స్త్రీ పురుష సమానత్వం.. సాధ్యమేనా?

by Disha Web Desk 6 |
స్త్రీ పురుష సమానత్వం.. సాధ్యమేనా?
X

దిశ, ఫీచర్స్ : లింగ సమానత్వ సాధనలో మార్పు కనిపిస్తున్నా ఇప్పటికీ అనేక విషయాల్లో మహిళలపై చులకన భావం ఉందన్నది నిజం. పెరుగుతున్న అఘాయిత్యాలు, కొనసాగుతున్న వివక్షే ఇందుకు బలం చేకూరుస్తుండగా.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో 'జెండర్ ఈక్వాలిటీ' సాధించేందుకు మరెంతో కాలం వేచి చూడాల్సిన అవసరముందని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఏదేమైనా ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 11 మంది పురుషులను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నందుకు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ సనా మారిన్‌‌‌పై డ్రగ్స్ కేస్ నమోదు చేయడం ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. ఆధునిక ప్రపంచంలో స్త్రీ పురుష సమానత్వాన్ని కాలరాసిన ఆ సంఘటనలపై స్పెషల్ స్టోరీ!

లింగ సమానత్వం మానవ హక్కు. మహిళలు తమ భయాన్ని వీడి గౌరవంగా, స్వేచ్ఛగా జీవించేందుకు అర్హులు. లింగ సమానత్వాన్ని పెంచి, పేదరికాన్ని తగ్గించేందుకు సాధికారత పొందిన మహిళలు దోహదపడటమే కాకుండా తదుపరి తరానికి అవకాశాలను మెరుగుపరుస్తారన్నది జగమెరిగిన సత్యం. అయితే పలు రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహిళలకు సైతం సమానత్వం దక్కనప్పుడు 'జెండర్ ఈక్వాలిటీ'పై నీలినీడలు కమ్ముకోవడం సహజం. ఇలాంటి ఘటనలే మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందనే విషయాన్ని గుర్తుచేస్తుంటాయి.

బిల్కిస్ బానో కేస్ :

2002 గోద్రా అల్లర్ల సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మంది నిందితులకు 2008 జనవరిలో ముంబై సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ముంబై హైకోర్టు శిక్షను సమర్థించింది. కానీ ఈ నెల 15న గుజరాత్ ప్రభుత్వం ఆ దోషులందరినీ విడుదల చేయగా, వారికి పూలమాలలతో స్వాగతం పలికి స్వీట్లు తినిపించారు. దేశంలో మహిళా భద్రత, హక్కులపై ప్రశ్నలను లేవనెత్తిన ఈ ఘటనను ఎంతోమంది సామాజిక వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. జీవిత ఖైదు విధించిన నేరస్థులను ఉన్నట్టుండి ఎలా విడుదల చేస్తారంటూ ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందించాయి. 'ఓ మహిళకు న్యాయం జరగాల్సిన తీరు ఇదేనా..? సర్వోన్నత న్యాయస్థానాలను ఎంతో గౌరవించాను. కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టారు' అంటూ బిల్కిస్ బానో ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంటిపేరు తొలగిస్తే.. ద్వేషమా?

డెంటిస్ట్ ధనశ్రీ వర్మ.. కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌గా రాణించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమెను 2020లో ఇండియన్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌ పెళ్లి చేసుకున్నాడు. వారిది రెండేళ్ల అన్యోన్య దాంపత్యం. రీసెంట్‌గా ఆమె సోషల్ మీడియా అకౌంట్‌లో తనపేరు చివరన గల భర్త ఇంటిపేరును తొలగిస్తే విడాకుల ఊహాగానాలు చెలరేగడమే కాక ఆమెపై ద్వేషపూరిత ప్రచారానికి దారితీసింది. నెటిజన్లు ఆమెను గోల్డ్ డిగ్గర్, చీటర్ అంటూ విమర్శించారు. అయితే ఆమె పేరు వెనకాల భర్త ఇంటిపేరు జోడించాలా? తీసివేయాలా? అన్నది పూర్తిగా ఆమె నిర్ణయం. అలాగే వారి సంబంధంలో చీలికకు ఇద్దరిలో ఎవరైనా కారణం కావచ్చు. కానీ సమాజం మాత్రం ప్రతిదానికీ మహిళలను నిందిస్తుండటమే బాధాకరం. ఇలా అయితే సంబంధ బాంధవ్యాల విషయంలో స్త్రీలకు సమానత్వం ఎప్పుడు దక్కుతుందని సామాజిక వాదులు ప్రశ్నిస్తున్నారు.

