- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: దసరా పండుగంటే ఊరొళ్ల పండుగ. అంటే మట్టిని, ఎద్దును, ఎవుసాన్ని నమ్ముకొని బతికేవాళ్ల పండుగ. ఉన్నంతల మంచిగ చేసుకునే పండుగ. ఇప్పటి హడావిడి.. ఆర్భాటాలు లేని రోజులల్ల దసరా వచ్చిందంటే ఇంటి గుమ్మం ఆనందపు తోరణాలతోటి మెరిసిపోతుండె. ఇంటిల్లిపాది మురిసిపోతుండె.
అక్కను తీసుకొచ్చే బాధ్యత..
మేం పెద్ద మోతుబరి రైతులం కాకపోయినా.. మట్టిని నమ్ముకొని బతికేటొళ్లం. వానమీద పండే పంటలే అయినా ఇరాటం లేకుండా పని ఉండేది. ఎంత బిజీ అంటే పండుగపూట కూడా ఏదో ఒక పని పెట్టుకునేది మావొళ్లు. బతుకమ్మకు వారం రోజులు ఉందనంగనే "అరే అక్కను తోల్కరాపో" అని పంపించేది మా అమ్మ. అప్పుడెట్లా దసరా సెలవులే ఉండేవి కాబట్టీ నేను గానీ, మా తమ్ముడుగానీ మా ఇద్దరు అక్కలను పండుగకు తోల్కొస్తందుకు పోతుంటిమి. మా తమ్ముడెప్పుడొస్తడో అని అత్తగారింట్ల అన్నీ సర్దిపెట్టుకొని తయ్యారుగా ఉండేది మా అక్కలు. ఇప్పటిలెక్క బైకులెక్కడివి? కార్లెక్కడివి.? ఏడికిపోవాలన్నా ఆర్టీసీ బస్సే దిక్కు. ఒకొక్కసారి గంటల తరబడి వెయిట్ చేసేది. పొద్దున ఇంట్లకెల్లి బయల్దేరితే మా చిన్నక్కొళ్ల ఊరు మామిడిపల్లి పొయ్యేసరికి పొద్దుమూకేది. ఇప్పుడైతే 40 నిమిషాలల్ల పోవచ్చు. మా పెద్దక్కొళ్లది మంచాల. ఇప్పుడు 20 నిమిషాల తొవ్వ.
మురుకుల మురిపెం..
పుట్టింటికొచ్చిన అక్కలు పుర్సత్‌గా ముచ్చట్లు పెట్టుకుంట ఉండేది. అత్తగారింటి అనుభవాలు గంటలకొద్దీ చెప్తుండె. ఇగ పండగకు ఐదారు రోజులు టైం ఉందనంగనే గిర్నీ కాడ పిండి పట్టించుకొచ్చేది. ఆ పిండితో రోజూ ఒక రకం పిండి వంటలు చేద్దురు. ఒకరోజు మురుకులు, ఒక రోజు గారెలు, ఇంకో రోజు పూరీలు చేసెటొళ్లు. ఇక పండుగ రేపు అనంగైతే మిర్చీలు, బుబ్బుడాలు చేస్తుండె. అదేందోగానీ ఇప్పుడు ఒక మురుకు తింటేనే గ్యాస్ పడుతది. కానీ అప్పుడు రోజూ లాగు జేబులల్ల మురుకులు పోసుకుని పోయేది. దసరా నాడైతే పొద్దున ఐదారు గంటలకే లేసి ఆదిబట్లకు పొయ్యేది. అక్కడ కోళ్ల ఫారాలు ఉండేవి. మా ఇంట్ల మస్తు కోళ్లున్నా.. ఎందుకో పండుగనాడు ఫారం కోడి కోసేది. సైకిల్ మీద ఇద్దరం ముగ్గురం పొయ్యి రూ.20కు ఒక కోడిని తీసుకొచ్చేది. ఇప్పుడు ప్రతీ రోజు చికెన్, మటన్ వండుతుండ్రు. కానీ అప్పుడు కోడిని కొయ్యాలంటే ఆరోజు పండుగై ఉండాలె.
కొకాకోలా సీసాతో..
దసరా పండుగకు ముందురోజు పొద్దుమూకంగా మేం మావిళ్లళ్లకు పోయేది. పెద్ద పెద్ద గోనె సంచులు తీసుకొని మామిడాకులు తెంపుతుంటిమి. దర్వాజలకు పెడ్తందుకు నాలుగు రెమ్మలైతే సరిపోతయి పెద్ద పెద్ద సంచులు ఎందుకూ అనే డౌటొచ్చింది కదా.? పట్నంల మామిడాకులు దొరకవు కదా.? అందుకే మదన్నపేట మండీల మా అసొంటి పోరగాళ్లు మామిడాకులు అమ్మేది. రెండు సంచులు తీసుకపోతే పండుగ ఖర్సుకు పైసలొచ్చేవి. మేం మరీ చిన్నగున్నప్పుడైతే సావుకారి దగ్గర పండుగ సమాను తెస్తుండె మా అమ్మ. ఆముదం కాయ పంట చేతికొచ్చినంక ఆముదాలు ఇచ్చి ఆ పద్దు క్లియర్ చేస్తుండె. ఇక ఇప్పటిలెక్క అప్పుడు పెద్ద ఖర్సు అయ్యేది కాదు. మా అసొంటి పోరగాళ్లకు ఒక చిన్న కొకకోలా సీసా ఇప్పించేది. పెద్దొళ్లు సార పాకిట్లు తెచ్చుకొనేది. ఇదే పేదొళ్ల పండుగ. అంచుకు కోడికూర ముక్కలు, పూరీలు పెట్టుకొని దసరా పండుగను జరుపుకునేది.
