పెళ్లి చేసుకుంటారా లేక జాబ్ నుంచి తీసేయాలా.. సింగిల్స్‌కు ఆ కంపెనీ వార్నింగ్

by Sujitha Rachapalli |

చైనాలోని ఓ కంపెనీ షాకింగ్ పాలసీ ప్రవేశపెట్టింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షుంటియన్ కెమికల్ గ్రూప్ వివాహం చేసుకోని సింగిల్స్, మ్యారేజ్ అయ్యాక డివోర్స్ తీసుకున్న వారు..

పెళ్లి చేసుకుంటారా లేక జాబ్ నుంచి తీసేయాలా.. సింగిల్స్‌కు ఆ కంపెనీ వార్నింగ్
X

దిశ, ఫీచర్స్ : చైనాలోని ఓ కంపెనీ షాకింగ్ పాలసీ ప్రవేశపెట్టింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షుంటియన్ కెమికల్ గ్రూప్ వివాహం చేసుకోని సింగిల్స్, మ్యారేజ్ అయ్యాక డివోర్స్ తీసుకున్న వారు.. కంపెనీ ఉద్యోగులుగా కొనసాగాలంటే సెప్టెంబర్ కల్లా పెళ్లి చేసుకోవాలని ప్రకటించింది. లేదంటే జాబ్ నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే ఈ పాలసీ ప్రజల ఆగ్రహానికి కారణం కావడం, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో విత్ డ్రా చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

షుంటియన్ కెమికల్ గ్రూప్ 28 నుండి 58 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సెప్టెంబర్ నాటికి వివాహం చేసుకుని స్థిరపడాలని డిమాండ్ చేస్తూ జనవరిలో ఓ పాలసీని రూపొందించింది. మార్చి నాటికి అవివాహితులుగా ఉన్నవారు సెల్ఫ్ క్రిటిసిజమ్ లెటర్ సమర్పించాల్సి ఉంది. జూన్ వరకు కూడా అలాగే పెళ్లి చేసుకోకుండా ఉంటే తగిన మూల్యం చెల్లించుకోవాలసి ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ వరకు మింగిల్ కాకపోతే ఫైనల్‌గా జాబ్ నుంచి తొలగించడమే. కాగా ‘‘వివాహ రేటు మెరుగుపరచాలనే ప్రభుత్వ పిలుపుకు స్పందించకపోవడం నమ్మకద్రోహం. తల్లిదండ్రుల మాట వినకుండా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సహోద్యోగుల అంచనాలను విఫలం చేయడం అన్యాయం’’ అంటూ సాంప్రదాయ చైనీస్ విలువల గురించి ఈ పాలసీలో ప్రస్తావించింది.

ఎదురుదెబ్బ

అయితే ఈ విధానానికి వెంటనే రియాక్షన్ మొదలైంది. వివక్షతో కూడుకున్నదిగా విమర్శించారు. స్థానిక మానవ వనరులు, సామాజిక భద్రతా బ్యూరో కూడా కంపెనీతో మాట్లాడి.. ఒక్క రోజులోనే ఈ పాలసీని ఉపసంహరించేలా చేసింది. దీంతో వైవాహిక స్థితి కారణంగా ఏ ఉద్యోగులను తొలగించలేదని కంపెనీ స్పష్టం చేసింది. కాగా ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయ నిపుణులు.. ఈ విధానం స్వేచ్ఛగా వివాహం చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని అన్నారు. చైనా కార్మిక చట్టాల ప్రకారం కంపెనీలు ఉద్యోగ దరఖాస్తుదారులను వారి వివాహం లేదా ప్రసవ ప్రణాళికల గురించి ప్రశ్నించలేకూదన్నారు. ఈ విధానం చైనా కార్మిక చట్టం మరియు కార్మిక ఒప్పంద చట్టాన్ని ఉల్లంఘించిందని విమర్శలు గుప్పించారు.

ఆన్‌లైన్ ఆగ్రహం

కంపెనీ ప్రకటన ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ‘‘కంపెనీ వ్యాపారాన్ని చూసుకోవాలి. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలకు దూరంగా ఉండాలి’’, ‘‘ఇలా తొలగించబడితే బాధితులు న్యాయపరంగా భారీ పరిహారం పొందవచ్చు’’, ‘‘ ఇప్పుడు పెళ్లి అంటున్నారు తర్వాత పిల్లలు లేనందుకు ఉద్యోగులను శిక్షిస్తారా ఏంటి?’’ అని కామెంట్స్ పెడుతున్నారు.

చైనాలో తగ్గుతున్న వివాహ రేటు

చైనాలో వివాహాల రేటు బాగా తగ్గుతున్నందున ఈ వివాదం తలెత్తింది. 2023లో వివాహాల సంఖ్య 6.1 మిలియన్లకు పడిపోయింది. ఇది గత సంవత్సరం 7.68 మిలియన్ల నుంచి 20.5% తగ్గింది. అయినప్పటికీ దేశంలో 2024లో 9.54 మిలియన్ల నవజాత శిశువులు నమోదయ్యారు. ఇది 2017 తర్వాత జనన రేటులో మొదటి పెరుగుదల. డ్రాగన్ ఏడాదిలో పిల్లలను కనడానికి ఇష్టపడే కుటుంబాలు ఈ పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు నిపుణులు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు.

Next Story