సెల్ఫ్ డయాగ్నోజింగ్ ట్రెండ్.. సోషల్ మీడియాలో పెరుగుతున్న కొత్త ధోరణి !

by Javid Pasha |

ఏదైనా ఒక విషయంలో సొంతంగా ఆలోచించడం, సొంతంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మానసిక, శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని ప్రమాణాలు అవసరం అంటున్నారు నిపుణులు.

సెల్ఫ్ డయాగ్నోజింగ్ ట్రెండ్.. సోషల్ మీడియాలో పెరుగుతున్న కొత్త ధోరణి !
X

దిశ, ఫీచర్స్ : ‘వాంతింగ్స్ అవుతున్నాయా? అయితే ఫలానా ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు. చర్మ సమస్యలు వేధిస్తున్నాయా? ఫలానా రెమెడీ ట్రై చేస్తే సరి. ఒత్తిడికి గురవుతున్నారా? కచ్చితంగా డిప్రెషనే కాబట్టి ఈ చిట్కా పాటిస్తే చాలు’ అంటూ తమకు తామే నిర్ధారించుకునే యువతీ యువకులు. ఇతరులకు కూడా ఇలాంటి సూచనలు, సలహాలు ఇచ్చేవారు ఇటీవల సోషల్ మీడియాలో పెరిగిపోతున్నారు. వారేదో డాక్టర్లో, అనుభవం ఉన్న వ్యక్తులో అయి ఉంటే పర్లేదు. కానీ అంత సీన్ లేదు. పైగా 40 ఏండ్లలోపు వారే ఎక్కువగా ఇలాంటి సలహాలు ఇస్తున్న పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. వీరిని ఫాలో అయ్యేవారు, పాటించే వారు కూడా దాదాపు అదే ఏజ్ లోపు వారై ఉంటుంటారు. దీనినే ‘సెల్ఫ్ డయాగ్నోజింగ్ ట్రెండ్’గా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ధోరణి పెరిగిపోతోందని చెబుతున్నారు.

ఏదైనా ఒక విషయంలో సొంతంగా ఆలోచించడం, సొంతంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ మానసిక, శారీరక ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని ప్రమాణాలు అవసరం అంటున్నారు నిపుణులు. అంటే ఏదైనా సలహా ఇచ్చినా, పాటించినా దానికి తగిన ఆధారాలు, శాస్త్రీయత చాలా ముఖ్యం. అందుకోసం వైద్య నిపుణులో, శాస్త్రవేత్తలో, అధ్యయనకర్తలో చెప్పినప్పుడు అది నమ్మదగిన సమచారంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలోని యువతం అది పట్టించుకోవడం లేదు. తాము ఎక్కడో విన్నది, చూసింది. ఎవరో చెప్పింది కూడా నమ్మదగిన సమాచారంగా భావించడం, సోషల్ మీడియాలో పంచుకోవడం, ప్రచారం చేయడం చేస్తున్నవారు చాలామందే ఉంటున్నారు. నిజమే కదా అనుకొని పాటించేవారు సైతం లేకపోలేదు. ముఖ్యంగా మానసిక ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో యుక్త వయస్కుల స్వీయ-నిర్ధారణ ప్రమాదకరమైన ధోరణిగా మారుతోందని నిపుణులు అంటున్నారు.

ఉదాహరణకు ‘‘మీరు తరచూ విసుగు చెందుతున్నారా, వస్తువులను మర్చిపోతున్నారా? పరధ్యానంలో ఉంటున్నారా? ఇవి ఎడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) లక్షణాలు’’ అని సోషల్ మీడియాలో చదివిన యువత వాటిని నమ్మేస్తున్నది. ఈ లక్షణాలు తమలో కనిపిస్తే ఎడీహెచ్‌డీ బారినపడినట్లు ఫిక్స్ అయిపోతున్నారు కొందరు. అలాగే తమ కుటుంబంలో, స్నేహితుల్లో ఎవరిలో కనిపించినా కచ్చితంగా అదే అయుంటుందని అని కన్ఫామ్‌గా చెప్పేస్తుంటారు. సోషల్ మీడియాలో సైతం అవే సలహాలు ఇస్తుంటారు. అంటే ఒక విషయాన్ని అర్హత కలిగిన నిపుణుల ద్వారా కాకుండా తమకు తామే ఊహించుకొని నిర్ధారించుకోవడం, ఎవరో చెప్పింది నమ్మి నిర్ధారించుకోవడం చేస్తుంటారు. ప్రధానంగా స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్, మెంటల్ క్రైసిస్, ఓసీడీ(Obsessive Compulsive Disorder) వంటి లక్షణాలకు సంబంధించి చాలామంది ఇదే చేస్తుంటారు. కానీ అది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఒక విషయాన్ని తెలుసుకోవడంలో, సలహా వినడంలో, పాటించడంలో తప్పులేదు కానీ.. శాస్త్రీయమా కాదా? నిజమా కాదా? అనేది కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ధారించుకుంటే.. గుడ్డిగా నమ్మేసే సెల్ఫ్ డయాగ్నోజింగ్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

Next Story