- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలించిన వైద్యురాలి పోరాటం.. నకిలీ ఓఆర్ఎస్ విక్రయాలు ఇక నిషేధం..!
బ్రాండ్ పేర్లతో పాటు ఓఆర్ఎస్ పదాన్ని వినియోగిస్తున్న పలు నకిలీ ఉత్పత్తులపై డా.శివరంజని చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఓఆర్‌ఎస్’ బ్రాండ్ల పేరిట.. శక్తినిచ్చేదిగా, డీహైడ్రేషన్‌ను నివారించే పానీయంగా తప్పుడు ప్రచారం చేస్తూ కొంతకాలంగా ప్రముఖ కంపెనీలు విక్రయిస్తున్న నకిలీ ఓఆర్ఎస్ (షుగర్ డ్రింక్)పై ఒంటరిగా పోరాటం చేసిన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డా. శివరంజని సంతోష్ సాధించిన విజయం మామూలుది కాదు. 8 ఏళ్లుగా ఆమె బడా బడా కంపెనీలపై పోరాటం చేశారు. ఎవరి సహకారం లేకుండానే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడారు. ఎట్టకేలకు జనహితం కోసం ఆమె చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కింది. హానికారక ద్రావణాలను ఆకర్షణీయ టెట్రా ప్యాకెట్లలో నింపి.. మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న కంపెనీలు ఇకపై అలాంటివి తయారు చేయకూడదంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలిచ్చింది. ఈ నెల 14న ఇచ్చిన ఆదేశాలు తన జీవితంలో మర్చిపోలేనివని డా.శివరంజని ఎంతో భావోద్వేగంతో తెలిపారు.
హానికరమైన డ్రింక్స్..
ఆకర్షణీయమైన పాకెట్లలో ప్రముఖ కంపెనీలు తయారు చేసి విక్రయించే ఈ సాచెట్లను అసలైన ఓఆర్ఎస్ అని భ్రమ పడి రోగులు కొనుక్కుని తాగి మరింతగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని... బ్రాండ్ పేర్లతో పాటు ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) పదాన్ని వినియోగిస్తున్న పలు నకిలీ ఉత్పత్తులపై తాను ఇన్నాళ్ల పాటు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందని డా.శివరంజని ఎంతో భావోద్వేగంతో తెలిపారు. నకిలీ ఓఆర్ఎస్ సాచెట్లు, లిక్విడ్లపై ఫుడ్ కంట్రోల్ అధికారులకు ఆమె చేసిన ఫిర్యాదుల పరంపర నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఎస్ పదాన్ని బ్రాండ్ పేర్లతో కలిపి ఉపయోగించడం గురించి గతంలో జారీ చేసిన ఆదేశాలన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రెగ్యులేటరీ కంప్లైన్స్ డివిజన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఏ కంపెనీ అయినా డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసిన ఫార్ములా ప్రకారమే ఓఆర్ఎస్ తయారు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా తమ ఇష్టానుసారంగా ఎవరూ తమ ఉత్పత్తుల లేబుల్‌పై ఓఆర్ఎస్ అనే పదం ఉపయోగించలేరని ఆమె తెలిపారు. బుధవారం నుంచి నుంచే ఎవరికీ సొంత ఫార్ములాతో ఓఆర్ఎస్ ఉత్పత్తులను విక్రయించే హక్కు లేదని వివరించారు. ఇది ప్రజలందరి విజయంగా డా. శివరంజని వర్ణించారు.
ఎట్టకేలకు దిగివచ్చి..
ఈ నకిలీ ఓఆర్ఎస్ పై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డా. శివరంజని సంతోష్ గత కొంత కాలంగా పోరాటం చేస్తోంది. సదరు కంపెనీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆరోగ్య సంస్థలకు అనేక ఫిర్యాదులు చేసింది. ఓఆర్‌ఎస్ పేరిట జరుగుతున్న మోసపూరిత అమ్మకాలపై 2021లోనే సీడీఎస్‌ఓకు లేఖ రాశారు. వారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయమన్నారు. వాళ్లకు ఫిర్యాదు చేస్తే ఆధారాలు కావాలన్నారు. ఆధారాలు సమర్పించిన తర్వాత ఓఆర్‌ఎస్ అనేది మిస్‌లీడింగ్ లేబుల్స్‌తో ఎక్కడా వాడకూడదని ఉత్తర్వులు జారీ చేస్తున్నామని చెప్పారు. కానీ అదే ఏడాది జులైలో ఉత్తర్వులను మార్చారు. ఓఆర్‌ఎస్ అని అమ్ముకోండి. కానీ, ఇది ఓఆర్‌ఎస్ కాదని కూడా లేబిల్ పై ముద్రించండని సడలింపుతో ఉత్తర్వులిచ్చారు. దీంతో టెట్రా ప్యాకెట్లపై అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాలతో ‘ఓఆర్‌ఎస్’ అని, చిన్న అక్షరాల్లో ‘డయేరియా సమయంలో దీన్ని వాడొద్దు’ అని, ‘ఇది ఓఆర్‌ఎస్ కాదని ముద్రిస్తూ విక్రయాలు పెంచుకున్నారు. అంత చిన్న అక్షరాలను ఎక్కువ మంది చదవలేరు, అంతగా దృష్టి పెట్టే పరిస్థితి కూడా ఉండదు. దీనిపై తెలంగాణ హైకోర్టులో ఆమె పిల్ వేశారు. అఖిల భారత ఎండోక్రైన్ సొసైటీ కూడా ఈ పిల్‌కు జతకలిసింది. డబ్ల్యూహెచ్ఓ రూపొందించిన ఫార్ములా ప్రకారం తయారు చేసిన ఓఆర్‌ఎస్ పాకెట్లనే వినియోగించాలని ఆమె పోరాటం కొనసాగించారు. సోషల్ మీడియా వేదికగా వైద్యులు, ప్రజలను చైతన్యం చేశారు. డా.శివరంజని సంతోష్ పోరాటానికి చివరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ దిగివచ్చి.. స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మన హైదరాబాద్ కు చెందిన వైద్యురాలు ప్రజల తరఫున ఇన్నాళ్లు పెద్దపెద్ద కంపెనీలపై పోరాటం చేసి చివరకు విజయం సాధించిందని పలువురు వైద్యులు ఆమెను అభినందించారు.






