Toxic love : టాక్సిక్ రిలేషన్‌షిప్.. బతిమాలేకంటే వదిలేయడమే బెటర్!!

by Javid Pasha |

Toxic love : టాక్సిక్ రిలేషన్‌షిప్.. బతిమాలేకంటే వదిలేయడమే బెటర్!!
X

దిశ, ఫీచర్స్ : ఒకరు మాట్లాడటం ఆపేస్తారు.. ఒకరు మాత్రం ప్రాణంకొద్దీ మాట్లాడాలని ఆరాట పడుతుంటారు. ఒకరు తరచుగా మౌనం వహిస్తుంటారు. మరొకరు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఒకరు మెసేజ్ చేయడం, రిప్లయ్ ఇవ్వడం ఆపేస్తారు. ఎందుకో చెప్పరు. ఏమీ పట్టించుకోరు. ఇంకొకరు మాత్రం అవతలి వ్యక్తి స్పందించకపోయినా, పట్టించుకోకపోయినా, మాట్లాడకపోయినా ఆ వ్యక్తికోసమే ఒంటరిపోరాటం చేస్తుంటారు. తరచుగా మెసేజ్‌లు పెడుతుంటారు. బంధాన్ని నిలబెట్టుకుందామని గుండె భారాన్ని మోస్తుంటారు.. కానీ ఏమిటి లాభం! అవతలి వ్యక్తి మిమ్మల్ని వదిలించుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయుంటారు. ఎందుకంటే టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అన్నీ దాదాపు ఇలాగే ముగుస్తాయి అంటున్నారు నిపుణులు.

ఇష్టం లేకుంటే అన్నీ కష్టాలే..

అవతలి వ్యక్తిపై ఆసక్తికొద్దీ, ఇష్టం, ప్రేమకొద్దీ మెసేజ్ చేయడానికి, మాట్లాడటానికి మీరు మాత్రమే ప్రయత్నిస్తూ ఉండటం, రెస్పాండ్ అవకపోతే బాధపడుతూ ఉండటం చేస్తుంటే.. అది వన్‌సైడ్ లవ్..! అవతలి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు ఎంత చేస్తే ఏం ఫలితం? అందుకే డ్రాప్ అవడం బెటర్. ఒకవేళ అప్పటికే సంబంధంలో ఉండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే గనుక అది టాక్సిక్ రిలేషన్‌షిప్.. అంటే త్వరలో బ్రేకప్ లేదా విడాలకు జరగొచ్చు. ఎందుకంటే అవతలి వ్యక్తికి మీరు ఇష్టం లేదు లేదా నచ్చడం లేదు! కాబట్టి బ్రేకప్ లేదా డైవర్స్ కోసం సిద్ధపడటం బెటర్ అంటున్నారు నిపుణులు.

మౌనం.. ఉద్దేశ పూర్వక నిర్ణయం..

ఒకసారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటికి పదిసార్లు, ప్రతిరోజూ అవతలి వ్యక్తి మౌనమే సమాధానంగా ఉంటూ ఉంటే.. అది పొరపాటో, తప్పిదమో, అవగాహన రాహిత్యమో కాదు. మీరంటే ఇష్టంలేక తీసుకున్న ఉద్దేశ పూర్వక నిర్ణయం. ఒక విధంగా ఇది మీరు తనకు వద్దు అని చెప్పడమే. నేరుగానో, ముఖం మీదనో చెబితే మీరు వినరనో, మరీ ఎక్కువ ఫీలవుతారనో, బాధ పడతారనో, భయ పడతారనో, భయ పెడతారనో భావించినప్పుడు అలా బిహేవ్ చేస్తుంటారని రిలేషన్‌షిప్ అండ్ మోటివేషనల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అలాంటప్పుడు వదులుకోవడమే మంచిది. లేకుంటే అది మరింత టాక్సిక్ రిలేషన్‌షిప్‌గా మారిపోయి మిమ్మల్ని బాధకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భారం వద్దు.. బాధ వద్దు

ఇద్దరు కలిసి జీవించాలనుకున్నప్పుడు ఒక్కరే మాట్లాడటం, ఒక్కరే చొరవ తీసుకోవడం, ఒక్కరే ప్రేమించడం, ఒక్కరే బాధను, బాధ్యతను మోయడం, ఒక్కరే ప్రేమించడం సాధ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా, జరిగినా బాధలు, కష్టాలు తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. అందుకే వదిలేయడం బెటర్. ఎందుకంటే.. ఒకవైపు ప్రయత్నం మాత్రమే ఉన్నప్పుడు అది ప్రేమ కాదు. కేవలం మీ వైపు నుంచి కొనసాగుతున్న భావోద్వేగ శ్రమ (emotional labor). అవతలి వ్యక్తికి ఆసక్తి లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఆ వ్యక్తికోసం మీరు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువ అలసిపోతారు. ఫలితం దక్కక ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకే బాధగా అనిపించినా సరే.. కొన్ని బంధాలను వదులుకోవడమే మంచిది. ముఖ్యంగా వన్‌సైడ్ ప్రేమలు, సంబంధాలు వద్దే వద్దు అంటున్నారు నిపుణులు.

రియల్ లవ్.. నో ప్రాబ్లమ్

నిజమైన ప్రేమగల సంబంధాల్లో ఎవరూ ఎవరినీ వెంటాడాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఎవరినీ ప్రత్యేకించి అర్థం చేసుకోవాలంటూ అభ్యర్థించాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా బాధపెట్టరు. ఇక్కడ ఒకరి భావాలు ఒకరికి సహజంగానే అర్థమైపోతాయి. బాధలను, భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. అభిప్రాయాలను, కష్ట సుఖాలను కలిసి పంచుకుంటారు. ఇద్దరూ నిజాయితీగా ఉంటారు. ఒకరు మౌనంగా ఉంటూ మాట్లాడటం, మెసేజ్ చేయడం, రిప్లయ్ ఇవ్వడం వంటివి ఆపేస్తే.. మీరు మాత్రమే అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది సంబంధం కాదు. విషపూరిత సంబంధం. ఒకరిపై ఒకరు భారం మోపుకోవడం. ఎప్పటికైనా అది టాక్సిక్‌గా మారుతుంది.

వద్దనుకునే వాళ్లను వదిలేయండి..!

ఒక వైపు నుంచి మాత్రమే టూ మచ్ లవ్ వద్దు. మిమ్మల్ని వద్దనుకునే వాళ్లను వదిలేయండి. మీతో మాట్లాడే వాళ్లను, మీకోసం ఆరాటపడేవాళ్లను ఎంచుకోండి. వాళ్లకోసం మీరు అనుకున్నవన్నీ చేయండి. ఎందుకంటే వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఇరువైపులా అంగీకరంలోనే నిజమైన ప్రేమ ఉంటుంది. ఒక్కరే చేస్తే అది టాక్సిక్ రిలేషన్‌షిప్ అవుతుంది. ఇది ఎన్నటికైనా బెడిసి కొడుతుంది. అందుకే వదిలేయండి. వదిలేసి నందుకు గుండె నిండా ఊపిరి పీల్చుకోండి. మీకోసం పరితపించేవారిని ఎంచుకోండి! అప్పుడు లైఫ్ బిందాస్‌గా ఉంటుంది. Link

Next Story