ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. విషాదంగా మారుతున్న పతంగుల సరదా!!

by Javid Pasha |

చైనా మాంజాతో ప్రతీ సంవత్సరం భారత దేశంలో ప్రమాదాలు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ ఎన్నో ఘటనలు జరిగాయి.

ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. విషాదంగా మారుతున్న పతంగుల సరదా!!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు పతంగుల పండుగొస్తుందంటే అందరూ సంతోషపడేవారు. కానీ ఇప్పుడు దానికితోడు భయం కూడా వెంటాడుతోంది. ఎందుకంటే గాలిపటాలు ఎగుర వేయడం సంబురమే అయినా, వాటికోసం ఉపయోగిస్తన్న చైనా మాంజా మనుషుల, జంతువుల, పక్షుల ప్రాణాలు తీస్తోంది. ఏటా ఎంతోమంది గాయపడుతున్నారు. అందుకే పిల్లలు పతంగీ కావాలంటే తల్లిదండ్రులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కారణం గాలిపటాలతోపాటు మాంజా కావాలంటారు. ఇప్పించకుండా ఉందామంటే మారాం చేస్తుంటారు. పోనీ షాపుల్లో, మార్కెట్లో దొరకకుండానైనా ఉంటే, దొరకట్లేదని చెప్పడానికి వస్తుంది. కానీ ఎక్కడ చూసినా విచ్చల విడిగానో, సాటు మాటుగానో చైనా మాంజాను అమ్ముతూనే ఉంటారు. అంతెందుకు డిసెంబర్ 26, శనివారం కూడా మేడ్చల్ జిల్లా, కీసరలోని మల్లికార్జున్ నగర్‌లో చైనా మాంజాతో మెడకు తగిలి ఓ యువకుడి గొంతు కోసుకుపోయింది. ఇక ముందు ఇలాంటి దారుణాలెన్ని చూడాల్సి వస్తుందో మరి..!

గాల్లో కలుస్తున్న ప్రాణాలెన్నో..

చైనా మాంజాతో ప్రతీ సంవత్సరం భారత దేశంలో ప్రమాదాలు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ ఎన్నో ఘటనలు జరిగాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇవి మరింత ఎక్కువగా జరుగుతుంటాయి. 2020-2025 హైదరాబాద్‌లో వేలాదిమంది చైనా మాంజావల్ల గాయపడ్డారు. 2025 జనవరిలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్ సహా ముగ్గురు చైనా మాంజావల్ల గాయపడ్డారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో 20 ఏళ్ల అద్నాన్ అనే యువకుడు గొంతు, చేయి, కాలికి మాంజా చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌ సిటీలోనే సంక్రాంతి సమయంలో 12 ప్రమాదాలు సంభవించాయి. ఒకరు మరణించారు.

ఎందుకంత ప్రమాదకరం?

నిజానికి చైనా మాంజా మారణాయుధంతో సమానం. ఎందుకంటే అది ప్రాణాలు తీస్తుంది. సింథటిక్ నైలాన్ లేదా ప్లాస్టిక్ తాడుతో తయారు చేసే ఈ గాలిపటాల దారాలకు తయారీ సమయంలో పొడి గాజు ముక్కలు, మెటల్ పౌడర్ లేదా ఇతర పదునైన రసాయనిక పదార్థాలతో కూడిన పూత పూస్తారు. దీంతో అది గట్టిగా, పదునుగా తయారవుతుంది. కత్తికంటే కూడా సులభంగా మానవుల, పక్షుల, జంతువుల ప్రాణాలు తీయగలదు. అంతేకాకుండా మాంజా నాన్-బయోడిగ్రేడబుల్(కుళ్లిపోని)‌గా ఉండటం వల్ల పర్యావరణానికి కూడా హానికరం. సాధారణంగా గాలిపటాల పోటీల్లో ఇతరుల గాలిపటాలను కత్తిరించడానికి దీనిని ఉపయోగిస్తుంటారు. కానీ ఆ సందర్భంలో తెగిన మాంజా గాలిలో తేలుతూ లేదా చెట్లపై, తీగలపై, బిల్డింగులపై, రోడ్లపడి మనుషులు, పక్షల ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. గొంతుకు, కాళ్లకు చుట్టుకొని ఏటా ఎన్నో పక్షలు మరణిస్తున్నాయి. చైనా మంజాపై ప్రభుత్వాలు నిషేధం విధించినప్పటికీ అమలు విషయంలో కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ 2023, సెక్షన్ 223 ఎవరైనా మాంజా అమ్మినా, వాడినా రూ.5000 జరిమానా లేదా 1 సంవత్సరం జైలు శిక్షకు అర్హులు. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు!

Next Story