కొత్త బట్టలేసుకొని...
ఇక పండుగలో ముఖ్యమైనది కొత్త బట్టలు. దసరాకు నెల రోజుల ముందుగాల్నే బట్టలమ్మేటొళ్లు ఊర్లపొంటి. ఎంత తొందరగా తీసుకుంటే టైలర్ అంత తొందరగా కుడుతాడు అని ఆత్రమాత్రం పెట్టేది. మేం ఎంత మొత్తుకున్నా మా అమ్మనైతే మా ఊరు శాలొల్ల దగ్గర్నే మా ఇద్దరు అన్నదమ్ముండ్లకు సేమ్ కలర్ అంగిబట్ట, సేమ్ కలర్ పయింట్ బట్ట తీసుకుని వాళ్ల దగ్గర్నే కుట్టించేది. ఇప్పుడు బుద్ధిపుట్టినప్పుడల్లా బట్టల షోరూంకు వొయ్యి ఇష్టమొచ్చిన రెడీమేడ్ బట్టలు కొంటున్నం. కానీ అప్పుడు కొత్త బట్టలు తొడగాల్నంటే కచ్చితంగా దసరా పండుగ వచ్చి తీరాలన్నమాట. మేం కొంచెం పెద్దగైనంక మామిడాకులు అమ్ముకొని లేదా ఆరోజు మండికి మేమే పొయ్యి టమాటాలు అమ్మితే వచ్చిన పైసలతో సైదాబాద్ కుమార్ షాపులో డ్రెస్ తెచ్చుకునేది. పండుగ నాడు వేసుకున్న డ్రెస్‌ను మల్లా పండగొస్తెనే తొడుక్కునేది. అప్పటిదాక సందూకల దాచిపెట్టేది మా అమ్మ.
సినిమా చూసేది ఆరోజే..
దసరా పండుగ దగ్గర పడుతుంది అంటే ఏదో తెలియని మురిపెం ఉండేది. ఎందుకంటే పండుగ తెల్లారి థియేటర్ల సినిమా చూడొచ్చన్నమాట. ఇప్పుడు ఓటీటీలు, టీవీలు అన్నీ ఉన్నాయి. అప్పుడు సినిమా చూడాల్నంటే దసరా దాక ఎదురుచూసేది. అదికూడ రిలీజై సిటీలో నడుస్తున్న సినిమా ఇబ్రహీంపట్నం టాకీస్లకు రావాల్నంటే చానా రోజులు పట్టేది. ఒక్క దసరా రోజు మాత్రమే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏ సినిమా ఆడేది ఆ సినిమా వేస్తుండె. మా అక్కలు వాళ్ల దోస్తులతో కలిసి సినిమాకు పోతుంటే పోరగాళ్లం కూడా వాళ్లెంట రూపాయిన్నర తీసుకొని సినిమాకు పోయేది. అక్కొళ్లకు మల్లా టైం దొర్కపోయేది కాబట్టీ దసరా నాడు సినిమా చూసి, కొత్త గాజులు కొనుక్కొని, ఫొటో స్టూడియోలో గ్రూప్ ఫొటో తీసుకునేటొళ్లు. అక్కలు, తమ్ముండ్లు, అన్నలు, చెల్లెండ్లు అందరం కలిసి ఫొటోలు తీసుకొని మురిసిపోతుంటిమి. అవికూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు. అందుకే దసరా పండుగను అందరమూ ఎంజాయ్ చేసేది.
ఇంటింటికీ అలయ్ బలయ్..
ఇప్పటొళ్లకు చేతిలో ఫోన్లుంటే చాలు. ఎవరితో సంబంధం లేనట్టు ఉంటుండ్రు. పెద్దొళ్లకు మర్యాదిచ్చుడైతే వాళ్ల డిక్షనరీలనే లేదు. కానీ మేం అప్పట్ల దసరా పండుగనాడు పెద్దలకు కాళ్లు మొక్కెటందుకు పొయ్యేది. మా పెద్దనాయ్నలు, పెద్దమ్మల కాళ్లు మొక్కేది పండుగనాడు. కాళ్లు మొక్కినంక చేతిలో జమ్మాకు పెట్టేది. అప్పుడు మాకు వాళ్లు ఐదో పదో చేతిల పెట్టేది. దోస్తుగాళ్ల ఇంటికి పొయ్యి అలయ్ బలయ్ తీసుకునేది. జమ్మికి పొయ్యొచ్చినంక మా పంతులు కాళ్లు మొక్కి దీవెనార్తులు తీసుకుందుము. ఇక వాళ్లతో ఎలాంటి పరిచయం లేకున్నా.. మా వాడకట్టు కాకపోయినా ఊరంతా తిరిగి అందరికీ అలయ్ బలయ్ ఇస్తుంటిమి. తిరిగీ తిరిగీ ఇంటికొచ్చి మా అమ్మానాయిన కాళ్లు మొక్కేది. "సల్లగ బతుకుండ్రి బిడ్డా" అని వాళ్లు దీవెనార్తులు ఇస్తుండె. ఇగో ఇట్లుంటుండె దసరా పండుగంటే.. ఇప్పుడు మనుషులు మారిపోయిండ్రు. పండుగ తీరూ మారిపోయింది. ఇదంతా ఒక కలగా.. మా అసొంటొళ్లకు ఒక స్వీట్ మెమొరీగా మిగిలిపోయింది.
- డి. బాలమల్లేష్, పోచారం, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా






