Pakistan colony: హైదరాబాద్‎లో పాకిస్తాన్ మూలాలు ఉన్నవారు ఎక్కువ మంది నివసించే కాలనీ ఎక్కడుందో తెలుసా ?

by Vennela |   (  Updated:2025-05-09 10:44:34  IST  )

Pakistan colony: దక్షిణ భారతదేశంలో ప్రముఖ నగరం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ పట్టణం బహుళ జాతులకు నివాస స్థలంగా ఉంది.

Pakistan colony: హైదరాబాద్‎లో పాకిస్తాన్ మూలాలు ఉన్నవారు ఎక్కువ మంది నివసించే కాలనీ ఎక్కడుందో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్: Pakistan colony: దక్షిణ భారతదేశంలో ప్రముఖ నగరం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ పట్టణం బహుళ జాతులకు నివాస స్థలంగా ఉంది. ప్రపంచంలోని అనేక జాతుల వారు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. హైదరాబాదులోని ఓ కాలనీలో పాకిస్తాన్ మూలాలు కలిగిన వారు పెద్ద మొత్తంలో నివసిస్తున్నారు అది ఎక్కడో తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు.

సికింద్రాబాద్ లోని సింధీ కాలనీ పాకిస్తానీ మూలాలు కలిగిన వారికి నివాస ప్రదేశంగా ఉంది. అవును మీరు వింటున్నది నిజమే. 1947లో దేశ విభజన జరిగిన అనంతరం పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతం నుంచి భారతదేశానికి తరలివచ్చిన కాందిశీకులకు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ బ్యాక్ వాటర్స్ సమీపంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో స్థిర నివాసం కల్పించుకునేందుకు, అప్పటి భారత ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది.

వీరిలో ఎక్కువగా సింధు ప్రాంతం నుంచి తరలివచ్చిన హిందువులే ఉన్నారు. వీరు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చారు. వీరు ఎక్కువగా నివసించే ప్రదేశాన్ని సింది కాలనీగా నామకరణం చేశారు. ఈ రోజుకు కూడా పాకిస్తాన్ మూలాలు కలిగిన హిందూ కుటుంబాలు సింధీ కాలనీలో ఎక్కువగా ఉంటాయి.

వీరంతా ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా సికింద్రాబాద్లోని జనరల్ బజార్ అదేవిధంగా పారడైస్ ప్రాంతాల్లో సింధీ ప్రాంతానికి చెందిన ప్రజలు వివిధ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వీరి పేరిట ఒక బ్యాంకు కూడా ఉంది. నేటికీ కూడా వీరు తమ సంస్కృతిని మర్చిపోకుండా సింధీ రుచులతో కూడిన రెస్టారెంట్లు హోటల్స్ ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

సింధీ కాలనీ తో పాటు, సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్, బోయిన్ పల్లి ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ మూలాలు కలిగిన కాందిషీకులు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటారు. అయితే దశాబ్దాలు గడిచిపోయిన ఈ నేపథ్యంలో వీరంతా ఇక్కడే కొన్ని తరాలుగా నివసముంటూ హైదరాబాద్ సంస్కృతిలో కలిసిపోయారు. కానీ నేటికీ కూడా వారు పాకిస్తాన్ నుంచి ఇక్కడకు తరలివచ్చిన సందర్భాన్ని తలుచుకొని బాధపడతారు.

దేశ విభజన తమకు గాయాన్ని మిగిల్చిందని, తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి దేశంలో వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురై తమ జాతి బతుకుతోందని సింధీ ప్రజలు నేటికీ బాధపడుతూ ఉండటం గమనించవచ్చు. అయితే తమను భారత్ అక్కున చేర్చుకుందని, మత చాందసవాద దేశంగా మారిన పాకిస్తాన్ ఈరోజు భారత్ చేతిలో తగిన మూల్యం చెల్లించుకుందని ఆ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు.

Next Story