Boss Baby Vaibhav Surya.. సాధారణ రైతు బిడ్డ స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడో తెలుసా.?

by Daayi Srishailam |

సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేశాడు లిటిల్ మాస్టర్ వైభవ్ సూర్యవంశీ..!!

Boss Baby Vaibhav Surya.. సాధారణ రైతు బిడ్డ స్టార్ క్రికెటర్ ఎలా అయ్యాడో తెలుసా.?
X

ఐపీఎల్.. ఐపీఎల్.. ఐపీఎల్..

ఎక్కడ చూసినా..

ఏ ఇంట్లో విన్నా ఇదే ముచ్చట.

అంతటి విశిష్టమైన బుడ్డ క్రికెట్‌లో..

ఇప్పుడొక బుడ్డోడు సెన్సేషన్ అయ్యాడు.

ఎనిమిదో తరగతి ఎక్కాలు చదివే వయసులో..

ఏక్‌దమ్ కిరాక్ బ్యాట్స్‌మన్‌గా..

చెవ్వల్ చెక్కల్ కొడుతూ హిస్టరీ క్రియేట్ చేశాడు లిటిల్ మాస్టర్ వైభవ్ సూర్యవంశీ..!!

- దిశ, ఫీచర్స్

వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌లో ఒక వెలుగు వెలుగుతున్న చిన్న వయసు క్రికెటర్. చాలా చిన్న వయసులోనే ప్రపంచ దృష్టిని.. క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించి.. అరుదైన ఘనత సాధించాడు. ఏమో చెప్పలేం.. భవిష్యత్‌లో భారత క్రికెట్ జట్టకు పెద్ద బలంగా మారే అవకాశమూ ఉండొచ్చు.

14 ఏళ్ల వయసు

"ఎవుర్రా నువ్వూ.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావూ.?" అని మీడియా.. సోషల్ మీడియా ఆశ్చర్యపోయి అబ్బురపడి చూస్తున్న క్రికెటర్ వైభవ్ సూర్య. అతడి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. మామూలుగా ఈ వయసు పిల్లలు ఏ ఎనిమిదో క్లాసు హోంవర్కో ముంగటేసుకొని " ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్" అని లెక్కల సూత్రాలు బట్టీ పట్టే పనిలో ఉంటారు. కానీ మనోడు మాత్రం "సిక్స్".. "ఫోర్" అంటూ బంతిని బౌండరీలు దాటించే పనిలో మునిగి స్టార్ క్రికెటర్ రేంజిలో ప్రశంసలు అందుకుంటున్నాడు. బౌలర్లను శతక్కొట్టి సెంచరీలు కొట్టే వయస్సు నాదీ అని రికార్డుల పంట పండిస్తున్నాడు.

అందరూ స్కూల్‌కి వెళ్తే..

వైభవ్‌ది బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తజ్‌పూర్ గ్రామం. తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ రైతు. రెండెకరాల పొలంలో సాంప్రదాయ పంటలు సాగుచేసేవాడు. ఎంతచేసినా ఇంటి అవసరాలకే సరిపోయేది. అయితే వైభవ్‌కేమో చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద అమితాసక్తి. అందరూ పలకా బలపం పట్టుకొని స్కూల్‌కి వెళ్లే సమయంలో వైభవ్ సూర్య చెక్క బ్యాట్ తీసుకొని గ్రౌండ్‌కి వెళ్లేవాడు. "ఇదేంట్రా అందరు పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే మావోడేమో క్రికెట్ క్రికెట్ అని అంటాడు" అని చాలాసార్లు అనిపించినా.. ఆఖరికి కొడుకు ఆసక్తిని అర్థం చేసుకొని లక్ష్యం దిశగా అడుగులేయించాడు.

భూమిని అమ్మేసి

స్కూల్‌కి వెళ్లాల్సిన పిలగాడు క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్తానంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది.? "నీ కిర్కెట్ కిన వారెతు.. ఏం పోరడవున్నవ్‌రా.. ఛల్ సప్పుడేక స్కూల్‌కివో" అంటరు ఎవరైనా. కానీ వైభవ్ వాళ్ల నాన్న సంజీవ్ అట్లా ఎప్పుడూ అనుకోలేదు. "పేదోడైతే ఏంది.. నా కొడుకు క్రికెటర్ ఎందుకు కావద్దూ" అని సంకల్పించాడు. ఇంటెనకాల గ్రౌండ్ ఏర్పాటుచేసిచ్చాడు. "ఇలా ఇంటెనకాల ఎన్ని రోజులు ఆడతాడు.. మెరుగైన శిక్షణ ఇప్పించాలి" అని తనకున్న రెండెకరాల పొలాన్ని కొడుకు క్రీడా భవిష్యత్ కోసం అమ్మేసాడు. వైభవ్‌ను తీసుకొని ముంబై పయనమయ్యాడు.

ఫాస్టెస్ట్ సెంచరీ

ముంబైలో వైభవ్ కోచింగ్‌కి వెళ్లేవాడు. వాళ్ల నాన్ననేమో బాత్రూంలు క్లీన్ చేసే పనికి వెళ్లేవాడు. కొంతకాలం తర్వాత ఆ పని వదిలేసి బౌన్సర్‌గా మారాడు సంజీవ్. 9 ఏళ్ల వయసులో స్థానిక మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపెట్టాడు. 12 ఏళ్ల నాటికి సమస్తిపూర్ క్రికెట్ అకాడమీలో టాలెంట్ నిరూపించుకున్నాడు. అప్పుడే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. రంజీలో అత్యధిక స్కోర్ 41 మాత్రమే. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన అండర్- 19 అనధికార టెస్ట్ మ్యాచ్‌లో 58 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. ఆ టోర్నీలో మొత్తం 322 పరుగులు చేశాడు.

సానబెట్టిన ద్రవిడ్

ఆస్ట్రేలియాతో జరిగిన ట్రోఫీలో వైభవ్ రాహుల్ ద్రావిడ్ దృష్టిలో పడ్డాడు. "చూస్తే చిన్నపిల్లోడే కానీ సాన పెడితే గొప్ప ఆటగాడు అవుతాడు" అని ఎంకరేజ్ చేశాడు. వయసు చిన్నదే అయినా ట్రాక్ రికార్డు పెద్దగా ఉండటంతో ఐపీఎల్ వేలంలో హాట్ ప్లేయర్‌గా నిలిచాడు. హేమాహేమీ క్రికెటర్లను సైతం వేలంలో కొనుక్కోని జట్లు వైభవ్ సూర్య కోసం పోటీ పడ్డాయి. అలా ఢిల్లీ కాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. మాగ్గావాలె అంటే మాగ్గావాలె అని పోటీ పడి మరీ రేటును పెంచుకుంటూ వెళ్తే అందరూ ఆశ్చర్యపోయారు. అలా మొత్తానికి ₹1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను కొనేసింది.

మగాడ్రా బుజ్జీ..

టీమ్‌కైతే సెలక్ట్ అయ్యాడు కానీ.. ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అని అనుకున్నారు. కానీ అదృష్టం తన్నుకుంటూ వచ్చి ఈ బుడ్డోడిని బూరెల బుట్టలో పడేసింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని వైభవ్ తెలివిగా ఫస్ట్ మ్యాచ్.. ఫస్ట్ బాల్‌కే సిక్సర్ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ మీద విరుచుకుపడి 36 బంతుల్లో 11 సిక్స్‌లు.. 7 ఫోర్స్‌తో 101 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. వీడు మగాడ్రా బుజ్జీ అని ప్రశంసలు పొందుతున్నాడు.

Next Story