అప్పుడు వీడియోలు చూసేవాడు ..! ఇప్పుడు కోట్లల్లో టర్నోవర్..!!

by Javid Pasha |   (  Updated:2026-04-17 09:08:03  IST  )

యూట్యూబ్ వీడియోలు చూస్తూ నేర్చుకున్నాడు. ఆచరణలో పెడుతూ ఆదాయంగా మల్చుకున్నాడు.

అప్పుడు వీడియోలు చూసేవాడు ..! ఇప్పుడు కోట్లల్లో టర్నోవర్..!!
X

దిశ; ఫీచర్స్ : కొందరు తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని, ఆదాయంగా మల్చుకోవాలని ఆలోచిస్తుంటారు. మరికొందరు తమ ఆసక్తులనే అవకాశంగా మార్చుకొని జీవితంలో ఎదిగే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల కోవకు చెందిన వాడే రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కి చెందిన దిగ్విజయ్ సింగ్. అది కరోనా లాక్ డౌన్ సమయం. పదహారేండ్ల వయసులో ఉన్న దిగ్విజయ్‌కి ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో బోర్ కొట్టేది. దీంతో టైమ్‌పాస్ కోసం యూట్యూబ్ వీడియోలు చూసేవాడు. ఈ అలవాటే అతని జీవితాన్ని మరో రకంగా మలుపు తిప్పింది. యూట్యూబ్‌ ద్వారా నేర్చుకున్న ఒకానొక ఐడియా అతనికి ఆదాయ వనరుగా మారి లక్షల సంపాదన తెచ్చిపెడుతోంది. ఇంతకీ అతనేం చేశాడు?

చాక్లెట్లపై ఆసక్తితో..

ఒకప్పుడు సాదాసీదా యువకుడై దిగ్విజయ్ ఇప్పుడు లక్షాధికారి. వేలల్లో జీతం వచ్చే ఉద్యోగం లేకున్నా, లక్షల్లో పెట్టుబడి పెట్టే స్థోమత లేకపోయినా తన సొంత ఆలోచననే వ్యాపారంగా మల్చుకున్నాడు. లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంతకీ అతనేం చేశాడంటే.. కరోనా లాక్‌డౌన్ సమయంలో తరచుగా యూట్యూబ్ వీడియోలు చూస్తుండేవాడు. ఈ క్రమంలో చాక్లెట్ తయారీకి సంబంధించిన వీడియో అతన్ని బాగా ఆకర్షింది. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కాబట్టి అది చూసి, నేర్చుకుని, చాక్లెట్ తయారు చేసుకొని తినాలనేది అతని కోరిక. దానిని ఆచరణలో పెట్టాడు. ఇంట్లోనే చాక్లెట్లు తయారీలో ప్రయోగాలు చేస్తూ కుటంబ సభ్యులకు, స్నేహితులకు చాక్లెట్లు తయారు చేసి ఇవ్వడం మొదలు పెట్టాడు. క్రమంగా కొందరు అతని చాక్లెట్ల రుచిని చూసి, తమకు కూడా తయారు చేసి ఇవ్వాలని, డబ్బులు ఇస్తామని అడిగేవారు. ఇక్కడే దిగ్విజయ్‌కి సరికొత్త బిజినెస్ ఐడియా తట్టింది. ఏంటంటే.. ఈ చాక్లెట్ల తయారీనే వృత్తిగా, వ్యాపారంగా మార్చుకోవాలనుకున్నాడు.

స్థానిక రుచులను క్రియేట్ చేస్తూ..

స్థానిక పండ్లు, మసాలాలు (Like Jamun, Kokum, Ice Apple, Ber, Saffron) వంటివి ఉపయోగించి బీన్-టు-బార్ చాక్లెట్లు తయారు చేయడం ప్రారంభించాడు. అయితే బయట లభించే సాధారణ చాక్లెట్లకు భిన్నంగా స్థానిక భారతీయ రుచులను సృష్టించడంతో అతని చాక్లెట్లు అందరికీ నచ్చేవి. అయితే ఒక రోజు దీపావళి సమయంలో దిగ్విజయ్ తండ్రి కారు కొనుగోలు చేసినప్పుడు షోరూమ్ వారు గిఫ్ట్‌గా ఒక చాక్లెట్ బాక్స్‌ను ఇచ్చారు. దానిని చూసిన దిగ్విజయ్‌కు ఒక పెద్ద ఆలోచన వచ్చింది. ఏంటంటే.. కార్ షోరూములు కస్టమర్లకు చాక్లెట్లు గిఫ్ట్ చేస్తున్నాయని తెలుసుకుని, అలాంటి బల్క్ ఆర్డర్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

రూ. కోటి టర్నోవర్

ప్రయత్నంలో భాగంగా 2021లో దిగ్విజయ్‌కు ఒక కార్ షోరూమ్ నుంచి మొదటి బల్క్ ఆర్డర్ 1,000 చాక్లెట్లు తయారు చేసి ఇవ్వాలని వచ్చింది. ఆ ఆర్డర్‌తోనే అతను తన బ్రాండ్ ‘సరామ్ (Saraam)’ను అధికారికంగా ప్రారంభించాడు. ప్రస్తుతం సరామ్ ఒక ప్రీమియం బీన్-టు-బార్ చాక్లెట్ బ్రాండ్‌గా మారింది. ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, ఉదయపూర్ వంటి నగరాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రెండు టన్నులకు పైగా చాక్లెట్లు అమ్ముడై, రూ.1 కోటి టర్నోవర్‌తో ఒక విజయవంతమైన బ్రాండ్‌గా నిలిచింది. ఇప్పుడు దిగ్విజయ్ వయసు 22 ఏళ్లు. యూట్యూబ్ నుంచి మొదలైన అతని హాబీ, క్యూరియాసిటీ, స్థిరత్వంతో ఒక పెద్ద వ్యాపారంగా మారింది. అతని జీవితం కొత్త మలుపు తిరిగింది. ఒక చిన్న ఆలోచనను, ఖాళీ సమయాన్ని అవకాశంగా, వ్యాపారంగా మల్చుకుని ఎదిగిన ఆ యువకుడి లైఫ్ జర్నీ నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Next Story