ఆషాఢంలో అత్త మొఖం కోడలు ఎందుకు చూడదో తెలుసా.?

by Daayi Srishailam |   (  Updated:2025-07-16 15:28:16  IST  )

అందమైన జ్ఞాపకంగా నిలిచి.. కుటుంబ బంధాలను బలపరిచే అనుబంధంగా మారింది.

ఆషాఢంలో అత్త మొఖం కోడలు ఎందుకు చూడదో తెలుసా.?
X

దిశ, ఫీచర్స్: కొత్తగా పెళ్లయిన కోడళ్లు ఆషాఢంలో అత్తగారింట్లో ఉండదు. ఆషాఢం వస్తుందనగానే పుట్టింటికి పంపిస్తారు. ఈ సంప్రదాయం గ్రామీణ జీవనంలో ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచి.. కుటుంబ బంధాలను బలపరిచే అనుబంధంగా మారింది.

ఎప్పుడు వెళ్దామా అనీ..

ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదనేది ఎప్పట్నుంచో వస్తు్న్న ఆచారం. ఇప్పుడు తగ్గిందిగానీ, ఒకప్పుడు దీనిని కచ్చితంగా పాటించేవాళ్లు. అత్తగారింట్లో అంతా కొత్తగా అనిపించి, ఎప్పుడు పుట్టింటికి పోవాలా అని ఎదురుచూసేవాళ్లు ఉండేవాళ్లు. సంవత్సరం దాటినా కూడా కొందరు మెట్టినింటికి అలవాటు పడకపోతుండె. దాదాపు నెల రోజులు పుట్టింట్లో ఉండవల్సి వచ్చేది కాబట్టీ కొత్త కోడళ్లకు మంచి ఆటవిడుపుగా ఉండేది. తన కుటుంబంతో గడిపి అత్తింటి భయాన్ని పోగొట్టుకునేవాళ్లు.

అత్తగారింటికి సెలవు..

ఎనకటి రోజుల్లో వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. ఆషాఢంలో భార్యాభర్త కలిసి ఉంటే ఎండాకాలంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఎండాకాలంలో ప్రసవం వల్ల తల్లీబిడ్డలకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టొద్దని పెద్దల ఆలోచన అందుకే ఆషాఢంలో అత్తగారింటి నుంచి సెలవు తీసుకొని పుట్టింటికి పంపిస్తుండె. ఇంకో కారణమేంటంటే.. వానాకాలంలో వాతావరణ మార్పుల వల్ల రోగాలు, వ్యాధుల సమస్యలకు కూడా ఆస్కారమెక్కువ. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అత్త మొఖం చూడొద్దని చెప్పి తల్లిదండ్రుల వద్దకు పంపించేవాళ్లన్నమాట.

వ్యవసాయ పనుల వల్లే..

ఆషాఢంలో కొత్త కోడలు అత్త మొఖం చూడొద్దు అనడానికి బలమైన కారణం వేరే ఉందంటారు అమ్మమ్మలు, నాన్నమ్మలు. వానలు పుష్కలంగా పడి వ్యవసాయ పనులు ఊపందుకునేది ఈ మాసంలోనే. ఇంట్లో అందరూ తలా ఓ చేయి వేస్తేనే వ్యవసాయం సాగేది. సకాలంలో పనులు పూర్తిచేసుకునేది. మరి అలాంటప్పుడు కొత్త జంటలు కలిసుంటే ఇక వ్యవసాయ పనులెవ్వరు చేస్తరు.? కొత్త మురిపెం కాబట్టీ గంటసేపు భార్య మొకం చూడకుండా భర్త ఉండలేడు, భర్త మొఖం చూడకుండా భార్య ఉండలేదు. దీనివల్ల వ్యవసాయ పనుల్లో నిర్లక్ష్యం జరగొచ్చని అత్త మొఖం చూడొద్దనే కారణం చెప్పి పుట్టింటికి పంపేవాళ్లని అంటుంటారు.

ఒత్తిడి ఉండదనీ..

ఆషాఢ మాసంలో అత్తా-కోడలు ఎదురుపడితే అశుభం అనేవాళ్లు. కుటుంబ వివాదాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించేవాళ్లు. ఆ మాసమంతా కొత్త కోడలు పుట్టింటిలో గడపడం వల్ల మానసిక స్థైర్యం పొందొచ్చు. అత్తింటి ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పుడైతే అత్తాకోడళ్లు కలిసి ఉండే అవకాశం లేదు కాబట్టీ.. ఈ సంప్రదాయం పెద్దగా పాటిస్తలేరు. ఆధునిక జీవనశైలి వల్ల వేసవి ప్రసవాలపై భయం పోయింది. వ్యవసాయం యాంత్రీకరణ.. నగరీకరణ వల్ల కొత్త జంటలు కలిసి ఉంటే సమస్యలు వస్తాయనే అభిప్రాయం పూర్తిగా మారిపోయి ఆషాఢమొచ్చినా కొత్త కోడలు అత్త మొఖం చూస్తుంది.

Next Story