రోజువారీ స్ట్రెస్ నిర్వహణతో సంబంధం లేదు. పరిశోధకులు స్ట్రెస్ మార్కర్ అయిన కార్టిసాల్‌తో ఎలాంటి ముఖ్యమైన లింక్‌ను కనుగొనలేదు. బదులుగా, లాంగ్-టర్మ్ ప్రయోజనాలు కుటుంబంలో ప్రేమానురాగాలు, సమాజంలోని ఇతరులతో సత్సంబంధాలు, పరస్పర సహాయం, నమ్మకం, విశ్వాసం, నిరంతర భావోద్వేగ మద్దతు వంటి అర్థవంతమైన సంబంధాల నుంచి వస్తాయి. అయితే ఫలితాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని చెప్పలేం. వ్యక్తిగతంగా మారవచ్చునని కూడా పరిశోధకులు అంటున్నారు. అంటే సోషల్ కనెక్షన్ లాంగెవిటీ పజిల్‌లో ఒక భాగం మాత్రమే.

Next Story