ఆందోళన, ఒత్తిడికి దారితీస్తున్న రోజువారీ అలవాట్లు.. బయటపడే మార్గాలివే..

by Javid Pasha |   (  Updated:2025-07-12 13:47:39  IST  )

ఆందోళన, ఒత్తిడికి దారితీస్తున్న రోజువారీ అలవాట్లు.. బయటపడే మార్గాలివే..

ఆందోళన, ఒత్తిడికి దారితీస్తున్న రోజువారీ అలవాట్లు.. బయటపడే మార్గాలివే..
X

దిశ, ఫీచర్స్ : జర్నీలో ఆలస్యమైతే ఆందోళన.. కోరుకున్నది జరగకపోతే ఆందోళన.. అప్పు పుట్టడం లేదని ఆందోళన.. అప్పులెక్కువైనా ఆందోళన.. ఇలా ప్రతీ విషయానికి ఆందోళన చెందుతుంటారు కొందరు. నిజానికి ఇవన్నీ మనుషులందరూ ఎదుర్కొనే విషయాలే. కానీ కొన్ని అలవాట్లు, ఆహారాలు, పానీయాలు వాటి ప్రభావాన్ని మరింత పెంచుతాయని, మానసిక ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటి? ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.

*టీ, కాఫీ అధిక వినియోగం : కాఫీ మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ అతిగా తాగితే మాత్రం మానసిక ఆందోళనకు దారితీస్తుంది. ఎందుకంటే ఇందులో కెఫిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీలో అప్పటికే ఉన్న యాంగ్జైటీని మరింత ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆందోళన, భయం వంటివి పెరుగుతాయి. అందుకే కెఫిన్ వాడకాన్ని తగ్గించాలి. అంటే టీ, కాఫీలు మితంగా తాగాలంటున్నారు నిపుణులు.

*ముఖ్యమైన పనులు వాయిదా వేయడం : సాధారణ పనులైతే పర్లేదు కానీ, కొందరు ముఖ్యమైన పనులను సైతం తర్వాత చేద్దాం అనుకొని వాయిదా వేస్తుంటారు. కానీ సమయం దగ్గర పడేకొద్దీ పరిస్థితులు మారి ఆ పనికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతుంటాయి. అందుకే ముఖ్యమైన పనుల విషయంలో చూద్దాం.. లే అనుకోకుండా ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవడం మంచిదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

*సరైన నిద్రలేకపోవడం : ఆధునిక యువతలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. రాత్రిళ్లు ఎక్కువసేపు స్క్రీన్లకు అతక్కుపోవడం, ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వేదికల్లో నిమగ్నమైపోవడం వంటి కారణాలతో సరిగ్గా నిద్రపోరు. క్రమంగా ఇది నిద్రలేమికి దారితీస్తుంది. ఇది శరీరంలో జీవక్రియలను ప్రభావితం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను పెంచుతుంది. యాంగ్జైటీస్ నుంచి బయటపడాలంటే సమయానికి లేదా తగినంత నిద్రపోవడం మంచిది.

*సోషల్ మీడియా : అవగాహనకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అదే పనిగా రాత్రింబవళ్లు ఎక్కువ సమయం అందులోనే నిమగ్నమైపోతే మాత్రం స్ట్రెస్, యాంగ్జైటీస్ పెరుగుతాయి. ఇటీవల యువతలో ఈ ధోరణి పెరుగుతోంది. వర్క్‌ప్లేస్‌లలో, ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా కొన్ని వార్తలు, కామెంట్లు, సంఘటనలు కూడా ఆందోళన కలిగించేవిగా ఉండవచ్చు. కాబట్టి అలాంటి చాన్స్ ఉంటే సోషల్ మీడియాను లిమిటెడ్‌గా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

* నెగెటివ్ థాట్స్ : ప్రతీ విషయంలో నెగెటివ్, పాజిటివ్ అనే రెండు కోణాలు ఉంటాయి. కానీ కొందరు పాజిటివ్‌ను వదిలేసి, నెగెటివ్ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. కాబట్టి మీలో ప్రతికూల ఆలోచనలు మెదులుతుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాలంటున్నారు మానసిక నిపుణులు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దానివల్ల ప్రయోజనం ఏమిటి? అని మీకు మీరు ప్రశ్నించుకుంటే సమస్య నుంచి బయటపడతారు. అలాగే ప్రతికూల పరిస్థితులను, ఆలోచనలను ఎదుర్కోవాలంటే మీలో విషయ పరిజ్ఞానం, అవగాన, సామాజిక స్పృహ కూడా అవసరం అంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story