రోడ్డుమీదే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన కేరళ డాక్టర్లు

by Daayi Srishailam |

సలామ్.. డాక్టర్స్.!

రోడ్డుమీదే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన కేరళ డాక్టర్లు
X

దిశ, ఫీచర్స్: రోడ్డుమీద వెళ్తుంటాం. ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది. జనాలంతా గుమిగూడతారు. ఏమైంది ఏమైందని అందరూ వస్తారు. వచ్చి చూసి పోతుంటారు. కొందరు మాత్రమే ఆంబులెన్స్‌కు ఫోన్ చేయడమో.. పోలీసులకు సమాచారమివ్వడమో చేస్తుంటారు. ఇంకా చాలా తక్కువమంది ఏదైనా ఫస్ట్ ఎయిడ్ లాంటిది చేస్తుంటారు. అలాంటివారిలో కేరళకు చెందిన ముగ్గురు డాక్టర్లు ఉంటారు.


బైక్స్ ఢీకొని..

డిసెంబర్ 21.. 2025 రాత్రి 8:30 గంటల సమయం. కొచ్చి సమీపంలోని ఉదయంపేరూర్‌లో యాక్సిడెంట్ జరిగింది. బైక్ ఢీకొని కొల్లం నివాసి లిను తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం.. దవడ ఎముకలు పగిలి రక్తం గడ్డకట్టడంతో శ్వాస మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇంకో బైక్ మీద వెళ్లున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితీ ఆందోళన కరంగానే ఉంది. ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అంబులెన్స్ రావడానికి.. పోలీసులు చేరుకోవడానికి సమయం పట్టేలా ఉంది. గాయపడిన ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు.

ప్రయత్నం విఫలం..

యాక్సిడెంట్లో లిను శ్వాస మార్గం మూసుకుపోయింది. మిగతా ఇద్దరి తలలకు బలమైన గాయాలయ్యాయి. ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయాలి. కొచ్చి నుంచి కొట్టాయంకు వెళుతున్న డాక్టర్ మనూప్ మొదట అక్కడ ఆగిండు. అదే సమయంలో డాక్టర్ థామస్ దంపతులు కూడా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురూ కలిసి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ఆడ్వాన్స్‌డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఈ ముగ్గురు డాక్టర్లు మొదట జా థ్రస్ట్ పద్ధతి ప్రయత్నించారు. కానీ విఫలమైంది. అందుకే రేర్ అయిన క్రికోథైరాటమీ చేయాల్సి వచ్చింది. అంటే గొంతులో శస్త్రచికిత్స ద్వారా కొత్త శ్వాస మార్గం సృష్టించడం.

మెడికల్ కిట్ లేదు..

ఎవరి దగ్గరా మెడికల్ కిట్ లేదు. ఆంబులెన్స్ రావడానికి సమయం పడుతుంది. సమీపంలోని షాపు నుంచి కొత్త రేజర్ బ్లేడ్ తెచ్చారు. డ్రింకింగ్ స్ట్రా తీసుకొచ్చారు. ఫోన్ టార్చ్ లైట్లు పెట్టి లైటింగ్ పెట్టారు. డాక్టర్ థామస్ లిను మెడను స్టెబిలైజ్ చేసి హెల్మెట్ తీశాడు. డాక్టర్ మనూప్ గొంతులోని క్రికోథైరాయిడ్ మెంబ్రేన్‌పై కోసి స్ట్రా ఇన్‌సర్ట్ చేసి దాని ద్వారా నోటితో శ్వాస అందించారు. 20-30 నిమిషాల పోరాటంతో లినుకు పల్స్ వచ్చింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. మిగతా ఇద్దరికీ మంచి ట్రీట్మెంట్ చేశారు. ఇదంతా అంబులెన్స్ రాకముందే చేశారు.

శభాష్ డాక్టర్స్..

లినును 15 నిమిషాల్లో వైటిలాలోని వెల్‌కేర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ కార్డియాక్ అరెస్ట్ రాగా మళ్లీ రివైవ్ చేశారు. మొదట కోలుకుంటున్నట్లు కనిపించినా తీవ్ర అంతర్గత గాయాల వల్ల రెండ్రోజుల తర్వాత మరణించాడు. మిగతా ఇద్దరు క్షేమంగా కోలుకున్నారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన విషయం సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాళ్ల ధైర్యసాహసానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేరళ శాఖ.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రశంసలు కురిపించారు. "దైవానుగ్రహం".. "మానవత్వం" అంటూ జాతీయ అవార్డులు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. సలామ్ డాక్టర్స్ అని కొనియాడుతున్నారు.

Next Story