- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రైడల్ మేకోవర్.. కుందనపు బొమ్మ.. కృత్రిమంగా మారాలా?
భారతీయ పెళ్లిళ్లల్లో బ్రైడల్ మేకోవర్ కల్చర్ కొనసాగుతోంది.‘పర్ఫెక్ట్ బ్రైడ్’గా కనిపించాలనే ఒత్తిడి పెరుగుతోంది.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు పెళ్లికూతురు ముఖంలో కనిపించే ‘పెళ్లి కళ’ ఇంట్లో దంచిన పసుపు, నలుగు పిండిలో ఉండేది. కానీ నేడు ఆ కళను బ్యూటీ పార్లర్లలోని రసాయనాల్లో వెతుక్కుంటున్నారు చాలామంది. ముఖ్యంగా భారతీయ పెళ్లిళ్లల్లో బ్రైడల్ మేకోవర్ అనే కొత్త కల్చర్ ప్రవేశించింది. దీంతో పెళ్లి రోజు ‘పర్ఫెక్ట్ బ్రైడ్’గా కనిపించాలనే సమాజపరమైన, కుటుంబపరమైన, సోషల్ మీడియా పరమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇంటిలోనే అవలంభించే సహజ సౌందర్య చిట్కాలతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్లు, కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్స్ వంటి హానికరమైన పద్ధతుల వైపు మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హానికరమైన బ్యూటీ స్టాండర్స్
పెళ్లి రోజు అందంగా, సన్నగా, నాజూగ్గా కనిపించాలనే ఉద్దేశంతో పెళ్లికి ముందు నెలల తరబడి అమ్మాయిలు ఎక్స్‌ట్రీమ్ డైటింగ్, క్రాష్ డైట్స్ చేసి స్లిమ్ బాడీ, ఫేస్ స్కిన్, లేజర్ హెయిర్‌ను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బ్యూటీ స్టాండర్స్ చాలా హానికరమని నిపుణులు అంటున్నారు. ఆశ్చర్యకరంగా ఈ మేకోవర్ ఒత్తిడి పురుషులపై మాత్రం లేదు. వీరి శారీరక సౌష్టవం ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. కానీ అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలా ఉండాలనే సమాజం పెట్టిన ఈ వింతైన అందాల పోటీలో పెళ్లికూతుళ్లు కేవలం అలంకరణ వస్తువులుగా మిగిలిపోతున్నారు.
అమ్మాయిలకే ఎందుకు?
అబ్బాయిల విషయంలో లేని ఈ మేకోవర్ నిబంధనలు, అమ్మాయిల మీద ఒత్తిడిగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందంగా కనిపించాలనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకు అనుసరించే అసహజమైన, అనారోగ్యకరమైన పద్ధతులే ఇక్కడ ప్రమాదకరంగా మారుతున్నాయి. మహిళల ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం కంటే బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పైగా ఈ ట్రీట్మెంట్లు అధిక ఖర్చుతోపాటు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాప్ కల్చర్ ప్రభావం
ఇటీవలి వస్తున్న కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ అనవసరమైన బ్యూటీ ప్రెజర్‌ను నార్మలైజ్ చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ ‘పర్ఫెక్ట్ బ్రైడ్’ లుక్ కోసం ఒత్తిడి పెరిగింది. ఒక విధంగా ఇది యువతుల సొంత వ్యక్తిత్వం, సహజ సౌందర్యాన్ని చంపేస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. నిజానికి సౌందర్యం స్కిన్ టోన్ లేదా నడుము కొలతలపై ఆధారపడాల్సిన విషయం కాదు. ఇది నిజమైన సంతోషం, ఆత్మ విశ్వాసంతో ముడిపడినదై ఉండాలి. కానీ బ్రైడల్ మేకోవర్ కల్చర్ వీటికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. అందుకే యువతులు, వారి కుటుంబాలు సహజ సౌందర్యానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.






