క్యూ లైన్ జాన్తా నై.?!

by Daayi Srishailam |

లైన్లో నిలబడటం మనకు నామోషీ

క్యూ లైన్ జాన్తా నై.?!
X

దిశ, ఫీచర్స్: దయచేసి క్యూలో నిల్చొండి. Please stand in line. कृपया लाइन में खड़े रहें। మీ పాదాలను పసుపు గీతలో ఉంచండి. Keep your feet on the yellow line. अपने पैर पीली रेखा पर रखें। ఒకరి తర్వాత ఒకరు లైన్‌లో రండి. Come in line one after another. एक के बाद एक लाइन में आओ।... ఇలా ఎన్ని విధాలుగా.. ఎన్ని భాషల్లో.. అనౌన్స్ చేసినా.. సూచించినా.. హెచ్చరించినా.. పట్టించుకోరు మనొళ్లు. ఎందుకంటే.. లైన్లో నిలబడటం మనకు నామోషీ.!!

గొప్పొళ్లవుతారా.?

సింపుల్ అబ్జర్వేషన్. పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది 'Q' పద్ధతి పాటించండి అని. మీరు చూసినంతలో దీన్ని పాటించినవారు ఎంత శాతం ఉంటారు.? ఒకసారి మెట్రోరైల్ స్టేషన్ దగ్గరికి వెళ్లి చూడండి. నాన్‌స్టాప్‌గా అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంటుంది. కానీ.. దాన్ని పట్టించుకున్న నాథుడున్నాడా.? ''వొర్లివొర్లి మీరు సావుండ్రి.. వొండుక తిని మేం పండుతం'' అన్నట్లు ఉంటుంది జనాల ఆలోచనా విధానం. క్యూ లైన్ పాటించడం అంత నామోషీయేమో మరి వాళ్లకు.? లేకపోతే దాన్నొక గొప్పదనంగా ఫీలవుతున్నారో అర్థంకాదు. లైన్లో నిల్చునే ఓపికల్లేకపోతే ఇక జీవితంలో ఏం నిలబడతారు.? నిజంగా క్యూ పద్ధతి పాటించండి అని వచ్చే అనౌన్స్‌మెంట్‌కే నోరుంటే.. ఎంత తిట్టుకుంటుందో.?

స్టేటస్ సింబలా.?

రేషన్ దుకాణం దగ్గర జనాలంతా గుమిగూడి ఉంటారు. క్యూ లైన్ పాటించాలని డీలర్ కొంచె గట్టిగానే చెప్తాడు కాబట్టీ చాలామటుకు ఈ నియమాన్ని పాటిస్తుంటారు. కానీ మధ్యలో ఎవరో ఒకాయన వస్తాడు చూడండీ.. అందర్నీ తోసుకొని డైరెక్ట్ షాప్‌లోకి వెళ్లిపోతాడు. హరీబరీగా థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేసి అమాంతం రేషన్ సరుకులు తీసుకొని వెళ్లిపోతాడు. అక్కడున్నవాళ్లంతా నోరళ్లబెట్టి చూస్తారు. గంటల తరబడి నిలబడ్డ వాళ్లంతా పనీ పాట లేక ఉన్నట్టా మరి.? అందరూ లైన్‌లో ఉన్నప్పుడు మధ్యలో దూరి 'Q' లైన్‌ను దెబ్బతీసి స్టేటస్ చూపించుకోవడానికి ఇది సొంత దుకాణం కాదు. పబ్లికందరికీ సరుకులు ఇచ్చే కేంద్రం. ఈ సోయి లేనంతకాలం ఈ క్యూలైన్ బ్రేకింగ్‌లు జరుగుతూనే ఉంటాయి.

సిగ్గు సిగ్గు..

