ఈ అలవాట్లు మీలో ఉన్నాయా..? మార్చుకోకపోతే జరిగే నష్టాలివే..!

by Javid Pasha |   (  Updated:2025-12-05 07:01:08  IST  )

షల్ మీడియా యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య తమను ఇతరులతో పోల్చుకొని ఇబ్బంది పడటం. కానీ ఇది మనల్ని బలహీనులుగా మార్చవచ్చు.

ఈ అలవాట్లు మీలో ఉన్నాయా..? మార్చుకోకపోతే జరిగే నష్టాలివే..!
X

దిశ,ఫీచర్స్ : మీరేదైనా ఒక లక్ష్యం సాధించాలంటే.. ముందుగా అందుకు తగిన మెంటల్ ప్రిపరేషన్‌తో పాటు మీ అలవాట్లను కూడా మార్చుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తుంటారు. అలా చేయకపోతే సాధించాల్సిన అంశాలపై మనసు కేంద్రీకరించలేకపోవచ్చునని చెబుతుంటారు. పైగా లక్ష్యానికి అనుగుణంగా హాబిస్‌ను, ఆలోచనలను మార్చుకోకపోతే మీ పర్సనల్ గ్రోత్ ఆగిపోతుంది. అనేక విషయాల్లో వెనుక బడటానికి, పలు సందర్భాల్లో వైఫల్యం చెందడానికి ఇది కారణం అవుతుంది. అందుకే వాటిని గుర్తించి అధిగమిస్తే సక్సెస్ సాధించడం చాలా ఈజీ. అవేమిటి? ఎలా అధిగమించాలో చూద్దాం.

నెగెటివ్ సెల్ఫ్‌ టాక్స్

సామర్థ్యమున్నప్పటికీ పలు విషయాల్లో చాలామంది విఫలం కావడానికి గల ప్రధానమైన బలహీనతల్లో నెగెటివ్ సెల్ఫ్ టాక్(Negative Self-Talk) ఒకటి. అంటే వ్యక్తులు తమను తామే తామే స్వీయ ప్రతికూల భావాల్లోకి నెట్టుకుంటారు. క్రమంగా ఇది సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ డిప్రెషన్‌తో నిండిన ఇంటర్నల్ డైలాగ్‌లతో కూడిన ఒక సాధారణ అలవాటుగా మారుతుంది. ఇది వ్యక్తుల్లో అంతర్గత సమస్యలను, లోపాలను మరింత పెంచుతుంది. తమకు తాము బలహీనులుగా భావించేలా, ఇతరుల్లో చులకన అయ్యేలా చేస్తుంది. ఈ విధమైన ప్రతికూల స్వీయ మానసిక ధోరణి కాలక్రమేణా ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లక్ష్య సాధనకు ఆటంకంగా మారుతుంది. మీలో గనుక ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి అంటున్నారు నిపుణులు.

ఎదుర్కొనే మార్గమిదే..

స్వీయ ప్రతికూల భావాలను ఎదుర్కోవాలంటే.. సెల్ఫ్ అవేర్‌నెస్‌ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం మీ ఆలోచనలపై శ్రద్ధ వహించండి. ఒక విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించే ముందు ఇది నిజంగా అవసరమా? లేదా ఇది శాస్త్రీయమా లేదా విశ్వాసాల ఆధారంగా ఉందా? అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి. అప్పుడు మీ మనసులోని ప్రతికూల చర్చను సానుకూల దృక్పథంతో పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే మీరు సాధించిన సక్సెస్ గురించి, సంతోషకరమైన విషయాల గురించి ఆలోచించండి. ఇతరులతో చెప్పండి. మీపట్ల మీరు దయ, కరుణ, జాలి వంటి భావాలతో మసలు కోండి.