వివాదంలో ప్రధాని :

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ లేడీ సనా మారిన్‌ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతున్న వీడియో వల్ల వివాదంలో చిక్కుకుంది. సదరు వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ప్రధానిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. ఆ పార్టీలో సనా మారిన్ డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె పార్టీలో అంతలా చిందేశారని అనుమానం వ్యక్తం చేయడం సహా డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి. ఆ పార్టీలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్‌ సహా ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్‌, టీవీ యాంకర్లు కూడా ఉన్నారు. అయితే చాలా మంది మేల్ పొలిటిషియన్స్ సమస్యాత్మక ప్రవర్తనను పట్టించుకోకుండా కేవలం మారిన్‌ విషయంలో తీవ్రంగా స్పందించడమే ఇక్కడ అసమానతకు తావిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు ముగింపు ఎప్పుడు? నాయకత్వ స్థానాల్లో ఉన్న పురుషులు, మహిళలు ఒకే విధమైన పారామీటర్స్ ఆధారంగా ఎప్పుడు నిర్ణయించబడతారు?

లైంగిక వేధింపులపై కేరళ కోర్టు వ్యాఖ్య

లైంగిక వేధింపుల కేసులో రచయిత సివిక్ చంద్రన్(74) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా కేరళ కోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. యువతి చేసిన ఆరోపణలు నిరూపణకు తగిన ఆధారాలు లేవని, 74 ఏళ్ల వికలాంగుడైన సివిక్ యువతిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఛాతిని నొక్కాడంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది.. అంతేకాదు మహిళ డ్రెస్సింగ్ స్టైల్ లైంగిక వేధింపులను రెచ్చగొట్టే విధంగా ఉందని, సెక్షన్ 354A ప్రకారం యువతి ఫిర్యాదు నిలబడదని పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆడవారి డ్రెస్ షేమింగ్ ఎప్పుడు ఆగుతుంది? సమాజం పురుషులను జవాబుదారీగా ఉంచడం ఎప్పుడు ప్రారంభిస్తుంది? అన్నది ప్రశ్నార్థకమే అయింది.

పేరెంట్‌హుడ్‌పై సెరెనా వ్యాఖ్య

టెన్నిస్ ఐకాన్ సెరెనా విలియమ్స్ ఇటీవల తన కెరీర్, మాతృత్వం మధ్య ఆప్షన్ ఎంచుకోవడం ఎలా కష్టమైందో వెల్లడించింది. కెరియర్‌పై దృష్టిసారించేందుకు తన గర్భాన్ని ఆలస్యం చేశానని, ఒక మహిళా క్రీడాకారిణి తల్లయిన తర్వాత కెరియర్‌ను విడిచిపెట్టాలని లేదా విరామం తీసుకోవాలని ఆమె చెప్పింది. అయితే పురుష ఆటగాళ్లు మాత్రం పితృత్వాన్ని స్వీకరించిన తర్వాత కూడా చాలా కాలం ఆడుతున్నారని వ్యాఖ్యానించింది. పురుషులు, స్త్రీలకు పేరెంట్‌హుడ్‌ విషయంలో భిన్నమైన అర్థాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన చూపించింది. ఈ మేరకు పిల్లల పెంపకంలో అసమానత ఎప్పుడు మారుతుంది?

Also Read : కాన్పుల మధ్య అంతరం ఎంత ఉండాలి?

Next Story

Most Viewed