- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హై ప్రోటీన్ రైస్.. కొత్త రకాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. బెనిఫిట్స్ ఇవే..!
మనం రోజూ తినే సాధారణ బియ్యంలో 6-8% ప్రోటీన్ ఉంటుంది. కానీ కొత్తగా డెవలప్ చేసిన డిజైనర్ రకం బియ్యంలో 20%కి పైగా ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : మనం సాధారణంగా అన్నం వండుకొని తినే బియ్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ శాస్త్రవేత్తలు బయటి పరిస్థితుల్లో అభివృద్ధి చేసిన కొత్త రకం బియ్యం గురించి మీకు తెలుసా? భారత దేశంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) ఆదీనంలోని తిరువనంతపురంలో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIIST)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్ (high-protein,low-GI rice)ని డెవలప్ చేశారు.
ప్రోటీన్లు-పోషక విలువలు
మనం రోజూ తినే సాధారణ బియ్యంలో 6-8% ప్రోటీన్ ఉంటుంది. కానీ కొత్తగా డెవలప్ చేసిన డిజైనర్ రకం బియ్యంలో 20%కి పైగా.. అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని బ్రోకెన్ రైస్ (పగిలిన బియ్యం) నుంచి తయారు చేస్తారు. తర్వాత వాటిని ఫ్లోర్‌గా మార్చి, స్టార్చ్‌ను తగ్గించి, ప్లాంట్ ప్రోటీన్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ (ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12)తో రీ-అసెంబుల్ చేసి మళ్లీ గింజల రూపంలోకి తీసుకువస్తారు. అయితే ఇవి జన్యు సవరణ (genome-editing) ద్వారా సృష్టించినవి మాత్రం కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్ ద్వారా తయారు చేసినవి మాత్రమేనని వాటిని డెవలప్ చేసిన సైంటిస్టులు అంటున్నారు.
ఉపయోగాలేమిటి?
కొత్త రకం బియ్యం రుచి, వాసన, వండే విధానం కూడా సాధారణ బియ్యంలాగే ఉంటాయి. అంతేకాకుండా రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 55 కంటే తక్కువ (సాధారణంగా 54 లేదా అంతకంటే తక్కువ) ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి, మెటబాలిక్ హెల్త్ సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదనంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి మైక్రోన్యూట్రియెంట్స్ ఎంరిచ్ చేయడంవల్ల అనీమియా, మాల్‌న్యూట్రిషన్ వంటి సమస్యలను పోగొట్టడంలో ఈ బియ్యం సహాయపడతాయి.
అందుబాటులో ఉన్నాయా?
అంతేకాకుండా ఈ డిజైనర్ రైస్‌ను ఆహారంగా తీసుకోవడంవల్ల ప్రోటీన్ లోపం, డయాబెటిస్ వంటి సమస్యలకు ఒకే రకమైన ఆహారం ద్వారా పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. 2026 ఫిబ్రవరి 18న CSIR-NIIST టెక్ కనెక్ట్ ఈవెంట్‌లో ఈ రైస్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. టెక్నాలజీని Tata Consumer Products Ltd అండ్ SS Soul Foods (తమిళనాడు)కి ట్రాన్స్‌ఫర్ చేశారు. త్వరలో మాస్ ప్రొడక్షన్, కమర్షియల్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. ఇండియాలో బలవర్ధకమైన, పోషక విలువలుగల ఆహార భద్రతలో ఇది మరొక మైలురాయిగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఈ బియ్యం టాటా బ్రాండ్ కింద బహుశా ‘‘Smarter Rice’’ లేదా సిమిలర్ నేమ్‌తో అమెజాన్, సూపర్ మార్కెట్స్, రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.






