- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడినే కాదు.. ఒక తరాన్ని కాపాడుతున్న టీచర్.!
ఇప్పటికీ రోజూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి పాఠాలు చెప్తోంది

దిశ, ఫీచర్స్: నెలాఖరున జీతం వస్తే చాలు అనుకొని నామమాత్రం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అడుగడుగునా ఉంటారు. ఇందులో గవర్నమెంట్ టీచర్లకేం మినహాయింపు లేదు. అలాంటి వ్యవస్థలో ఉండి కూడా సామాజిక మార్పే లక్ష్యంగా పనిచేస్తోందొక టీచర్. ఇప్పటికీ రోజూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి పాఠాలు చెప్తోంది.
10 ఏళ్లుగా కాలి నడకన..
రాజస్థాన్‌లోని కటైల్‌పురా గ్రామం. తెల్లారగానే జనాలు వాళ్ల సొంత పనులు చేసుకోవడంలో బిజీ అవుతారు. కానీ.. 42 ఏళ్ల దర్శన చౌదరీ మాత్రం పొద్దున్నే స్కూల్‌కు పయనమవుతుంది. అదికూడా నడుచుకుంటూ. ఏదో ఒక కిలోమీటరో.. అర కిలో మీటరో కాదు. బసేడి నుంచి కటైల్ పురా వరకు నడుచుకుంటూనే వెళ్తుంది. ఈ రెండూర్ల మధ్య దూరం సుమారు 5 కిలోమీటర్లపైనే. ఇలా ఆమె ఇప్పుడు కొత్తగా చేయడం లేదు. గత 10 ఏళ్లుగా ఇలానే కాలి నడకన నడుస్తూ 1వ తరగతి నుంచి 8 తరగతి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ మంచి విలువలు బోధిస్తోంది.
17 మంది మాత్రమే..
దర్శన మేడం కటైల్ పురాలో డ్యూటీ ఎక్కిన మొదటిరోజే పొట్టుపొట్టు వాన కొట్టింది. రోడ్లన్నీ మట్టితో నిండిపోయినవి. మధ్య మధ్యలో రాళ్లు పెట్టుకుని అడుగులు వేసి మొత్తానికి స్కూల్‌కి వెళ్లింది. నిజంగా ఆ రోజు ఆమె జీవితాన్ని మార్చిన మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు. స్కూల్ సంగతేమోగానీ.. ఆ ఇరుకు రోడ్లు.. ఎర్రమట్టి బురద.. చిన్న భవనంలో ఉన్న స్కూలు.. తక్కువ సంఖ్యలో పిల్లలు తనను ఆలోచింపజేశాయి. తాను స్కూల్లో అడుగుపెట్టినప్పుడు మొత్తం విద్యార్థులు 17 మంది మాత్రమే. అదికూడా మధ్యాహ్న భోజనం కోసమే వచ్చి.. తినేసి వెళ్లిపోయేవాళ్లు.
ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు..
ఏదో ఒకటిచేసి విద్యార్థుల సంఖ్యను మార్చాలి అనుకొని గ్రామంలోని ఇంటిని కిరాయికి తీసుకొని ఉండేది దర్శన. పొద్దున స్కూలుకెళ్లేది. సాయంత్రం ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేది. చదువుతోనే సొసైటీలో విలువ ఉంటుందని చెప్పేది. ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు స్కూల్లోనే ఉండి పాఠాలు చెప్పేది. మొత్తం చదువే రానివాళ్లకు ఉదయం.. కొంచెం చదివడానికి వచ్చేవాళ్లకు మధ్యాహ్నం అని విభజించి చెప్పేది. మొత్తానికి అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేశాకే స్కూల్ నుంచి బయటు వెళ్లేది. మంచి పర్ఫామెన్స్ ఉంటే బహుమతులు వస్తాయని పిల్లల్ని స్కూలుకు అలవాటు చేసే ప్రయత్నాలు చాలా చేసింది.
అమ్మాయిల సంఖ్య 61..
గతేడాది స్కూలుకు నాలుగు నెలల పాటు విద్యుత్ లేదు. చెట్ల కింద కూర్చుని చదివారు. వర్షం వస్తే ఒక గదిలో గుంపుగా చేరేవాళ్లు. చీకటి పడితే మొబైల్ టార్చ్‌లతో చదువు చెప్పేది. ఫిర్యాదు కాకుండా చదువుపైనే ధ్యాసపెట్టింది దర్శన. ఇప్పుడు ఆ స్కూల్ విద్యార్థుల సంఖ్య 122 మంది. మొదట ఒకమ్మాయి కూడా లేకుండె. ఇప్పుడు అమ్మాయిల సంఖ్య 61. ప్రార్థన నుంచి కాంపిటీషన్ పోటీల వరకు అన్నీ అమ్మాయిలే ముందుండి నడిపిస్తున్నారు. ఇదంతా టీచర్ దర్శన తీసుకొచ్చిన మార్పే. అందుకే ఆమె లేకుండా కటైల్ పురా స్కూల్‌ను ఎవ్వరూ ఊహించలేరు. ఇలాంటివాళ్లు ఊరికొక్కరు చాలు సొసైటీ బాగుపడటానికి.