పర్ఫెక్షన్ జోలికి వెళ్లకండి

కొందరు ప్రతీది పర్ఫెక్ట్‌గా చేయాలనే ఆలోచనలతో, ఆరాటంతో సతమతమౌతుంటారు. చివరికి ఏదీ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. కారణం.. పర్ఫెక్షనిజం. దీనిని కొందరు పాజిటివ్ లక్షణంగా చెబుతుంటారు. నిజానికిది బెడిసి కొడుతుంది. పర్ఫెక్షనిజంపై ఎక్కువగా ఆధారపడటం, ఎక్కువగా ఆలోచించడం వంటివి వైఫల్యానికి దారితీయవచ్చు. అయితే ఆరోగ్యకరమైన కృషి, అన్ హెల్తీ పర్ఫెక్షనిజం మధ్య ఇక్కడ తేడా ఉంటుందని గుర్తుంచుకోండి. పరిపూర్ణవాదులు చాలా వరకు వాస్తవ విరుద్ధమైన ప్రమాణాలను ఏర్పర్చుకుంటూ ఉంటారు. దీనివల్ల వైఫల్యం చెందుతూ, అసమర్థ భావాలతో పోరాడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ కోసం చేసే ఆలోచనలు స్వీయ మానసిక ధోరణికి, వైఫల్యానికి దారితీస్తుంటాయి.

పరిపూర్ణతకంటే.. పురోగతి ముఖ్యం

అనుకున్నది సాధించాలంటే.. పర్ఫెక్షనిజాన్ని పారదోలే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు దీనిని అధిగమించడానికి, రియలిస్టిక్ గోల్స్‌ను చేరుకోవడానికి, వాస్తవిక లక్ష్యాలను, అంచనాలను సెట్ చేయడం చాలా ముఖ్యం. తప్పులు, పొరపాట్లు జీవితంలో సహజం అని గుర్తించి, మరోసారి అలా జరగకుండా వాటిని మీ అభివృద్ధికి అవకాశాలుగా మల్చుకోండి. పరిపూర్ణతకంటే పురోగతిపై ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత మీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే రోజు తప్పక వస్తుంది.

ఇతరులతో పోలిక వద్దు

సోషల్ మీడియా యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య తమను ఇతరులతో పోల్చుకొని ఇబ్బంది పడటం. కానీ ఇది మనల్ని బలహీనులుగా మార్చవచ్చు. ఎందుకంటే తరచుగా ఇతరుల జీవితాలకు సంబంధించి క్యూరేటెడ్ హైలైట్ రీల్స్ చూడటం, ఇతరులు మీకంటే సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని భావించడం, నమ్మడం చేస్తుంటారు. దీంతో ఇతరులతో పోల్చినప్పుడు తాము సంతోషంగా లేమని బాధపడుతుంటారు. నిజానికి ఇటువంటి ఆలోచనలు, అలవాట్లు మీలో అసమర్థతకు, స్వీయ సందేహాలకు ఆజ్యం పోస్తాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చుకోకండి. పోలిక భావాల నుంచి బయటపడటానికి కృతజ్ఞత, స్వీయ ప్రశంసలను ప్రాక్టీస్ చేయండి. మీ బలాలు, విజయాలు, యునిక్ క్వాలిటీస్‌ని క్రమం తప్పకుండా గుర్తించండి. ఇతరులతో పోల్చుకోవడంకంటే మీ పర్సనల్ గ్రోత్ అండ్ ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టండి. మీరు ఆన్‌లైన్‌లో చూసేవన్నీ నిజ జీవితానికి వర్తించవని గుర్తుంచుకుంటే చాలు.

ముందస్తు భయం వదిలేయండి..

ఏదైనా ఒక పని ప్రారంభించకముందే వైఫల్యం చెందుతామన్న భయం కొందరిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే సగం వైఫల్యానికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రతికూల ఆలోచనే అతిపెద్ద మానసిక అవరోధం అంటున్నారు నిపుణులు. వ్యక్తులు తమ ప్రయత్నాలు చేయకుండా అడ్డుకోడంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. మానసిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. తరచుగా స్వీయ పరిమితి నమ్మకాలు, తమ సామర్థ్యాలపై తమకు విశ్వాసం లేకపోవడంవల్ల ఈ భయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు వైఫల్యం చెందుతామనే ముందస్తు భయాన్ని వదిలేస్తారో అప్పుడు తప్పక సక్సెస్ సాధిస్తారు. కాబట్టి భయాన్ని అలవాటుగా మార్చుకోవద్దు. అలాంటి అలవాటు మీలో ఉంటే వెంటనే వదిలేయండి అంటున్నారు నిపుణులు.

Next Story