లైట్లు వెలిగితే దోమలు పరార్..! థాయిలాండ్ నిపుణుల వినూత్న ఆవిష్కరణ

by Javid Pasha |

లైట్లు వెలిగితే దోమలు పరార్..! థాయిలాండ్ నిపుణుల వినూత్న ఆవిష్కరణ
X

దిశ, ఫీచర్స్ : చూడ్డానికి చిన్న జీవులే కానీ.. వ్యాధుల వ్యాప్తిలో దోమలు ఎంత ప్రమాదకరమో తెలిసిందే. ప్రపంచంలో అనేకమంది వీటి కారణంగా రోగాల బారినపడుతున్నారు. ఇక వాటి నుంచి రక్షణ కోసం కాయిల్స్, లిక్విడ్స్, దోమ తెరలు వంటివి వాడుతుంటారు. అయితే థాయిలాండ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు మాత్రం దోమల బారినుంచి ప్రజల రక్షణ కోసం ఒక వినూత్న ఆవిష్కరణకు తెరతీశారు. వీధుల్లో అమర్చడం ద్వారా దోమలను నివారించగలిగే సౌర శక్తితో నడిచే స్ట్రీట్ లాంప్స్‌ను రూపొందించారు.

థాయిలాండ్‌లో అభివృద్ధి చేసిన సౌర శక్తితో నడిచే వీధి దీపాలు (solar-powered street lamps) రాత్రిళ్లు వెలుగును అందించడమే కాకుండా, రాత్రింబవళ్లు దోమలను తరమడంలో సహాయపడుతున్నట్లు వాటి ఆవిష్కర్తలు పేర్కొంటున్నారు. ఇక వీటి పనితీరు విషయానికి వస్తే, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. అదే సమయంలో సిట్రోనెల్లా, లెమన్‌గ్రాస్ వంటి సహజ సిద్ధమైన ఎసెన్షియల్ ఆయిల్‌లను ఆవిరి చేస్తాయి. ఈ నూనెలే ఆవి రూపంలో వీధుల్లో దోమలను నివారిస్తాయి. అలాగే ప్రతీ ల్యాంప్ చుట్టూ రసాయన రహిత సురక్షితన జోన్‌ను క్రియేట్ చేస్తాయి. దోమలను తరిమే ఈ సరికొత్త స్మార్ట్‌ డిజైన్ స్ట్రీట్ ల్యాంప్‌లు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తూనే దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం థాయిలాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, బ్యాంకాక్, చియాంగ్ మాయ్, ఫుకెట్ వంటి నగరాల్లో మాత్రమే వీటిని వినియోగిస్తన్నారు.

Next Story