- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో 58 ఏళ్ల డాలీ రాణా తన సాధారణ జీవితంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. చీర కట్టుకుని, బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి, "ధర్మతల, ధర్మతల" అని అరుస్తూ ప్రయాణికులకు టికెట్లు ఇస్తుంది. ఈ వయసులో ఈ వృత్తిలో ఆమె ఒక మహిళగా నిలబడటం సాధారణ విషయం కాదు. కలను సాకారం చేయడానికి అడ్డంకులను అధిగమించి సమాజంలో మార్పును తీసుకొస్తోంది.
నాన్న ఆశయం కోసం..
డాలీ రాణా జీవితం ఒక సాధారణ కుటుంబంలో ప్రారంభమైంది. వాళ్ల నాన్నకు చిన్న కల ఉండేది. ఎప్పుడైనా ఒక బస్సును సొంతం చేసుకోవాలనీ. ఈ కల గొప్పదేం కాదు. కానీ గౌరవం, కష్టపడి పనిచేయడం అనే విలువలపై ఆధారపడినది. నాన్న మరణం తర్వాత ఆ కలను సాకారం చేసే బాధ్యత డాలీ తీసుకుంది. లోన్ తీసుకొని ఒక బస్సును కొనుగోలు చేసింది. కానీ ఆ బస్సు ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వలేదు. బదులుగా కుటుంబాన్ని అప్పుల పాలు చేసింది. అయినప్పటికీ డాలీ వెనక్కి తగ్గలేదు. బస్సును అమ్మడం లేదా నిరాశతో కుంగిపోవడం కాకుండా తన బస్సుకు కండక్టర్‌గా పనిచేయాలని నిర్ణయించుకుంది.
బస్సు పాత పడింది..
కల సాకారం చేసుకునేందుకు డాలీ రాణా ఎదుర్కొన్న సవాళ్లు మామూలివి కాదు. గవర్నమెంట్ కండక్టర్లుగా ఉన్నప్పటికీ ప్రైవేటు పరంగా ఈ వృత్తిలో మహిళలు చాలా అరుదు. చాలామంది ఆశ్చర్యంగా, అనుమానంగా చూశారు. ఇవేవీ పట్టించుకోకుండా డాలీ పనిపై దృష్టి పెట్టింది. కాలం గడిచేకొద్దీ బస్సు పాతబడింది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. మరమ్మతులు తరచూ అవసరమయ్యాయి. ఈఎంఐలు, ఇంధన ధరలు తన ఆర్థిక స్థితిని మరింత కష్టతరం చేశాయి. ఎలక్ట్రిక్ రిక్షాలు హౌరా వీధుల్లో వేగంగా.. చౌకగా ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో బస్సుల్లో ఎక్కే వారి సంఖ్య తగ్గిపోయింది.
కొత్త పర్మిట్ రూట్..
ఆమె కథ ఒక వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనకు కావాల్సింది ఒక కొత్త రూట్ పర్మిట్ మాత్రమే అనే సందేశం అధికారులకు చేరింది. చలించిన అధికారులు డాలీకి స్వయంగా ఫోన్ చేసి తన అభ్యర్థన ఆమోదించబడిందని చెప్పారు. ఈ ఫోన్ కాల్ ఆమె కష్టానికి, ధైర్యానికి, పట్టుదలకు గుర్తింపుగా భావించింది. కొత్త రూట్ పర్మిట్‌తో ఎలక్ట్రిక్ రిక్షాలతో పోటీ లేని ఒక రూట్‌లో ఆమె బస్సును నడపడం ప్రారంభించింది. ఇది ఆమెకు స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని ఇచ్చింది.
మొక్కవోని దీక్షతో..
డాలీ తనను తాను ఒక సామాజిక సంస్కర్తగా భావించదు. కానీ ఆమె రోజూ బస్సులో అడుగుపెట్టినప్పుడు సమాజంలో ఒక మహిళ స్థానాన్ని పునర్నిర్వచిస్తోంది. ఆమె గొప్పగా మాట్లాడదు. ఎవరితోనూ వాదించదు. కానీ పురుషుల ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో తన ఉనికి ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. కుటుంబాన్ని పోషిస్తూ, రుణాలను తీరుస్తూ మొక్కవోని దీక్షతో విజయపథాన దూసుకెళ్తోంది. బస్సు పాతదైనా ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎప్పటికీ పాతబడవు. ఉదయం ప్రతి రోజు బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి "ధర్మతల, ధర్మతల" అని కేకలు వేస్తుంటే డాలీ బస్సు వచ్చిందని గుమిగూడతారు జనాలు.






