- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాట్ కొని మోసపోయారా? పత్రాలు ఉన్నా కూల్చేస్తున్నారా?
ప్లాట్ కొన్నారా? పత్రాలు సరిగ్గా లేవని బెదిరిస్తున్నారా? మోసపోయనట్లుగా అనిపిస్తే.. పొషిషన్, రిజిస్ట్రేషన్ వేర్వేరుగా ఉంటే.. అమ్మిన వారిపై కేసు పెట్టాలి.. న్యాయం కోసం కేసు వేయొచ్చు..

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక అతి పెద్ద సమస్య. చదవడానికి, చూడడానికి చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ అది అనుభవించిన వారికి ఆ బాధ తెలుస్తుంది. అన్ని పత్రాలు ఉన్నా, స్టాంప్ డ్యూటీ పెట్టి కొనుగోలు చేసినా.. ఈ స్థలం ప్రభుత్వానిదంటూ హైడ్రా కూల్చేస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ నిర్ధాక్షిణ్యంగా బుల్డోజర్లు పరుగులు పెట్టిస్తున్నాయి. బ్యాంకు లోన్లు తీసుకొని ఫ్లాట్లు కొన్నామని చెప్పినా.. అన్ని రకాల అనుమతులు తీసుకున్న పత్రాలు చూసి కొనుగోలు చేశామన్నా సరే.. మాట వినకుండా పునాదులు నేలకూలుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఒక చోట, పొషిషన్ మరో చోట ఉన్న సమస్యలు అధికంగా ఉన్నాయి. సామాన్యుడు వీటిని అధిగమించడం అంత ఈజీ కాదు. ఆఖరికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉంటున్నాయి. ఎల్ఆర్ఎస్ చేసిన ప్లాట్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో దర్శనమిస్తున్నాయి. క్షేత్ర స్థాయి సర్వేలో ప్రభుత్వ భూమిగా స్పష్టమవుతుంది. పైసాపైసా పెట్టి కొనుగోలు చేసిన సామాన్యుడు బలవుతున్నాడు. అందుకే ఈ సమస్య చాలా జటిలమైంది. పరిష్కారం, న్యాయం అంత ఈజీగా లభించే అవకాశాలు లేవు. కానీ ఎవరైతే తమకు ఆ ప్రాపర్టీని అమ్మేశారో వారిపైనే కేసు వేసి సొమ్మును రాబట్టుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. పొషిషన్ ఒక చోట, రిజిస్ట్రేషన్ మరో చోట.. అలాంటి స్థలం కొనుగోలు చేసి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు భూ సమస్యల్లో అత్యధికం ఇవే. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో నిపుణులు చెప్పే సూచనలు ఏంటి? పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? అందుకే మీ కోసం నిపుణుల సలహాలు.
10 ఏండ్ల క్రితం కొన్నా..
తాము పదేండ్ల క్రితం ప్లాట్ ని కొనుగోలు చేశాం. సేల్ డీడ్ ద్వారానే స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ ఫీజు వంటివి అన్నీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అన్ని డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్నాం. కానీ ఇప్పుడు హైడ్రా, రెవెన్యూ అధికారులు వచ్చి ఈ స్థలం ప్రభుత్వానిదని, వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇస్తున్నారు. తీరా సర్వే చేస్తే డాక్యుమెంట్ లో ఉన్న స్థలానికి, తాము ఉంటున్న స్థలానికి తేడా ఉందని అధికారులు తేల్చారు. ఇప్పుడు ఏం చేయాలి? చట్టపరంగా ఏం చేయాలి? ఇలాంటి సందేహాలు అనేక మందికి వస్తుంది.
మోసమే: ఇది డాక్యుమెంట్ల సమస్య కాదు. తప్పుదారి పట్టించి చేసిన స్పష్టమైన మోసం. అందుకే ఆందోళన చెందకుండా డబ్బు, స్థలాన్ని దక్కించుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను అన్వేషించాలి.
సర్వే: వెంటనే ఒక సర్వేయర్‌ను సంప్రదించి డాక్యుమెంట్‌లో ఉన్న సర్వే నంబర్ ప్రకారం ఆ అసలు స్థలం ఎక్కడుంది; ఎవరి ఆధీనంలో ఉంది? మ్యాప్ ద్వారా గుర్తించాలి. దానికి ఈసీ తీసి తనిఖీ చేయండి.
నోటీసు ఇస్తే: ప్రభుత్వం ఇచ్చిన నోటీసును నిర్లక్ష్యం చేయొద్దు. తాము మోసపోయామని, చట్టపరంగా తేల్చుకునేందుకు కొంత సమయం ఇవ్వమని తహశీల్దార్, ఆర్డీవోలకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి.
క్రిమినల్ కేసు: తప్పుడు స్థలం చూపించి డబ్బులు కాజేసినందుకు కేసు పెట్టాలి. అమ్మిన వ్యక్తి, ఏజెంట్లపై పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టండి. ఆధారాలను సమర్పించండి.
లీగల్ యాక్షన్: సివిల్ లాయర్ ద్వారా ఎవరైతే ప్రాపర్టీని అమ్మారో వారికి ఫస్ట్ లీగల్ నోటీసు పంపాలి. ఐనా స్పందించకపోతే సివిల్ కోర్టును ఆశ్రయించాలి. కట్టిన డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా కోరొచ్చు. లేదంటే డాక్యుమెంట్‌లో ఉన్న అసలు స్థలాన్ని అప్పగించేలా కేసు వేయొచ్చు.
డాక్యుమెంట్లనే నమ్మొద్దు: స్థలం, ఇతర ప్రాపర్టీలు కొనేటప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే చూస్తే సరిపోదు. సర్వేయర్ ద్వారా క్షేత్ర స్థాయిలో సర్వే చేయించుకున్న తర్వాతే డబ్బులు చెల్లించాలి.






