Gold : బంగారం.. అలంకరణే కాదు.. మహిళల జీవన మనుగడ.. సాధికారత కూడాను!

by Javid Pasha |

ఇండియన్ కల్చర్‌లో ‘బంగారం’ది కీలకపాత్ర. అందుకేనేమో ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతీయ మహిళలే సుమారు 11% సొంతం చేసుకున్నారు.

Gold : బంగారం.. అలంకరణే కాదు.. మహిళల జీవన మనుగడ.. సాధికారత కూడాను!
X

దిశ, ఫీచర్స్ : ఏ నలుగురు మహిళలు కలిసినా వారిమధ్య ఎక్కువగా చర్చకు వచ్చే అంశాల్లో బంగారం (gold) సబ్జెక్ట్ తప్పక ఉండే ఉంటుంది! గోల్డ్‌ బ్యాంగిల్స్, బంగారు జుంకాలు, అందమైన వడ్డాణం.. ఆకట్టుకునే నెక్లెస్.. మిల మిలా మెరిసే ముక్కు పుడకా.. ఇలా ఎన్నో రకాల డిజైనర్ గోల్డ్ జ్యువెల్లరీస్ గురించి ఆసక్తిగా మాట్లాడుకోవడం కామన్... బట్ వై..? అంటే.. భారతీయ మహిళలకు గోల్డ్ కేవలం అలంకరించుకునే లగ్జరీ వస్తువు మాత్రమే కాదు. అది ఆత్మగౌరవంతో, జీవన మనుగడతో ముడిపడి ఉంటున్నది. విద్య, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణకు జీవనధారంగా నిలుస్తున్నది.

అందమే కాదు.. ఆర్థిక వనరు

అందమైన ఆభరణాల రూపాన్ని సంతరించుకొని మహిళల్ని ఆనంద పారవశ్యంలో ముంచేయడమే కాదండోయ్.. బంగారం వారి జీవితాన్ని సక్సెస్ తీరాలవైపు మలుపు తిప్పుతుంది కూడా. ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో, కుటుంబాలను సంరక్షించుకోవడంలో కీ రోల్ పోషిస్తుంది. ఆపద సమయంలో ఆదుకునే ఆర్థిక శక్తిగా మారుతుంది. అందుకే గోల్డ్ రేట్ పెరిగినా.. తగ్గినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే అది భారతీయ మహిళల జీవితాలను తప్పక ప్రభావితం చేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారుగా.. ఆ మధ్య సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు దూసుకెళ్తూ వస్తున్న గోల్డ్ రేట్స్.. ప్రస్తుతం కాస్త తగ్గుతూ వస్తుండటంతో ఎంతోమంది మగువల ముఖాలపై చిరునవ్వులు విరబూస్తున్నాయి. ఎందుకంటే.. జీవితంలో గోల్డ్ ఒక పవర్ ఫుల్ ఎమోషన్!

భారతీయ మహిళలే గ్రేట్..

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ఇండియన్ కల్చర్‌లో ‘బంగారం’ది కీలకపాత్ర. అందుకేనేమో ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతీయ మహిళలే సుమారు 11% (దాదాపు 24,000-25,000 టన్నులు) సొంతం చేసుకున్నారు. ఇది అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల అధికారిక రిజర్వ్‌ల కంటే కూడా ఎక్కువని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. నిత్య జీవితంలో ఆర్థిక పరిస్థితులు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, శుభకార్యాలు, సంప్రదాయాలు వంటి అనేక అంశాలతో ముడి పడి ఉండటమే ఈ బంగారు విలువకు భారత దేశంలో అంత క్రేజ్ మరి. ముఖ్యంగా వివాహాల సమయంలో ఇది స్త్రీ ధనంగా, తల్లుల నుంచి కుమార్తెలకు ఇచ్చే ఆస్తిగా, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో లిక్విడిటీగా ఉపయోగపడుతుంది. అప్పులెక్కువైనప్పుడో, అర్జంట్‌గా డబ్బు అవసరమైనప్పుడో బంగారం ఉంటే.. ఆదుకుంటుందనే ధైర్యం.. ఆత్మ స్థైర్యానికేం కొదువలేదు భారతీయ నారీమణుల్లో.

కుటుంబ ఎదుగుదలలో..

అప్పులు పుట్టనప్పుడు, ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు, ఉద్యోగాలు ఊడినప్పుడు చేతిలో చిల్లి గవ్వలేకపోతే.. ఎవరూ ఆదుకోకపోతే.. ఆ ఇంటి మహిళ ఒంటిమీద బంగారమే దిక్కు అంటుంటారు పెద్దలు. ఇది వందకు వందశాతం నిజంగా నిజం.. కేవలం మహిళలకే కాదు. కుటుంబాల ఎదుగుదలకు సైతం బంగారం అవసర పడుతున్నది. వ్యాపారాలు ప్రారంభించడానికి, పిల్లల చదువులకు, పెద్దల వైద్య ఖర్చులకు సహాయపడుతున్నది. ఇక బ్యాంకులు లేదా ఫార్మల్ ఫైనాన్స్ సిస్టమ్‌లో పూర్తి యాక్సెస్ లేని మహిళలకు బంగారమే ఒక పోర్టబుల్, విజిబుల్ ఆస్తి అని చెప్పొచ్చు. గోల్డ్ లోన్స్ ద్వారా త్వరగా డబ్బు పొందడంలో ఇది సహాయపడుతుంది. దీనికి ద్రవ్య విలువ ఉంటుంది కాబట్టి అంత వాల్యూ మరి. జీవితంలో బంగారం కొనడం, ధరించడం ఒక అవసరం కావచ్చు. కానీ అది మాత్రమే పూర్తి జీవితం అని మాత్రం ఫిక్స్ అవ్వకండి అటున్నారు నిపుణులు. కుటుంబ జీవితం, ప్రేమానురాగాలు ఈ బంగారం కంటే కూడా విలువైనవని తెలిసినప్పుడు దాని నిర్వహణ, ప్రాధాన్యతల మధ్య సమతుల్యత, సాధికారత సాధ్యం అవుతుందని మహిళలు తెలుసుకోవాలి.

Next Story