- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
World sleeping day: నిద్రకు ఓ దినోత్సవం ఉందని మీకు తెలుసా? దీని ప్రత్యేకత ఏంటంటే?
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మరీ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం (Food) ఎంత అవసరమో.. నిద్ర (Sleep) కూడా అంతే ముఖ్యం. సరిగా నిద్రపోకపోతే చిరాకు, అలసట, విచారంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే డాక్టర్లు కూడా 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ తింటున్నారో, ఎప్పుడూ పడుకుంటున్నారో కూడా తెలియటం లేదు. దీంతో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈక్రమంలో నిద్ర ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి మూడో శుక్రవారం (మార్చి 14)న ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని (World Sleep Day) నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిద్రపై మీ కోసం ప్రత్యేక కథనం.
2008లో తొలిసారి..
ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని తొలిసారి 2008లో నిర్వహించారు. మనిషి నిద్రపోవటంపై ప్రజల్లో అవగాహనం కల్పించటం, నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సాయం చేయటమే లక్ష్యంగా వరల్డ్ స్లీప్ సొసైటీ (World Sleep Society) ప్రతి ఏటా మూడో శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది ఈ రోజున సరిగా నిద్రపోకపోవటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక థీమ్‌తో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది (2025) థీమ్ 'Sleep Well, Live Well (మంచిగా నిద్రపోండి.. ఆరోగ్యంగా ఉండండి)' అని వరల్డ్ స్లీప్ సొసైటీ ప్రకటించింది.
సరిగా నిద్రపోకపోతే వచ్చే సమస్యలు..
ప్రతి మనిషికి మంచి నిద్ర అవసరం. మంచి నిద్ర అంటే మధ్యలో లేవకుండా కనీసం 5 నుంచి 6 గంటల పాటు నిద్రపోవటం. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, నైట్ షిఫ్టుల్లో పనిచేయడం.. ఇలా రకరకాల కారణాల వల్ల చాలామందికి సరైనా నిద్ర ఉండటం లేదు. ఇది నిద్రలేమికి దారితీస్తోంది. ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. నిద్రలేమితో హైపర్‌టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని 150పైగా అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు, హార్మోన్లపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఒత్తిడి, కార్టిసాల్ లెవల్స్ పెంచే హార్మోన్స్ ఎక్కువగా విడుదల అవుతాయి. అలాగే నిద్ర సరిగా లేకపోవటం వల్ల మెదడు పనితీరు దెబ్బతిని జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఫలితంగా అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది.
ఏ వయసులో ఎంత నిద్ర అవసరం..
ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎర్లీ టు బెడ్ (Early to bed), ఎర్లీ టు రైజ్ (Early to Rise) అంటారు. ఇక ప్రతి రోజు 8 గంటల నిద్ర అవసరం అని డాక్టర్లు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం అంటే.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు దాదాపు 18 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. 4 నుంచి 11 నెలల శిశువులు 15 గంటలు నిద్ర అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకు 13 గంటల నిద్ర.. 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు 9-12 గంటల నిద్ర.. 13 నుంచి 18 సంవత్సరాల వారికి 8 గంటల నిద్ర అవసరం అంటున్నారు. ఇక 18 నుంచి 60 ఏళ్లు వయసు ఉన్నవారు రోజుకి కనీసం 7-9 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్ల పైబడిన వారైతే ఖచ్చితంగా 7-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర అంటే ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది రోగాల బారిన పడేందుకు ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ కారణం అని పలు అధ్యయనాల్లో తేలింది. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. 10 గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. జీవనశైలి, పరుగుల ప్రపంచంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారు. అలాగే, రాత్రివేళ పడుకున్న తర్వాత తరచూ అర్ధరాత్రిలో మెలకువ రావడం సంభవిస్తే ఖచ్చితంగా వైద్యనిపుణుడిని సంప్రదించాలి.
దేశంలో సగం మందికి సగం నిద్రే..
మన దేశ జనాభాలో దాదాపు 59 శాతం మంది రోజుకు కనీసం 6 గంటలు కూడా పడుకోవటం లేదని తాజా సర్వేలో వెల్లడైంది. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా 'లోకల్ సర్కిల్' అనే సంస్థ 'ఇండియా ఎలా నిద్రపోతున్నది-2025' పేరిట సర్వే నిర్వహించింది. ఇందులో మొత్తం 343 జిల్లాల్లోని 43 వేల మంది అభిప్రాయాలు సేకరించి నివేదిక విడుదల చేసింది. వీరిలో 61 శాతం మంది పురుషులు, 59 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇక నివేదిక ప్రకారం 39 శాతం మంది మాత్రమే 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోతున్నారని తేలింది. మరో 39 శాతం మంది 4 నుంచి 6 గంటలు నిద్రపోతున్నారు. ఇక కేవలం 2 శాతం మంది మాత్రమే కంటికి సరిపడా నిద్రపోతున్నారని పేర్కొంది. మొత్తంగా చూసుకుంటే 59 శాతం మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా 6 గంటలు కూడా నిద్రపోవడం లేదు.
మంచి నిద్రకు చిట్కాలు..
* మంచి నిద్రకు ముందుగా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రోజూ చక్కెర, కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఆహారం తినడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. మసాలాలు ఎక్కువగా ఉండే జంక్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. నిద్రపోయే ముందు ఈ పదార్థాలు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
* నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు నిద్రపోయే కొన్ని గంటల ముందు కాఫీ, టీ, చాక్లెట్లను తీసుకోకపోవటం మంచిది. అలాగే, ఆల్కహాల్ కూడా నిద్రలేమి సమస్యకు కారణం. కాబట్టి ఆల్మహాల్ తీసుకోవటం కూడా తగ్గించుకోండి.
* ఈ రోజుల్లో చాలా మంది పడుకునే వరకు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్ టాప్‌లు చూస్తూ ఉంటున్నారు. వీటిల్లో నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి నిద్రపోయే కొంత సమయం ముందు వీటి వినియోగాన్ని తగ్గిస్తే హాయిగా నిద్రపోవచ్చు.
*రాత్రివేళ నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి, విశ్రాంతి వ్యాయామాలు, యోగాసానాలు చేయడం అలవాటుగా చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.
* హాయిగా నిద్రపోవాలనుకునే వారు.. బెడ్ రూంలో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. మనుసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరమైన ఆలోచనలు తీసేసి వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
Read More..
Fear: " భయంకరమైన ఆలోచనలు " మిమ్మల్ని భయపెడుతున్నాయా .. అయితే, ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..!






