- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్డయ్యి ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో స్నాక్స్ బిజినెస్ చేస్తున్న మన్సుఖ్ తాతా .!
ఇంతకూ ఈ తాత ఏం చేశాడో తెలుసా.?

దిశ, ఫీచర్స్: ఇప్పటి జనరేషన్ అంతా తాలు జనరేషన్. దేంట్లో నాణ్యత లేదు. సరుకులేదు.. సంగతిలేదు.. అంతా బబ్రజమానం బజగోవిందం అన్నట్లే ఉంటున్నరు. ఒకసారి బయటకెళ్లి చూడండి. రిటైర్డయ్యి ఇంట్లో కూర్చోవాల్సిన ముసలొళ్లు ఉరిమే ఉత్సాహంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. అలాంటివారిలో దాదా మన్సుఖ్ ఒకరు. ఇంతకూ ఈ తాత ఏం చేశాడో తెలుసా.?
వచ్చినొళ్లే లెక్క
ముంబైలోని బోరివలి. ఇదంతా రద్దీ ఏరియా. ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరితో ఇంకొకరు మాట్లాడుకునే తీరికా ఉండదు. ఇంతటి బిజీ మధ్య ఓసారి బోరివలి వెస్ట్‌లోని జైన్ దేవాయాలం పక్కన ఆగిచూస్తే తెలుస్తుంది. పొద్దు పొద్దున్నే మన్సుఖ్ తాత టేబుల్ రెడీ చేసుకొని స్నాక్స్ పేరుస్తుంటాడు. అన్నీ చిన్న చిన్న సామాన్లే. బిస్కెట్లు.. పిప్పరమెంట్లు.. సోంపులు.. చిప్స్.. డబల్ రొట్టెలు. పక్కన్నే పెద్ద పెద్ద షాపులుంటాయి. అక్కడన్నీ దొరుకుతాయి. అంత పెద్ద షాపును వదిలేసి నా దగ్గరికి ఎవరొస్తారు అనుకోలేదు మన్సుఖ్ తాత. "పొయెటోడు పోంగా.. వచ్చినోడే నావోడు" అని నడపిస్తున్నాడు.
ఎవరికీ చేయి చాచొద్దు
మన్సుఖ్ తాత వయసు 81. ఈ వయసులో ఎవరైనా ఇలా రోడ్డుమీద ఎర్రటెండలో నిలబడి దుకాణం నడిపిస్తరా చెప్పండీ.? కానీ ఇతను నడిపిస్తున్నాడు. రామాకృష్ణ అని శేష జీవితాన్ని గడపాల్సిన తాత ఇలా ఆత్మస్థైర్యంతో.. బాధ్యతతో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. "ఇదంతా ఎందుకే తాతా" అని ఎవరైనా అడిగితే "ఇంట్లో ఖాళీగా కూర్చొని తిండి తింటే అది నా ఒంటికి పట్టదు" అని సమాధానం ఇస్తాడు. "నేనెవరికీ భారం కావద్దు.. ఇంకొకరే నా దగ్గర చేయి చాచితే పావలో పరకో ఇచ్చే స్థితిలో ఉండాలి" అని అంటాడు దాదా మన్సుఖ్.
చీరల షాపులో చేసేవాడు
ఇదివరకు ఒక చీరల దుకాణంలో పనిచేసేవాడు మన్సుఖ్. చాతనైనంత కాలం దుకాణ్లలోనే పనిచేసిన ఆయనకు వేరే పని తెలియదు. అయితే వయసు పైబడిందని గతంలో ఉద్యోగంలో నుంచి తీసేశారు. దినాం షాపుకు వెళ్లేవాడికి ఇంట్లో కూర్చోవడం బోరింగ్ అనిపించింది. దానికి తోడు తన కొడుకు ఉద్యోగం కూడా పోయింది. ఆదాయం లేదు. బీపీ ఉండె.. షుగర్ ఉండె. కనీసం మందు గోలీల కోసమైనా నా కష్టం నేను చేసుకుంటే బాగుంటుంది అని ఈ స్నాక్స్ బండి షురూ చేశాడు. "పెద్దగా కూడబెట్టినదేం లేదు కాబట్టీ నా ఖర్చులు నేనే వెల్లదీసుకుంటే బాగుంటది" అని అంటాడు తాత.
ఏం గుండె తాతా నీది.?
కొడుకుకు ఉద్యోగం దొరికింది. ఫ్యామిలీనంతా పోషించే స్థోమత ఉంది అతడికి. "దుకాణం బంద్ చెయ్" అని అడిగితే చెయ్యనంటాడు మన్సుఖ్. పని చేయడం గౌరవంగా ఉంటుందంటాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధనాలకు తలొగ్గొద్దనేది అతడి ఉద్దేశం. అందుకే ఇతరుల దయతో చేయి చాచి బతకడం కంటే తన పని తాను చేసుకుంటూ గౌరవంగా బతకడం అంటేనే ఇష్టం అని టేబుల్ మీద స్నాక్స్ పెట్టుకొని అమ్ముతున్నాడు. వయసు.. కష్టం.. ప్రపంచం ఏది చెప్పినా ఆగిపోకుండా ముందుకు సాగుతున్న దాదా మన్సుఖ్‌కు దండాలు.