''ఎవరేమనుకుంటే మనకేంటి.? రూల్స్ అన్నింటినీ పాటిస్తే బాగనే ఇగ. ఐనా నేనొక్కడ్ని పాటించకపోతే ఏమైతదంటా'' అనే ధోరణివల్లే 'Q' లైన్ క్రాసింగ్ సమస్యలొస్తాయి. పాపం 60 ఏళ్ల వృద్ధులు సైతం ఈ నియమావళిని పాటిస్తూ లైన్‌లో నిల్చుంటారు. కానీ 25 ఏళ్ల యువకుడు మాత్రం క్యూలైన్‌ను పాటించడానికి ఆపసోపాలు పడి అడ్డదారులు వెతుక్కుంటుంటాడు. ఇదేంటయ్యా బాబూ అని ఎవరైనా మా మామ పోలీస్.. మా బావ లీడర్.. నేను అదీ ఇదీ అని సాకులు చెప్తుంటారు. వాళ్ల బావ లీడరైతే.. లేక ఆయనేదో పెద్ద సారు అయితే మాత్రం 'Q' లైన్ రూల్స్ వర్తించవా.? పండు ముసలొల్లు సైతం ఓపికతో ఉండి పాటిస్తుంటే.. యువత దీన్ని విస్మరించడం నిజంగా సిగ్గుచేటే.

జరిమానా వేస్తే.?

'Q' లైన్ పాటించకపోతే జరిమానా విధిస్తాం అనే పరిస్థితి ఉందంటే పౌరులెంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్లను సింగపూర్‌ క్యూ లైన్లలో కొద్దిరోజులు నిలబెడితే దారిలోకి వస్తారు. అక్కడ మనలా ఇష్టమొచ్చినట్లు చేస్తే నడవదు. క్యూలో నిలబడకపోయినా.. హోదాలు స్థాయిలు చెప్పుకొని లైన్లో దూరినా SGD 1,000 జరిమానా విధిస్తారు. అమెరికాలో అయితే దీన్నొక నేరంగా పరిగణిస్తారు. క్యూ నియమాలను ఉల్లంఘిస్తే దానిని దుష్ప్రవర్తనగా భావించి $50 నుంచి $1,000 వరకు పెనాల్టీ వేస్తారు. క్యూలో నిలబడి నెడితే కూడా $25 నుంచి $100 వరకు ఫైనేస్తారు. పబ్లిక్ కు అంతరాయం కలిగించినందుకు $100 నుంచి $500 జరిమానా వేస్తారు.

'Q' మన కల్చర్ బాస్

''ఇండియాలో పౌరులు క్రమశిక్షణతో ఉంటారు'' అనేది ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్న మాట. ఆ లెక్కన చూసుకుంటే 'Q' మన కల్చర్. కానీ దాన్నెవరు పాటిస్తున్నారు.?పోలింగ్ బూత్ దగ్గర సినీ హీరోలు.. పొలిటీషియన్స్ క్యూలో నిల్చున్నారన్న వార్తలు చూసి గొప్పలు చెప్పుకుంటారు కానీ.. వాళ్లలా మనమూ ఈ నియమాన్ని పాటిద్దామనే స్పృహ కనిపించదు. జపాన్‌లో ఇలా చేస్తే అసభ్య ప్రవర్తన కింద పరిగణిస్తారు. యూకేలో శాంతి, ప్రజా క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. అమెరికాలో 'Q' ను ఒక కండీషన్‌గా పెడతారు. కానీ 'Q' లైన్ మన కల్చర్ అని చెప్పుకునే ఇండియాలో మాత్రం దీనిని నిర్లక్ష్యం చేస్తు్న్నారని విమర్శలూ ఉన్నాయి.

క్యారెక్టర్ లేనట్టే.!

''నా దారి అడ్డదారి.. నన్నెవడ్రా ఆపేది'' అనే బిల్డప్ బాగా పెరిగిపోతోంది యువతలో. ఎందుకో మరి లైన్‌లో నిల్చోవడం.. సామాజిక దూరం పాటించడం నామోషీ అనుకుంటున్నారు. అదే వైన్సుల కాడనో.. బార్ల కాడనో అయితే ఎన్ని గంటలైనాసరే బుద్ధిమంతుల్లా నిలబడతారు. తాగే దగ్గరున్న సోయి రైల్ ఎక్కే దగ్గరో.. బస్ దిగే దగ్గరో.. దైవ దర్శనంలోనో.. సినిమా థియేటర్ ఆవరణలోనో ఎందుకుండదు.? ఉండాల్సిన చోటేమో ఉబ్బరంగా ఫీలవుతారు. అనవసరమైన విషయాల దగ్గరేమో తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. క్యూ అనేది పని సులభతరం చేసే నియమం మాత్రమే కాదు. అదొక క్యారెక్టర్. మర్యాద చిహ్నం. ఇతరులకు ఇచ్చే గౌరవ సూచకం. మెరుగైన భద్రతకు సంకేతం.

