మిల్లెట్ క్వీన్.. అమ్మమ్మ చేతి ముద్దను గుర్తుచేస్తున్న యువతి.!

by Daayi Srishailam |

గత కాలపు "మిల్లెట్"ను పరిచయం చేసింది. ఫలితంగా ప్రజల జీవితాలే మారిపోయాయి

మిల్లెట్ క్వీన్.. అమ్మమ్మ చేతి ముద్దను గుర్తుచేస్తున్న యువతి.!
X

దిశ, ఫీచర్స్: మన పూర్వీకులు ఏం తినేవాళ్లు.? కొర్రలు.. సామలు.. అరికెలే కదా.? కానీ మనమేం తింటున్నాం.? అంతా చెత్త. మొత్తం మందుల కూడు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒకావిడ గత కాలపు "మిల్లెట్"ను పరిచయం చేసింది. ఫలితంగా ప్రజల జీవితాలే మారిపోయాయి. ఆ మిల్లెట్ కథేంటో తెలుసుకుందాం.

అమ్మమ్మ ఆరాటం నుంచి..

చిన్నప్పుడు అమ్మమ్మ.. నాన్నమ్మ చేతిలో తిన్న ఆహారం రుచి గుర్తొస్తే గుండెలో ఏదో తడమాలనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో "అడ్లే మిల్లెట్" అలాంటిది. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు. తాత ముత్తాతల జ్ఞాపకం. వారి సంస్కృతి. 32 ఏళ్ల "దిముమ్ పెర్టిన్" వాళ్ల అమ్మమ్మ ఆరాటం నుంచి స్ఫూర్తి పొంది.. "అడ్లే చిరుధాన్యం"ను తిరిగి తీసుకొచ్చి గ్రామంలోని మహిళలకు కొత్త ఆశలు అందించింది. 2021లో దిముమ్ తన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంలో ఏదైనా చేయాలని సొంతూరికి వచ్చింది. వాళ్లమ్మమ్మ "అన్యత్" అనే మిల్లెట్ కోసం ఆరాటపడేది. అసలదేంటో తెలుసుకోవడం మొదలుపెట్టింది దిముమ్.

అడ్లేను తిరిగి పండించాలని

ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధానమైన "అడ్లే మిల్లెట్" కనుమరుగయ్యింది. మారిన జీవనశైలి వల్ల ప్రజలు వరి.. ఇతర వాణిజ్య పంటలపై ఆసక్తి చూపించం వల్ల అడ్లేకు గడ్డు పరిస్థితులొచ్చాయి. బియ్యం గురించి విపరీతమైన ప్రచారం.. వాణిజ్య పంటల ఆధిపత్యం.. సాగు కష్టాలు తోడై.. అడ్లే మిల్లెట్ కనుమరుగయ్యేలా చేశాయి. ఈ సవాళ్లను చూసిన దిముమ్.. అడ్లేను తిరిగి పండించాలని నిర్ణయించుకుంది. అడ్లే విత్తనాల కోసం గాలించడం మొదలుపెట్టింది. నదీ తీరాలు.. కొండ కోనల్లో తిరిగి రెండు నెలలకు విత్తనాలను పొందింది.

కష్టమైనా కదిలింది

విత్తనాలను సేకరించడం బానే జరిగిపోయింది గానీ.. దానిని పండించడం మాత్రం అంత తేలిక కాదు. అప్పుడెప్పుడో పండించారు రైతులు. వాళ్లెవరూ ఇప్పుడు వ్యవసాయం చేయడం లేదు. కనీసం విత్తన సాగు విధానాన్ని వివరించేంత ఉత్సాహంగానూ లేరు. మరిప్పుడు దిముమ్‌కు సాగు సలహాలిచ్చేదెవరు.? శ్రమకు తగిన ఫలితం ఉండదని అందరూ అంటున్నా ఆమె మాత్రం ముందుకు సాగింది. రకాన్ని తెలుసుకోవడం.. పద్ధతులను అధ్యయనం చేయడం.. అన్నీ క్రమంగా ఓ తపనతో జరిగాయి. పాత సాగు వంగడమైన అడ్లేను పండించేందుకు సిద్ధమైంది.

గెపో ఆలి

అడ్లేలాంటి అరుదైన, వెనకటి చిరుధాన్యాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో దిముమ్ "గెపో ఆలి" అనే సంస్థను ప్రారంభించింది. "గెపో" అంటే సాంత్వన.. "ఆలి" అంటే పుసుపు విత్తనం అని అర్థం. తన ఒక్కరితో ప్రారంభమైన సంస్థలో 80 మంది మహిళలు చేరారు. ఇప్పుడది ఒక విత్తన సమితిగా మారింది. ఆహారంతో పాటు భద్రత.. శ్రేయస్సు అందించానే దిమమ్ లక్ష్యాన్ని "గెపో ఆలి" ప్రతిబింబిస్తుంది. గెపో ఆలిని స్వయం సహాయక బృందాలతో అనుసంధానం చేసి దాని ద్వారా మహిళలు ఆదాయం సంపాదిస్తున్నారు.

దేశీయ క్వినోవా

అడ్లే మిల్లెట్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో షుగర్ ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఫైబర్ కూడా ఎక్కువే. క్వినోవాతో పోటీపడగల సామర్థ్యం ఉంది దీంట్లో. ఇది మన దేశపు ఉత్పత్తి. పోషక విలువల్లో కూడా మంచిదే కావడంతో చెఫ్‌లు ఇటాలియన్ రిసోటో.. మెక్సికన్ వంటకాల్లో దీనిని ప్రయోగిస్తున్నారు. 2023లో దిముమ్ "యూత్ కో ల్యాబ్ సమ్మిట్"లో భారతదేశ ప్రతినిధిగా బ్యాంకాక్ వెళ్లి అక్కడ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఆదాయ సంస్కరణల ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందిండమే లక్ష్యంగా కృషి చేస్తున్న దిముమ్ ను అందరూ మిల్లెట్ క్వీన్ అని పిలుస్తుంటారు.

Next Story