- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదే పదే ఎక్కిళ్లు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చేక్ పెట్టండి!
ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసే ఎక్కిళ్ల (Hiccups)నుంచి తక్షణ ఉపశమనం లభించే వైద్యుల చిట్కాలు ఇవే.

దిశ, ఫీచర్స్: ఎక్కిళ్లు (Hiccups) ఉన్నట్టుండి మనల్ని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఆహారం తింటున్నప్పుడో లేదంటే మాట్లాడుతుండగానో సాధారణంగా మొదలై కొన్నిసార్లు విపరీతమైన ఛాతీ, కడుపునొప్పికి కారణమవుతాయి. ముఖ్యంగా పసిపిల్లలు తల్లి పాలు తాగిన తర్వాత తరచూ ఎక్కిళ్లతో ఇబ్బందిపడుతుంటారు. అయితే ఈ ఎక్కిళ్లు ఎందుకొస్తాయి? వీటినుంచి ఉపశమనం లభించాలంటే ఏం చేయాలి? కొన్ని పరిష్కార చిట్కాలను వైద్యులు పలు రకాలుగా సూచించారు. అవి ఏంటో తెలుసుకుని ఎక్కిళ్ల బాధనుంచి బయటపడదాం!
‘గ్లోటిస్’ మూసుకుపోవడంతో..
ఉదరవితానం (Diaphragm) అకస్మాత్తుగా కుంచించుకుపోవడం వల్ల ఎక్కిళ్లు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు గొంతులో ఉండే ‘గ్లోటిస్’ అనే భాగం ఒక్కసారిగా మూసుకుపోయి ‘హిక్’ అనే శబ్ధం మొదలవుతుంది. కొన్నిసార్లు స్టమక్, చెస్ట్ కూడా కుదుపులకు గురవుతుంటాయి. అయితే ఎక్కిళ్లను తగ్గించేందుకు బాడీ మూమెంట్స్, శ్వాస ప్రక్రియకు సంబంధించిన కొన్ని ప్రత్యేక వ్యాయామాలు (Manuevers) బాగా పనిచేస్తాయి. ఇవి డయాఫ్రాగమ్ కండరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడతాయి.
ప్రధాన కారణాలు:
- ఆహారాన్ని వేగంగా, మోతాదుకు మించి తినడం.
- కడుపు నిండా గ్యాస్ నిండిపోవడం.
- వేడి వేడి పదార్థాలు లేదా కారంగా ఉన్నవి లాగించడం.
- కూల్ డ్రింక్స్ (కార్బోనేటెడ్ పానీయాలు) తాగడం.
- అకస్మాత్తుగా ఉద్వేగానికి లేదా ఒత్తిడికి లోనవ్వడం.
- కొన్నిసార్లు బలంగా అరిచినప్పుడు కూడా వస్తుంటాయి.
పరిష్కార చిట్కాలు..
- ఒక పేపర్ బ్యాగ్ తీసుకుని దానిలోని గాలి పీల్చి వదలాలి. దీనివల్ల రక్తంలో కార్బన్‌డయాక్సైడ్ స్థాయి పెరిగి ఎక్కిళ్లు తగ్గుతాయి.
- నోటిలో గాలి నింపి నీరులా మింగాలి.
- చల్లటి నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
- గాలిని కడుపునిండా లోపలికి పీల్చుకుని సాధ్యమైనంతసేపు బిగపట్టి నెమ్మదిగా బయటకు వదలాలి.
- ఒక స్పూన్ పంచదారను నాలుకపై వేసుకుని నెమ్మదిగా చప్పరించాలి.
- నిమ్మకాయ లేదా అల్లం ముక్కను నమలాలి. ఆ ఘాటుకు ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంది.
- నేలపై పడుకుని లేదా కుర్చీలో కూర్చుని మోకాళ్లను ఛాతీ వరకు లాక్కుని, కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి వదలాలి.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
- ఎక్కిళ్లు 48 గంటల కన్నా ఎక్కువ సమయం వస్తుంటే వెంటనే వైద్యులను కలవాలి.
- ఎక్కిళ్ల వల్ల నిద్ర, ఆహారం తినడంలో ఆటంకం కలుగుతుంటే.
- కడుపు నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.
- ఇతర ఆరోగ్య సమస్య అనింపించినా ఆలస్యం చేయొద్దు.
గమనిక: వ్యాయామాలు చేస్తున్నప్పుడు కళ్లు తిరగడం లేదా ఊపిరి ఆడకపోవడం వంటివి అనిపిస్తే వెంటనే ఆపేయాలి.