బ్రేక్ చేయాలా.?

''బ్రేక్ ద రూల్స్'' అనేది ఈ మధ్య ప్యాషనైపోయింది. ప్రతీవోడు ఏదో దిక్కుమాలిన పనిచేయడం.. బ్రేక్ ద రూల్స్ అనడం. నిజంగా రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తే ఏం చేయాలి.? బద్దకాన్ని బ్రేక్ చేయాలి. మీలో నరనరాన పాతుకుపోయి మెదళ్లకెక్కిన నిర్లక్ష్యాన్ని బ్రేక్ చేయాలి. ఏమైతుందిలే అనే బాధ్యతారాహిత్యాన్ని బరాబర్ బ్రేక్ చేయాలి. లైన్లో ఉన్నవాళ్లంతా తెలివితక్కువ వాళ్లు.. భయస్తులు.. రూల్స్ బ్రేక్ చేసనవాళ్లు ధైర్యవంతులు అనే దిక్కుమాలిన ఎలివేషన్స్ తగ్గిస్తే ఏ తొక్కిసలాటలు జరగవు. వీళ్ల బ్రేక్ ద రూల్స్ కు అగ్గిదలగ.. ఆఖరికి టిఫిన్ సెంటర్ దగ్గర.. ఫంక్షన్లలో తినే దగ్గర కూడా అరాచకం చేస్తుంటారు. కాబట్టీ చేయాల్సింది రూల్స్ బ్రేక్ కాదు.. ఫూల్స్ ఐడియాలని.

1. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో 'Q' లైన్ ఉల్లంఘిస్తే..

2. దుష్ప్రవర్తన కింద $50- $1,000 పెనాల్టీ.

3. నేరపూరిత క్రమరహిత ప్రవర్తన కింద $1,000- $10,000 జరిమానా.

4. ప్రజా అంతరాయం కింద $100- $500 ఫైన్.

1. జపాన్‌లో క్యూ పద్ధతిని విస్మరిస్తే బహిరంగ క్షమాపణ.. పోలీస్ కేసు.

2. యూకేలో పోలీసు కేసు.. ఆ ప్రాంగణం నుంచి బహిష్కరణ.

3. ఆస్ట్రేలియాలో పోలీసు కేసు, ప్రాంగణం నుంచి తొలగింపు.

4. చైనాలో తక్షణ క్రమశిక్షణ రాహిత్య చర్య అమలు.

1. ఇండియాలో క్యూ పద్ధతికి ఆటంకం కలిగిస్తే IPC సెక్షన్ 283.. IPC సెక్షన్ 341 కింద కేసు నమోదు చేస్తారు.

2. సింగపూర్‌లో సెక్షన్ 35, 36 కింద కేసు బుక్ చేస్తారు.

3. యూకేలో పబ్లిక్ ఆర్డర్ చట్టం 1986 ప్రకారం సెక్షన్ 14.. సెక్షన్ 15 కింద కేసు పెడతారు.

4. ఆస్ట్రేలియాలో 1966 చట్టం ప్రకారం సెక్షన్ 6, 7 కింద క్రమరహిత ప్రవర్తన కింద కేసు పెడతారు.

మానసిక సమస్యే: వీరెందర్ చెన్నోజు, సైకాలజిస్ట్

క్యూలైన్ పద్ధతికి ఆటంకం కలిగించడం కూడా ఒక మానసిక సమస్యే. ఎంతసేపూ వాళ్ల గురించే ఆలోచిస్తారు. మమ్మెల్ని ఆపేదెవరు అనే ఒకరకమైన మెంటాలిటీతో ఉంటారు. ఏ వ్యవస్థకూ రెస్పెక్ట్ ఇవ్వనివాళ్లే.. అనుకోగానే అయిపోవాలనే ఆలోచనతే ఇలా చేస్తుంటారు. కౌన్సిలింగ్‌తో సరిచేయొచ్చు.

తొక్కిసలాటలు: కె. అంజి, కాలేజీ క్లర్క్

సినిమా థియేటర్లు.. ఆలయాల వద్ద తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి.? క్యూలైన్ అనేది లేకపోవడం వల్లే కదా.? ప్రాణనష్టం జరుగుతున్నా దాన్ని అలాగే నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టీ ఈ విషయంలో కఠిన నిర్ణయాలే బెటర్.

Next Story